Secretary posts
-
నటి సుకన్యరాజాకి రజనీకాంత్ పార్టీ కార్యదర్శి పగ్గాలు
తమిళసినిమా: సింగపూర్‌లో పార్టీ కార్యదర్శి పగ్గాలను రజనీకాంత్ నటి సుకన్య రాజాకు అప్పగించారు. నటుడు రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్లో రాజకీయరంగప్రవేశంపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన అభిమాన సంఘాలను ప్రజాసంఘాలుగా మార్చి రాష్ట్రవ్యాప్తంగా కార్య నిర్వాహకులను నియమిస్తున్నారు. పుదుచ్చేరిలోనూ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. రజనీకాంత్‌కు జపాన్, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆయా దేశాల్లోనూ తన పార్టీకి నిర్వాహకులను నియమిస్తున్నారు. అందులో భాగంగా సింగపూర్‌లో పార్టీ కార్యదర్శి బాధ్యతలను నటి సుకన్య రాజాకు అప్పగించారు. ఈమె చిన్నతనం నుంచి రజనీకాంత్‌కు వీరాభిమాని. సుకన్యరాజాకు రజనీకాంత్ కాలా చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. అందులో తను రజనీకాంత్ కోడలిగా నటించింది. ఆ విధంగా రజనీకాంత్‌కు పరిచయమైన సుకన్యరాజా పూర్వీకులది దిండుగల్. తండ్రి ఉద్యోగం రీత్యా సుకన్యరాజా కుటుంబం సింగపూర్‌లో సెటిల్ అయ్యారు. దీంతో ఆమెకు రజనీకాంత్ సింగపూర్‌లో పార్టీ కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. సుకన్యరాజా మాట్లాడుతూ రజనీకాంత్‌కు విదేశాల్లోనూ అభిమానులు ఉన్న విషయం తెలిసిందేనన్నారు. ముఖ్యంగా సింగపూర్‌లో తమిళనాడులో అభిమానులకు సమానంగా ఉన్నారని చెప్పింది. అయితే వారంతా విడివిడిగా సంఘాలు నిర్వహిస్తున్నారని, అలాంటి వారందరినీ ఒక్క తాటిపై తీసుకురావడమే తన కర్తవ్యం అని అంది. రజనీకాంత్ తనను నమ్మి చాలా పెద్ద బాధ్యతను అప్పగించారని, దాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తానని సుకన్య రాజా పేర్కొంది. -
యార్డు సెక్రటరీ పోస్టుకు పైరవీలు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీగా తమకు అనుకూలమైన ఉద్యోగిని నియమించుకునేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం దుగ్గిరాల మార్కెట్ యార్డు సెక్రటరీగా ఉన్న బ్రహ్మయ్యను గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీగా బదిలీ చేయించేందుకు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో ఎంపీడీఓగా పనిచేసిన బ్రహ్మయ్యను నోషనల్ ప్రమోషన్ ఇచ్చి మార్కెటింగ్ శాఖలో డీడీ క్యాడర్లో దుగ్గిరాల మార్కెట్ యార్డు సెక్రటరీగా నియమించారు. గతంలోనే ఈ నియమాకంపై మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మంత్రి గట్టిగా పట్టు పట్టడంతో చట్టాన్ని తుంగలో తొక్కారు. ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్దదైన మార్కెట్ యార్డుకు సెక్రటరీగా వచ్చేందుకు మంత్రి ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు మార్కెట్ యార్డు సెక్రటరీగా పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పసుపు అమ్మకాలపై ఆరోపణలు దుగ్గిరాల మార్కెట్ యార్డులో రోజుకు వెయ్యి బస్తాలకు పైగా పసుపు అమ్మకాలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్లో రైతులు సరుకును అమ్ముకునే వెసులుబాటు ఉంది. మార్కెట్ సిబ్బంది బహిరంగ వేలం పెడతారు. దీంట్లో అత్యధిక ధర పాడిన వారికి, రైతు అనుమతితో లాటును కేటాయిస్తారు. మార్కెట్ యార్డు వారు తయారు చేసిన సేల్ పట్టి ప్రకారం రైతులకు డబ్బులు కట్టిన తర్వాతనే కోనుగోలు చేసిన వ్యాపారి రైతు అనుమతితో సరుకును తీసుకువెళ్తారు. ఈ ప్రక్రియ ఆరు దశాబ్దాలుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్ యార్డులో సరాసరి రోజుకు వెయ్యి బస్తాలు కోనుగోలు జరగాల్సి ఉండగా, కేవలం 100 బస్తాలు మాత్రమే పోతలు పోస్తున్నట్లు, దీంతో కూలీ గిట్టుబాటు కావటం లేదని మార్కెట్ యార్డులోని హమాలీలు పలు మార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. గతంలో మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు కొనుగోళ్లలో అవకతవలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అయితే మార్కెట్లో 100 శాతం ఈ–నామ్ పద్ధతిలో పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయని సీఎం చేతుల మీదుగా బ్రహ్మయ్య అవార్డును అందుకోవడం మార్కెటింగ్ శాఖ ఉద్యోగలను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలోనూ ప్రయత్నం గతేడాదే బ్రహ్మయ్యను గుంటూరు మిర్చియార్డు సెక్రటరీగా నియమించాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే మార్కెట్ యార్డు చైర్మన్, బ్రహ్మయ్య ఒకే సామాజిక వర్గాని చెందిన వారు కావడంతో ఒక వరలో రెండు కత్తులు ఇమడవనే భావనతో దుగ్గిరాల యార్డు సెక్రటరీగా నియమించినట్లు సమాచారం. తాజాగా ఈ నెల 28తో ప్రస్తుత మార్కెట్ యార్డు పాలక వర్గం పదవీ కాలం ముగుస్తోంది. ఈ క్రమంలో బ్రహ్మయ్యను గుంటూరు యార్డు సెక్రటరీగా తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. మార్కెట్ యార్డులో పనులు చక్క దిద్దాలంటే, తమకు అనుకూలమైన అధికారిని ఉండాల్సిందేనని, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను మంత్రి పట్టుబడుతున్నట్లు వినికిడి. ఇతర శాఖల అధికారులను మార్కెటింగ్ శాఖలో నియమించటం ఏమిటని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
నిరుద్యోగులకు గాలం.
సాక్షి, గుంటూరు :జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీపై అవినీతి నీడలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న 40 కార్యదర్శి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నెల కిందట నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచీ 7, 136 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయాలి. డిగ్రీ మూడేళ్ల కాలంలో సాధించిన మార్కులకు 75 శాతం మార్కుల్ని వెయిటేజీగా నిర్ణయించి, ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద డెసెంటింగ్ ఆర్డర్లో పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో రిజర్వేషన్ కూడా పాటించాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1010 పంచాయతీలు ఉండగా, కేవలం 525 మంది మాత్రమే కార్యదర్శులున్నారు. వీరిలో 31 మంది కాంట్రాక్టు కార్యదర్శులే ఉన్నారు. ఇలాంటివారికి కార్యదర్శి పోస్టుల భర్తీలో 25 శాతం వెయిటేజీ కల్పించారు. డిగ్రీలో వీరికొచ్చిన మార్కులకు వెయిటేజీ మార్కులు కలిపి పోస్టులకు ఎంపిక చేయాల్సి ఉంది. డిగ్రీలో సరైన మార్కులు లేకుంటే కాంట్రాక్టు కార్యదర్శుకు ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయా అభ్యర్థులు కొందరు తమ ఉద్యోగాలను ప్రతిభగల అభ్యర్థులు తన్నుకెళతారన్న భయంతో ఎలాగోలా ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరి భయాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు రాజకీయ దళారులు రాష్ట్ర, కేంద్ర మంత్రులతో తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఉద్యోగాలు వేయిస్తామంటూ బేరాలు మొదలు పెట్టారు. వీరికి కొందరు అధికారులు కూడా సహకారం అందిస్తున్నట్లు సమాచారం. మెరిట్ అభ్యర్థుల్ని ముందుగానే గుర్తించిన కొందరు కీలక అధికారులు ఆయా అభ్యర్థులకే గాలం వేస్తున్నారని వినికిడి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3 నుంచి 5 లక్షలు రాబట్టేందుకు తెరవెనుక ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిసింది. తెనాలికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి, ఓ జూనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగి, డివిజినల్ స్థాయిలోని మరో కీలకమైన అధికారి చక్రం తిప్పుతున్నారని తెలిసింది. డిగ్రీలో మంచి మార్కులొచ్చిన మెరిట్ అభ్యర్థులు కూడా వీరి మాటల్ని నమ్మి ఉద్యోగం కోసం లక్షలు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పెరిగిన మంత్రుల సిఫార్సులు ఇదిలా ఉండగా, జిల్లా మంత్రులతో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం జిల్లా అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. వీరికి సమాధానం చెప్పలేక జిల్లా పంచాయతీ అధికారి సతమతమవుతున్నారని సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు కీలకమైన మంత్రులు కూడా సెక్రెటేరియట్ నుంచి ఫోన్లు చేసి డీపీవోను ఇబ్బంది పెడుతున్నారు. డిసెంబర్ మూడో తేదీ లోగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కానున్నందున ఫోన్లు, సిఫార్సుల తాకిడి బాగా పెరిగినట్లు తెలిసింది. దళారుల మాటలు నమ్మొద్దు: డీపీఓ పంచాయతీ కార్యదర్శి పోస్టులు పూర్తిగా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తామనీ, నిరుద్యోగులెవ్వరూ దళారులు, ఇతర వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ సూచించారు. ఈ నెల 25న స్క్రూట్నీ నిర్వహించి నెలాఖరులోగా ఎంపిక జాబితాను పూర్తి చేస్తామని, ఆపై కలెక్టర్ నుంచి అనుమతి తీసుకుని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను డీపీవో, కలెక్టరేట్లలో అందుబాటులో ఉంచుతామన్నారు.