seek
-
చిక్కుల్లో రిలయన్స్ జియో..?
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లో ఎదురులేని మహారాజుగా వెలుగుతున్న రిలయన్స్ జియోని భారీ డేటా లీక్ షాక్ బాగానే తగిలింది. ఆన్లైన్లో తమ వినియోగదారులకుచెందిన సమాచారం లీకైందన్న వార్తలతో ఇబ్బందుల్లో పడిన జియోకు తాజాగా చిక్కులు తప్పేలా లేవు. కోట్లాదిమంది జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడంపై టెలికాం శాఖ స్పందించింది. త్వరలోనే దీనిపై జియోని వివరణకోరనున్నట్టు తెలిపింది. ఇప్పటివరకూ జియో నుంచి తమకు సమాచారం లేదని, డేటా ఉల్లంఘన ఆరోపణపై జియోను వివరాలు కోరనున్నామని టెలికాం కార్యదర్శి అరుణ్ సుందర్రాజన్ తెలిపారు. జియో డేటా లీక్ వ్యవహారంపై శనివారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కాగా గత ఆదివారం వెలుగులోకి జియో కస్టమర్ల డేటా లీక్ ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ తదితర వివరాలు మాజిక్ఏపీ.కామ్ లో దర్శనమిచ్చాయి. ఈ విషయంపై జియో ముంబైలో ఫిర్యాదు చేయగా రాజస్థాన్కు చెందిన ఇమ్రాన్ చిప్ప (35)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లీక్ను ధృవీకరించిన మహారాష్ట్ర సైబర్ పోలీస్ సీనియర్ అధికారి, ఏ మేరకు లీకైందనే వివరాలందించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. -
నన్ను విడిపించండి ప్లీజ్..!
పనికోసం సౌదీకి వెళ్లి యజమాని పెడుతున్న వేధింపులను తాళలేక ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఓ గదిలో బందీగా ఉంటూ కష్టాలను ఓర్వలేక ఆందోళన చెందుతోంది. అక్కడే ఉండలేక, తిరిగి స్వదేశానికి రాలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఆవేదన చెందుతోంది. తన కష్టాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. తనను సురక్షితంగా స్వదేశానికి చేర్చమంటూ భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను వేడుకుంటోంది. ముంబైకి చెందిన 47 ఏళ్ల మిష్భా షేక్ పనికోసం సౌదీ అరేబియా వెళ్లి యజమానుల ఉచ్చులో చిక్కుకుంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించమంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. యజమాని ఓ గదిలో బంధించి తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అవేదన వ్యక్తం చేస్తోంది. జయమాని 10,000 రియాల్స్ కట్టమని డిమాండ్ చేస్తున్నాడని, ఇటు పని, అటు డబ్బు లేక తాను ఎంతో కష్టాల్లో ఉన్నానని, తనను ఎలాగైనా అక్కడి నుంచి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటోంది. పనికోసం వెళ్లి మిష్ఫా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోందని, సౌదీ యజమానుల వద్ద బందీగా ఉన్న ఆమెను సురక్షితంగా భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు సహకరించమని ఆమె కుటుంబసభ్యులు సైతం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సహచర్యం కోసం వేల మైళ్ల ప్రయాణం..!
వాషింగ్టన్: ఇతర జంతువులకు విరుద్ధంగా పాండాలు వ్యవహరించడాన్ని తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. సాధారణంగా జంతువుల్లో పురుషజాతి జంతువులు సహచర్యం కోసం స్త్రీ జాతి జంతువుల వెంట పడటం చూస్తామని, అయితే పాండాల విషయంలో అది విరుధ్దంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. యవ్వన దశలోకి సమీపిస్తున్న సమయంలో ఆడ పాండాలు మగ పాండాల కోసం వేల మైళ్ల దూరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయాణిస్తాయని కొత్త అధ్యయనాల్లో కనుగొన్నారు. అమెరికాలోని మిచిగన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనకారులు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా ఐదు పాండాల కదలికలను ట్రాక్ చేశారు. ఆడ పాండాలు ఆయా కాలాల్లో మగ పాండాలతో సంభోగం కోసం నిరీక్షిస్తూ ఉండటాన్ని ఇంతకు ముందే కొన్ని అధ్యయనాలద్వారా తెలుసుకున్నా... మైళ్ళ దూరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయాణిస్తుండటాన్ని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగిడే సమయంలో ఆడ పాండాలు... సంభోగం కోసం మైళ్ళదూరం ప్రయాణించి, తిరిగి పిల్లలకు జన్మనిచ్చే సమయానికి సొంత స్థానానికి చేరుకుంటాయని, పుట్టిన పిల్లలను అక్కడే పెంచుతాయని కూడ అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా క్షీరదాల్లో ఆడ జంతువులు సంభోగంకోసం మగవాటి కోసం వెతకడం చాలా అరుదని, అందులోనూ ఎలుగుబంటి జాతికి చెందిన ఏ జంతువులోనూ ఇటువంటి లక్షణాలు ఇప్పటివరకూ కనిపించలేదని, ఇది ఎంతో ఆసక్తికరమైన ప్రవర్తన అని మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన థామస్ కొన్నోర్ చెప్తున్నారు. చైనాలోని క్వియోంగ్లై, క్విన్ లింగ్ అనే రెండు పర్వత శ్రేణుల్లో నివసించే పాండాల్లో ఇటువంటి లక్షణాలను అధ్యయనకారులు కనుగొన్నారు. ఈ పాండాలను జైంట్ పాండాలని పిలుస్తారని, ఈ జాతిలో ఇంకా ఎన్నో విచిత్రమైన, అరుదైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని కొన్నోర్ తెలిపారు. ఈ తాజా పరిశోధనలను ఇంటిగ్రేటెడ్ జూవాలజీ జర్నల్ లో ప్రచురించారు. -
'హైడ్ అండ్ సీక్' తో పిల్ల టెర్రరిస్టుల దాష్టీకం!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. ఓ పురాతన కోట లోపల బంధించిన ఖైదీలను పిల్ల టెర్రరిస్టులు పట్టుకునే హైడ్ అండ్ సీక్ ఆటలా కనిపిస్తున్నా... నిజంగానే వారిని పట్టి బలవంతంగా చంపే వికృత చర్యలతో వీడియోను చిత్రించారు. సిరియాలోని మారుమూల డేయిర్ ఆజోర్ ప్రావిన్స్ ప్రాంతంలో దాచిన ఖైదీలను వెతుకుతూ చారిత్రక కట్టడాల మధ్య వాళ్లు శోధిస్తున్న దృశ్యాలను వీడియోలో పొందుపరిచారు. చేతులు రెండూ వెనక్కు విరిచి కట్టిన బందీలను..కనిపిస్తే కాల్చి చంపేందుకు సిద్ధంగా... ఆ పిల్ల పిశాచులు ఓ తుపాకీతో వేచి చూస్తుండటం ఆ పురాతన కట్టడాల మధ్య వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి భయంకర దాడుల్లో పాల్గొన్న వారు చాలావరకూ ఉత్తర ఆఫ్రికా, తజకిస్తాన్ నుంచి వచ్చినవారిలా ఉన్నారు. ఒకరి వెంట ఒకరు చారిత్రక అల్ రభా కోట ప్రవేశ ద్వారంనుంచి వారి శిక్షకుడిని కలుసుకుని, వారు చెప్పినట్లు కోట లోపల దాచిన ఖైదీలను అన్వేషించి మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పిల్ల టెర్రరిస్టులకు కావలసిన తుపాలకులను అప్పగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బందీలను లోపలి చీకట్లో కనుగొనేందుకు చిన్నదీపం వెలిగించి ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వారిని వెతికి...పని పూర్తి చేసి తిరిగి తమ ట్రైనర్ వద్దకు వచ్చి, అనంతరం ఆ తుపాకులను మరో బాల టెర్రరిస్టుకు ఇస్తే అతడు తిరిగి ఆట(వేట) ప్రారంభిస్తాడు. ఇలా ఖైదీలను వేర్వేరు ప్రాంతాల్లో తప్పించుకొనేందుకు వీలు లేనట్లుగా బంధించారు. చివరికి ఓ ఖైదీని నరికి చంపిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది. సిరియా ఇరాక్ లలో తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం వందలాదిమంది పిల్లలకు ఇస్లామిక్ స్టేట్ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసి టర్కీ పోలీసులు అరెస్టు చేసిన వార్తలు గతంలో సంచలనం రేపాయి. తాజాగా బందీలను చంపేందుకు బాల టెర్రరిస్టులతో 'హైడ్ అండ్ సీక్' గేమ్ ఆడిస్తున్న వీడియో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. -
విశాఖలో ఐటీఐఆర్ ఏర్పాటు పై ప్రభుత్వం డ్రామాలు
-
తెలంగాణ ఇవ్వాల్సిందేనంటూ టీడీపీ లేఖ