కార్మికులకు అండగా ఉంటాం
- వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్
పటాన్చెరు: కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం పటాన్చెరు పారిశ్రామిక వాడలో సీఎంహెచ్ టూల్స్ పరిశ్రమ గేటు వద్ద వైఎస్సార్ టీయూసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సమస్యలపై పోరాటం చేసేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. యాజమాన్యాల మెడలు వంచి అయినా సరే కార్మిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పటాన్చెరులో జెండా ఆవిష్కరించామన్నారు. త్వరలోనే అన్ని పరిశ్రమల్లో పార్టీ అనుబంధ జెండాను ఆవిష్కరిస్తామన్నారు. కనీస వేతనాలు, తదితర కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నర్రభిక్షపతి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో కార్మిక సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. స్థానిక పారిశ్రామిక వాడలో వైఎస్సార్టీయూసీ బలంగా ఉందన్నారు. చౌగ్లే మ్యాట్రిక్స్ యాజమాన్యం ఏక పక్షంగా వ్యవహరిస్తోందన్నారు. యూనియన్ జెండా ఆవిష్కరణకు అనుమతించలేదన్నారు. పరిశ్రమలోని కార్మికులకు అండగా ఉంటామన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకున్న సంస్థలేవీ మనుగడ సాగించలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సంజీవరావు, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, పట్లోళ్ల నరేందర్‌రెడ్డి, నాగులపల్లి ఎంపీటీసీ సభ్యులు రమేష్, ఆర్ సీపూర్ పట్టణ అధ్యక్షుడు వేణు, సీఎస్టీ వెలినాక్స్ పరిశ్రమ ప్రధాన కార్యదర్శి భాస్కర్, సీఎంహెచ్ టూల్స్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు, వైస్ ప్రసిడెంట్ దివాకర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, ఆ కార్మిక సంఘం నాయకులు నాయుడు, వెంకటేశ్వర్రావు, భాస్కర్, పార్టీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.