ఆడియో రూపంలో సీపీఎం మేనిఫెస్టో
ఢిల్లీ: దేశంలోనే మొదటి సారిగా ఆడియో రూపంలో సీపీఎం మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల పట్ల చాలా ఇబ్బంది పడ్డారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ప్రజల బ్రతుకు దెరువుపై దాడులు జరిగాయని, గతంలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో ధనిక, పేదల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువైందన్నారు.
ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి ఉందన్నారు. సీపీఎం ద్వారా మాత్రమే ప్రత్యామ్నాయ విధానాలు సాధ్యం అనేది మేనిఫెస్టోలో చెప్పామని వివరించారు. రైతులకు 50 శాతం సాధారణ సహాయం కూడా అందిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీలు రాష్ట్రస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తాయని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే లౌకికవాద ప్రభుత్వం రావాలని కోరారు. ఆ లౌకిక వాద ప్రభుత్వంలో కమ్యునిస్టులు ఉండాలనేది మేనిఫెస్టోలో ప్రధాన అంశమన్నారు.