పీఎఫ్‌ రుణాల్లో భారీ కుంభకోణం..! | Corruption In Guntur Muncipolity On PF Loans | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ రుణాల్లో భారీ కుంభకోణం..!

Published Wed, Apr 18 2018 7:25 AM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM

Corruption In Guntur Muncipolity On PF Loans - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మరో కుంభకోణం వెలుగు చూసింది. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి పీఎఫ్‌ రుణాల  వ్యవహారంలో వారికి సంబంధం లేకుండా దళారులు మార్చేసిన వైనం బయటపడింది. ఏకంగా మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (ఎంహెచ్‌వో), ఓ క్లర్క్‌ సంతకాలను ఫోర్జరీ చేసి పారిశుద్ధ్య కార్మికులకు తెలియకుండా వారి పీఎఫ్‌ ఖాతాల నుంచి రుణాలు మంజూరు చేస్తూ ఆ డబ్బును వేరే ఖాతాలకు మళ్లిస్తున్నట్లు అధికారులు మంగళవారం గుర్తించి, వాటిని నిలిపివేయడంతోపాటు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అధికారులు వెళ్లే సమయానికి ఐదుగురు కార్మికులకు పీఎఫ్‌ రుణాలు మంజూరు చేయడంతోపాటు డీడీలు సైతం సిద్ధం చేశారు. తాను పీఎఫ్‌ లోనుకు దరఖాస్తు చేసుకోకపోయినా తన పేరుతో రుణం రావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఓ కార్మికుడు ఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడం, ఆమె పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో పీఎఫ్‌ రుణాల కుంభ కోణం బయటపడింది. రుణాలను నిలిపివేయించి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

నిరక్షరాస్యులే లక్ష్యంగా..
గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులకు 2000 సంవత్సరం నుంచి పీఎఫ్‌ కట్‌ చేస్తూ నగరపాలక సంస్థ సైతం పీఎఫ్‌  డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. అయితే పారిశుద్ధ్య కార్మికుల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులు కావడంతో వారికి పీఎఫ్‌ చెల్లింపులు, ఈఎస్‌ఐ వ్యవహారాలు చూస్తూ చనిపోయిన వారికి క్లయిమ్‌లు ఇప్పించేందుకు ఓ కాంట్రాక్టు సంస్థను అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు నియమించారు. అయితే కార్మికులకు సంబంధించి పీఎఫ్‌ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిన కాంట్రాక్టు సంస్థ పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో దళారులు చేరి పారిశుద్ధ్య కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి అప్పులు ఇవ్వడం, ఖాళీ పేపర్ల మీద సంతకాలు చేయించుకుని వారి డబ్బులు కాజేయడం పరిపాటిగా మారింది. దీంతో కష్టపడి పనిచేసిన డబ్బు ఇళ్లకు చేరక, కుటుంబాలకు గడవక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు.

ఈ వ్యవహారం బయటపడిందిలా..
నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలోని మలేరియా విభాగంలో గోడౌన్‌ కీపర్‌గా పనిచేస్తున్న కేశవరావు అనే కార్మికునికి బుధవారం ఓ మెసేజ్‌ వచ్చింది. మీరు పెట్టుకున్న పీఎఫ్‌ లోను మంజూరు అయిందనేది ఆ మెసేజ్‌ సారాంశం. దీంతో అవాక్కు అయిన కేశవరావు తాను పీఎఫ్‌ లోను కోసం అసలు దరఖాస్తు చేయలేదని ఫిర్యాదు చేశాడు. రికార్డులు పరిశీలించిన ఎంహెచ్‌వో డాక్టర్‌ శోభారాణి కేశవరావు పేరుతో పీఎఫ్‌ లోనుకు ఎటువంటి సిఫార్సు చేయలేదని నిర్ధారించుకున్నారు. వెంటనే పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించగా కేశవరావు పేరుతో ఉన్న దరఖాస్తులో తన సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన ఆమె మరో నాలుగు లోన్‌లకు సంబంధించి డీడీలు సైతం సిద్ధమైనట్లు తెలుసుకుని వాటిని నిలిపివేయించారు. సదరు డబ్బును చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి అకౌంట్‌కు జమ చేసేలా ఏర్పాట్లు చేయడంపై పూర్తి వివరాలు తీసుకుని విచారణ జరుపుతున్నారు.  కాంట్రాక్టు సంస్థ, అధికారులు పాత్ర ఏ మేరకు ఉందనేది వేచి చూడాల్సి ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు తెలియకుండా పీఎఫ్‌ లోన్‌లు కాజేస్తున్న వైనం బయటకు రావడంతో గతంలో సైతం ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరెవరి పేర్లతో ఎంతెంత లోన్‌లు మార్చుకున్నారో తెలియక పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో క్రిమినల్‌ కేసు పెడతాం
నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కేశవరావు అనే పారిశుద్ధ్య కార్మికునికి తెలియకుండా ఆయన పీఎఫ్‌ ఖాతా నుంచి లోన్‌లు మంజూరు చేయించుకుని కాజేస్తున్న వైనం బయటపడింది. దీనిపై పీఎఫ్‌ అధికారులతో పాటు, మేము పూర్తి విచారణ జరుపుతాం. గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అనేదానిపై ఆరా తీస్తున్నాం. ఫోర్జరీ వ్యవహారంపై కమిషనర్‌ ఆదేశాల మేరకు క్రిమినల్‌ కేసు నమోదు చేయిస్తాం. ఇకమీదట  పారిశుద్ధ్య కార్మికుల ఆధార్‌ కార్డులను ఆన్‌లైన్‌ చేసి వారి బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసి  పీఎఫ్‌ లోన్‌లు నేరుగా వారి అకౌంట్‌లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్‌ శోభారాణి, ఎంహెచ్‌వో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement