నన్ను విడిపించండి ప్లీజ్..!
పనికోసం సౌదీకి వెళ్లి యజమాని పెడుతున్న వేధింపులను తాళలేక ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఓ గదిలో బందీగా ఉంటూ కష్టాలను ఓర్వలేక ఆందోళన చెందుతోంది. అక్కడే ఉండలేక, తిరిగి స్వదేశానికి రాలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఆవేదన చెందుతోంది. తన కష్టాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. తనను సురక్షితంగా స్వదేశానికి చేర్చమంటూ భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను వేడుకుంటోంది.
ముంబైకి చెందిన 47 ఏళ్ల మిష్భా షేక్ పనికోసం సౌదీ అరేబియా వెళ్లి యజమానుల ఉచ్చులో చిక్కుకుంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించమంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. యజమాని ఓ గదిలో బంధించి తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అవేదన వ్యక్తం చేస్తోంది. జయమాని 10,000 రియాల్స్ కట్టమని డిమాండ్ చేస్తున్నాడని, ఇటు పని, అటు డబ్బు లేక తాను ఎంతో కష్టాల్లో ఉన్నానని, తనను ఎలాగైనా అక్కడి నుంచి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటోంది. పనికోసం వెళ్లి మిష్ఫా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోందని, సౌదీ యజమానుల వద్ద బందీగా ఉన్న ఆమెను సురక్షితంగా భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు సహకరించమని ఆమె కుటుంబసభ్యులు సైతం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.