రైల్వేలో మ్యాన్ ఆఫ్ ద మంత్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: కర్తవ్య నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ.. అవాంఛనీయ పరిస్థితులను అధిగమించడంలో అప్రమత్తంగా వ్యవహరించిన 13 మంది ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ‘మ్యాన్ ఆఫ్ ద మంత్’అవార్డులను ప్రదానం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత, రైళ్ల సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రైలు పట్టాల పునరుద్ధరణ, సిగ్నల్ వ్యవస్థ, వెల్డింగ్ వైఫల్యాలపై దృష్టి పెట్టి అవాంఛనీయ సంఘటనలకు తావీయకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
భద్రతకు సంబంధించిన విషయాల్లో గేట్మెన్, ట్రాక్‌మెన్, లోకో పైలట్లు, గార్డులకు అవగాహన కల్పించి రైళ్లు సాఫీగా నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నడుస్తున్న రైళ్లలో, స్టేషన్లలో అగ్నిమాపక వ్యవస్థను పరిశీలించి అగ్ని ప్రమాదాలు జరగకుండా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ కె.వి.శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వై జర్ (పీఎఫ్ఏ) బ్రజేంద్ర కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎన్.వి.రమణారెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డెరైక్టర్ టి.జె.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.