నిరుద్యోగులకు గాలం.
Published Mon, Nov 25 2013 3:42 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
సాక్షి, గుంటూరు :జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీపై అవినీతి నీడలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న 40 కార్యదర్శి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నెల కిందట నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచీ 7, 136 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయాలి. డిగ్రీ మూడేళ్ల కాలంలో సాధించిన మార్కులకు 75 శాతం మార్కుల్ని వెయిటేజీగా నిర్ణయించి, ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద డెసెంటింగ్ ఆర్డర్‌లో పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో రిజర్వేషన్ కూడా పాటించాల్సి ఉంది.
ప్రస్తుతం జిల్లాలో 1010 పంచాయతీలు ఉండగా, కేవలం 525 మంది మాత్రమే కార్యదర్శులున్నారు. వీరిలో 31 మంది కాంట్రాక్టు కార్యదర్శులే ఉన్నారు. ఇలాంటివారికి కార్యదర్శి పోస్టుల భర్తీలో 25 శాతం వెయిటేజీ కల్పించారు. డిగ్రీలో వీరికొచ్చిన మార్కులకు వెయిటేజీ మార్కులు కలిపి పోస్టులకు ఎంపిక చేయాల్సి ఉంది. డిగ్రీలో సరైన మార్కులు లేకుంటే కాంట్రాక్టు కార్యదర్శుకు ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయా అభ్యర్థులు కొందరు తమ ఉద్యోగాలను ప్రతిభగల అభ్యర్థులు తన్నుకెళతారన్న భయంతో ఎలాగోలా ఉద్యోగాన్ని పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
వీరి భయాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు రాజకీయ దళారులు రాష్ట్ర, కేంద్ర మంత్రులతో తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఉద్యోగాలు వేయిస్తామంటూ బేరాలు మొదలు పెట్టారు. వీరికి కొందరు అధికారులు కూడా సహకారం అందిస్తున్నట్లు సమాచారం. మెరిట్ అభ్యర్థుల్ని ముందుగానే గుర్తించిన కొందరు కీలక అధికారులు ఆయా అభ్యర్థులకే గాలం వేస్తున్నారని వినికిడి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.3 నుంచి 5 లక్షలు రాబట్టేందుకు తెరవెనుక ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిసింది. తెనాలికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి, ఓ జూనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగి, డివిజినల్ స్థాయిలోని మరో కీలకమైన అధికారి చక్రం తిప్పుతున్నారని తెలిసింది. డిగ్రీలో మంచి మార్కులొచ్చిన మెరిట్ అభ్యర్థులు కూడా వీరి మాటల్ని నమ్మి ఉద్యోగం కోసం లక్షలు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
పెరిగిన మంత్రుల సిఫార్సులు
ఇదిలా ఉండగా, జిల్లా మంత్రులతో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం జిల్లా అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. వీరికి సమాధానం చెప్పలేక జిల్లా పంచాయతీ అధికారి సతమతమవుతున్నారని సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు కీలకమైన మంత్రులు కూడా సెక్రెటేరియట్ నుంచి ఫోన్లు చేసి డీపీవోను ఇబ్బంది పెడుతున్నారు. డిసెంబర్ మూడో తేదీ లోగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కానున్నందున ఫోన్లు, సిఫార్సుల తాకిడి బాగా పెరిగినట్లు తెలిసింది.
దళారుల మాటలు నమ్మొద్దు: డీపీఓ
పంచాయతీ కార్యదర్శి పోస్టులు పూర్తిగా డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తామనీ, నిరుద్యోగులెవ్వరూ దళారులు, ఇతర వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ సూచించారు. ఈ నెల 25న స్క్రూట్నీ నిర్వహించి నెలాఖరులోగా ఎంపిక జాబితాను పూర్తి చేస్తామని, ఆపై కలెక్టర్ నుంచి అనుమతి తీసుకుని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను డీపీవో, కలెక్టరేట్లలో అందుబాటులో ఉంచుతామన్నారు.
Advertisement
Advertisement