
చిక్కుల్లో రిలయన్స్ జియో..?
న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్‌లో ఎదురులేని మహారాజుగా వెలుగుతున్న రిలయన్స్ జియోని భారీ డేటా లీక్ షాక్ బాగానే తగిలింది. ఆన్‌లైన్‌లో తమ వినియోగదారులకుచెందిన సమాచారం లీకైందన్న వార్తలతో ఇబ్బందుల్లో పడిన జియోకు తాజాగా చిక్కులు తప్పేలా లేవు. కోట్లాదిమంది జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడంపై టెలికాం శాఖ స్పందించింది. త్వరలోనే దీనిపై జియోని వివరణకోరనున్నట్టు తెలిపింది.
ఇప్పటివరకూ జియో నుంచి తమకు సమాచారం లేదని, డేటా ఉల్లంఘన ఆరోపణపై జియోను వివరాలు కోరనున్నామని టెలికాం కార్యదర్శి అరుణ్ సుందర్రాజన్ తెలిపారు. జియో డేటా లీక్ వ్యవహారంపై శనివారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
కాగా గత ఆదివారం వెలుగులోకి జియో కస్టమర్ల డేటా లీక్ ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ తదితర వివరాలు మాజిక్‌ఏపీ.కామ్ లో దర్శనమిచ్చాయి. ఈ విషయంపై జియో ముంబైలో ఫిర్యాదు చేయగా రాజస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ చిప్ప (35)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లీక్‌ను ధృవీకరించిన మహారాష్ట్ర సైబర్ పోలీస్ సీనియర్ అధికారి, ఏ మేరకు లీకైందనే వివరాలందించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.