తప్పు చేసి తప్పించుకోవడం అక్కడ అధికారులకు పరిపాటి.. అక్రమాలకు సహకరిస్తూ అవినీతికి పాల్ప డడం .. ఉన్నతాధికారులు చర్యలు చేపడితే అధికార పార్టీ నేతల ద్వారా ఒత్తిడి తెచ్చి తప్పించుకోవడంవీరికి వెన్నతో పెట్టిన విద్య. అవినీతి వ్యవహారం బయటపడిన ప్రతిసారీ విచారణల పేరుతో హడావుడి చేయడం.. ఆ తరువాత చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం షరామామూలే. ఇదీ కార్పొరేషన్‌లో కొందరు అధికారులు తీరు. కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి వచ్చినా.. కలెక్టర్ మందలించినా.. ఉన్నతాధికారులు తలంటినా వీరు మారరంతే.
సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థలో చిన్న అవినీతి వ్యవహారాల నుంచి భారీ స్థాయి కుంభకోణాల వరకు ఏది బయటకు వచ్చినా రెండు, మూడు రోజుల్లో తూతూమంత్రపు చర్యలతో దృష్టి మరల్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కమిషనర్ల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ కొందరు అధికారులు సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. కలుషిత నీటితో 20 మందికి పైగా మృత్యువాత పడిన సంఘటనతో కమిషనర్‌ను మార్చి ఐఏఎస్ అధికారిని నియమించినప్పటికీ అవినీతి అధికారులు తమ పంథాను మార్చుకోవడం లేదు.
పింఛన్లు మింగేసినా పట్టించుకోరు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడాదిన్నర క్రితం వృద్ధులు, వితంతులు, వికలాంగులకు నెలనెలా ఇచ్చే పింఛన్‌లను ఉన్నతాధికారుల డిజిటిల్ సైన్ దుర్వినియోగం చేసి లక్షల్లో డబ్బు కాజేసిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏడాదిన్నర దాటుతున్నా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారే తప్ప ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులను గుర్తించి తమకు ఫిర్యాదు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీసు అధికారులు సూచించినప్పటికీ వీరు స్పందించడం లేదు.
బదిలీ చేసినా కదలరు
గుంటూరు నగరంలోని ఓల్డ్ క్లబ్ రోడ్డులో గత కమిషనర్ అనురాధ అక్రమ నిర్మాణాలను గుర్తించి పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తీసుకున్నారు. అనధికారిక నిర్మాణాలకు సహకరించిన ముగ్గురు చైన్‌మెన్‌లను అంతర్గత బదిలీలు చేశారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న సదరు చైన్‌మెన్‌లు మాత్రం బదిలీ చేసిన డివిజన్‌లకు వెళ్లకుండా తమ స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినప్పటికీ ఏదో ఒక సాకు చూపుతూ వారిని అక్కడే కొనసాగిస్తున్నారు.
ఖాతాలు తారుమారైనా బేఖాతరే..
తాజాగా కమిషనర్ ఖాతాలో జమ కావాల్సిన ఉద్యోగుల జీపీఎఫ్, పీఎఫ్, లోనులకు చెల్లించాల్సిన రూ. 20 లక్షల నిధులు పారిశుద్ధ్య కార్మికుని ఖాతాల్లో జమ కావడం తీవ్ర కలకలం రేపింది. పారిశుద్ధ్య కార్మికుడు రూ. 2.5 లక్షలు విత్ డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వినియోగించుకున్నట్లు సమాచారం. కమిషనర్ ఖాతాలో జమ కావాల్సిన నిధులు పారిశుద్ధ్య కార్మికుని ఖాతాలోకి ఎలా వెళ్లాయి. ఎవరు మార్చారనే దానిపై విచారణ చేస్తున్నారు. అయితే ఈ అంశాన్నీ ఏదో ఒక సాకు చూపి పక్కన పడేస్తారా ? నిజమైన దోషులను తేల్చి కఠిన చర్యలు తీసుకుంటారా ? అనేది వేచి చూడాలి. ఇవే కాకుండా నగరపాలక సంస్థ పరిధిలో ఇంజినీరింగ్, టౌన్, ప్రజారోగ్య, రెవెన్యూ విభాగాల్లో అనేక అవినీతి వ్యవహారాలు, కుంభకోణాలు బయటపడినప్పటికీ విచారణల పేరుతో తాత్సారం చేస్తున్నారు.
అన్నీ అక్రమాలే..
టీడీఆర్ బాండ్‌ల పంపిణీలో అవకతవకలు, లేబర్ చెస్‌లో గోల్‌మాల్, అనధికార నిర్మాణాల వ్యవహారంలో, బిల్డింగ్ ప్లాన్ మంజూరు సమయంలో ఖాళీ స్థలాలపై 14 శాతం పన్ను రాయితీ వ్యవహారంలో జరిగిన భారీ స్థాయి కుంభకోణాల్లో సైతం తూతూమంత్రపు చర్యలు తప్ప, సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో అవినీతి అధికారులకు ఉన్నతాధికారులంటే లెక్క లేకుండాపోతోంది. దీంతో ఐఏఎస్ అధికారులు కమిషనర్‌లుగా వచ్చినప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా అవినీతి వ్యవహారాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కమిషనర్, కలెక్టర్‌లు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించి చర్యలు చేపట్టకపోతే వీరిని అదుపు చేయడం ఎవరి తరం కాని పరిస్థితి ఏర్పడుతుంది.
పన్నులు వసూలు కాగానేబదిలీ చేస్తాం
అనధికారిక నిర్మాణాల విషయంలో ముగ్గురు చైన్‌మెన్‌లను గత కమిషనర్ అనురాధ అంతర్గత బదిలీ చేసిన విషయం వాస్తవమే. వాళ్లు ప్రస్తుతం బదిలీ ప్రాంతాలకు వెళ్లకుండా ఇదే ప్రాంతంలో కొనసాగుతున్నారు. ప్రకటనల పన్నుల వసూళ్లు పూర్తయ్యాక బదిలీ స్థానానికి పంపుతాం. – చక్రపాణి, సిటీ ప్లానర్
Comments
Please login to add a commentAdd a comment