సాక్షి గుంటూరు: నగరపాలక సంస్థ కార్యాలయంలో పూర్తి అడిషనల్ ఇన్‌చార్జి కమిషనర్ బాధ్యతలు నిర్వహించిన కె. రామచంద్రారెడ్డి అమోదించిన పలు ఫైళ్లపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ వ్యక్తిగత సెలవులపై అక్టోబర్ 28 నుంచి నవంబరు 11వ తేదీ వరకు వెళ్లడంతో ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా అదనపు కమిషనర్ కె. రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు కేటాయించారు. ఆయన హయాంలో పలు విభాగాలకు చెందిన ఫైళ్ల అమోదంపై అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతస్థాయి అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ అనేక కారణాలతో పెండింగ్‌లో పెట్టిన ఫైళ్లను అధికార పార్టీ నాయకులు, దళారీల ప్రలోభాలకు లొంగి ఇన్‌చార్జి కమిషనర్ అమోదించినట్లు సమాచారం. సమగ్ర మంచినీటి పథకానికి సంబంధించిన ఒక కాంట్రాక్టు సంస్థకు రూ.2 కోట్లు వరకు బిల్లులు చెల్లింపులకు అమోదం చేసినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి తనఖా స్థలాన్ని రిలీజ్ చేస్తూ మాన్యువల్ ఫైల్, పలు బిల్డింగ్‌లకు ఆన్‌లైన్‌లో అక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అమోదించినట్లు సమాచారం. ఎలక్షన్ విభాగంలో ఎనిమిది మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడం, సస్పెండ్ నుంచి రీకాల్ అయిన ఇంజనీరింగ్ సిబ్బందికి కీలక రిజర్వాయర్‌లో నియమకాలు చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో పది వరకు నామినేషన్లు పనులకు అనుమతులు, టెండర్లు సైతం ఫైనలైజేషన్ చేశారు. కమిషనర్ శ్రీకేష్ పెండింగ్‌లో ఉంచిన పలు పనుల్ని నామినేషన్ మీద చేసిన బిల్లులు అమోదించినట్లు సమాచారం.
కమిషనర్ చాంబర్ నుంచి వివరాల సేకరణ
ఇన్‌చార్జి కమిషనర్ అమోదించిన ఫైళ్లపై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో విభాగాల వారీగా వివరాలను కమిషనర్ చాంబర్ సిబ్బంది సేకరిస్తున్నట్లు సమాచారం. అమోదించిన ఈ–ఫైల్ నంబర్ ఇవ్వాలని పలువురు విభాగాధిపతులను కోరినట్లు తెలుస్తోంది. ఎలక్షన్ సెల్‌లో నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పిలిపించి డబ్బులు ఏమైనా ఇచ్చారా? అనే దానిపై విచారిస్తున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జి కమిషనర్ దళారులు, కొందరు ఉద్యోగుల మధ్యవర్తిత్వంతో పలు పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని, ఆయన చాంబర్ వద్ద పెద్దఎత్తున అధికారులు, మధ్యవర్తులు పైళ్లతో తిరుగుతున్నారని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ కోన శశిధర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ శనివారం ఇన్‌చార్జి కమిషనర్‌కు ఫోన్ చేసి పిలిపించి ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవద్దని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సోమవారం విధులకు హాజరైన కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ ఎన్నికల విభాగంలో నూతనంగా నియమించిన అభ్యర్థుల్ని చాంబర్‌కు పిలిపించి విచారించినట్లు తెలిసింది. ఇన్‌చార్జి కమిషనర్ అమోదించిన బిల్లులపై ఆరా తీస్తుండటంతో కొందరు అధికారులు, దళారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగుల నియామకాలతోపాటు, సస్పెండ్ నుంచి రీకాల్ అయిన పలువురు అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలోనూ కొందరు దళారులు భారీ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ వీరందరినీ పిలిచి విచారిస్తుండటంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే వణికి పోతున్నారు.
అవకతవకలకు పాల్పడలేదు
ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న సమయంలో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశాను. ఉద్యోగుల నియామకంలో గానీ, సస్పెండ్ నుంచి రీకాల్ అయిన సిబ్బందికి పోస్టింగ్‌లు మాత్రమే ఇచ్చాను. కలెక్టరేట్ హెచ్ సెక్షన్ ఆదేశాల మేరకే అత్యవసరంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాం. టౌన్ ప్లానింగ్‌లో డ్రీమ్డ్ అప్రూవల్ అయ్యే అవకాశం ఉన్న ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లు మాత్రమే ఆమోదించాను. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామంటూ ఎన్‌సీసీ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో గతంలో చేసిన పనులకు రూ. 2.50 కోట్లు మంజూరు చేశాను. ఈఫైళ్లపై నన్ను ఎవరు వివరాలు అడగలేదు. – కె.రామచంద్రారెడ్డి, అదనపు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment