చిదంబరంపై మరో బాంబు పేల్చిన స్వామి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టారు. కార్తి, అతని కంపెనీలకు సంబంధించిన దాదాపు 21 రహస్య విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేసి చిదంబరం, ఆయన కుటుంబంపై పెద్ద బాంబు పేల్చారు. ఈ వివరాలను మీడియాకు వెల్లడించిన స్వామి త్రీవమైన ఆరోపణలు చేశారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్ను అధికారుల అలక్ష్యం కారణంగా ఈ కఠోర అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
చిదంబరం కొడుకు కార్తీకానీ,అతని పేరెంట్ ఇండియన్ భారతీయ కంపెనీలుకానీ ఈ విదేశీ బ్యాంకు ఖాతాల కార్డులు వివరాలను ఆదాయపు పన్ను అధికారులకు వెల్లడించలేదని ఆరోపించారు. ముఖ్యంగా మొనాకో బార్క్లేస్ బ్యాంక్, కెనడాలోని బ్యాంక్ మెట్రో, సింగపూర్ లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఓసీబీసీ, కెనడాలోని హెచ్ఎస్బీసి , ఫ్రాన్స్ లో డ్యుయిష్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లో యూబీఎస్, కాలిఫోర్నియా లోని వెల్స్ ఫార్గో బ్యాంక్ లాంటి వివిధ విదేశీ బ్యాంకుల ఖాతాలను ఆయన సోమవారం వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీ ఈ ఖాతాలను రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాడని పేర్కొన్నారు.
ఆర్థికమంత్రిత్వశాఖలోని సన్నిహితులపై చిదంబరం ఒత్తిడి మూలంగానే గత ఎనిమిది నెలలుగా చెన్నై ఆదాయ పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 2014 ఎన్నికల సందర్భంగా లోక్ సభకు పోటీ చేసిన కార్తీ ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఖాతాల వివరాలను ప్రకటించలేదని చెప్పారు. ఈ జాబితా, ఖాతాల నెంబర్లు, గతంలో తాను మోదీకి రాసిన లేఖ, కార్తీ ఆదాయ ప్రకటన వివరాలను స్వామి మీడియాకు అందించారు.
ఫిబ్రవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతంలో ఒకలేఖ రాశానని చెప్పుకొచ్చారు. ఎయిర్ సెల్ మాక్సిస్ స్కాం కుంభకోణంపై పలు ఆరోపణలు గుప్పించిన ఆయన ఈ కుంభకోణంలో చిదంబరం, ఆయన కుమారుడు ప్రమేయంపై తాను సాక్ష్యాలను సమర్పించినా, హెచ్చరించినా కూడా సీబీఐ, ఈడీ తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొంతమంది బీజేపీ నాయకులు అవినీతి నిరోధక చట్టాన్ని నీరుకార్చేందకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చర్యను తాను వ్యతిరేకిస్తున్నానని, దీని అంతు తేలేవరకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. దీనికోసం పార్లమెంట్ లో సవరణలు ప్రతిపాదించనున్నట్టు చెప్పారు.