పరువు కోసం చెల్లిని హతమార్చిన సోదరులు
తిరునెల్వేలి: పరువు కోసం రక్తం పంచుకుపుట్టిన సోదరినే హత్య చేశారు సోదరులు. దళిత యువకుణ్ని ప్రేమించినందుకు 17 ఏళ్ల యువతిని ఆమె సోదరులే కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా సీవలపేరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు గోమతి అనే యువతి... మురుగన్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయంపై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దాంతో గోమతి కొన్ని రోజుల క్రితం .. మురుగన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబంతోనే కలిసి ఉంటోంది.
అయితే గోమతి ప్రవర్తనపై ఆగ్రహం చెందిన సోదరులు మురుగన్, సుదలైముత్తు ఆమెను ఇంటికి తీసుకువచ్చి దారుణంగా చంపేశారు. యాసిడ్‌ను బలవంతంగా ఆమె నోట్లో పోసి, అనంతరం ఇంట్లోనే ఉరేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో సోదరిని హత్య చేసినట్టు వారు అంగీకరించారని పోలీసులు చెప్పారు.