Self Help
-
డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయం
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు మేర సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని సులువుగా చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలను భాగం చేస్తోంది. వారికి డ్రోన్లు అందించి సరైన శిక్షణ ఇవ్వడంతో ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో రైతులపై పనిభారం తగ్గినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.ఇదీ చదవండి: 171.6 టన్నుల బంగారు ఆభరణాలు!ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలను అమలు చేసేందుకు రూ.1,261 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. డ్రోన్ కొనుగోలులో 80 శాతం వరకు కేంద్రమే భరించనున్నట్లు చెప్పింది. లేదంటే రూ.8 లక్షలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ధరతో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాలకు అదనంగా అవసరమయ్యే డబ్బును నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీరాయితీతో అందించనున్నట్లు పేర్కొంది. -
మెప్మా.. ముడుపులేంటి చెప్మా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. లంచం ఇవ్వనిదే రుణాలు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు మెప్మా ద్వారా రుణాలు ఇస్తున్నారు. ప్రతి రుణానికి రూ.5 వేల చొప్పున సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మెప్మాలో పనిచేసే ఆర్సీ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు కాబట్టి.. రుణాలు పొందే లబ్ధిదారుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని గత ప్రాజెక్ట్ డైరెక్టర్ నిబంధన పెట్టారు. ప్రతి పది గ్రూపులకు ఒక ఆర్సీ ఉంటా రు. వీరు గ్రూపుల నుంచి ఏమేరకు రుణాలు వసూలు కావాల్సి ఉంది, పాత రుణం ఎప్పటికి పూర్తవుతుంది, కొత్తగా రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు చెబుతుంటారు. వీరికి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఇవ్వడం లేదు. వారికి వేతనాలు చెల్లించే పేరిట లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడటం వివాదాస్పదం అవుతోంది. ప్రతి లబ్ధిదారు నుంచి రూ.5 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్ము జిల్లాస్థాయి వరకూ పంపిణీ అవుతోందని సమాచారం. ఇతరుల నుంచీ.. స్వయం సహాయక సంఘాల మహిళల భర్తలు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు.. వారి పిల్లల చదువు కోసం కూడా మెప్మా ద్వారా రుణాలు ఇస్తారు. ఈ విభాగంలో ఏడాది జిల్లాలోని అన్ని పట్టణాలకు 983 యూనిట్లు మంజూరు కాగా.. 612 యూనిట్లకు రుణాలిచ్చారు. దీంతోపాటు తోపుడు బళ్ల వ్యాపారులకు రుణాలు ఇవ్వడం, నైపుణ్య అభివృద్ధి పథకం కింద నిరుద్యోగుల స్వయం ఉపాధికి సంబంధించి శిక్షణ ఇప్పించి, రుణాలు మంజూరు చేయడం వంటి పథకాలు ఉన్నాయి. ఐదు మున్సిపాలిటీలలో స్త్రీ నిధి బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాల వారీగా ఇచ్చే రుణాలకు సంబంధించి ఒక్కో రేటు కట్టి వసూలు చేస్తున్నారు. రూ.లక్ష రుణం పొందితే రూ.5 వేలు సమర్పించుకోవాలి్సందే. అంతకు తక్కువ ఇస్తే ఊరుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పైసా ఇవ్వక్కర్లేదు మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశరావును ఈ విషయమై వివరణ కోరగా.. రుణాల కోసం ఎవరికీ పైసా చెల్లించాలి్సన అవసరం లేదన్నారు. ఎవరైనా సొమ్ము డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతి ఆరోపణలు వస్తే క్లస్టర్, మండల, జిల్లా స్థాయి అధికారినైనా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదన్నారు. -
చేతి వృత్తులు స్వయం ఉపాధికి దోహదం
ఏఎన్‌యూ: చేతి వత్తులు స్వయం ఉపాధికి దోహదం చేస్తాయని వీసీ ఆచార్య ఎ.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ఆధ్వర్యంలో జేఎంజే ఉజ్వల హోంలో ఆశ్రయం పొందే బాధిత మహిళలకు ఇచ్చిన శిక్షణ ద్వారా నేర్చుకున్న చేతి వత్తుల ఉత్పత్తుల ప్రదర్శన గురువారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మహిళలు చేతి వత్తులో నైపుణ్యం పెంపొదించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. స్వయం ఉపాధి పొందటం ద్వారా కుటుంబం, సమాజం అభివద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చేతి వత్తుల ద్వారా మహిళలు ఆర్థికంగా పురోభివద్ధి సాధించటంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చన్నారు. సమాజంలో ఎదురవుతున్న అనేక సవాళ్ళను మహిళలు అధికమించేందుకు స్వయం ఉపాధి సంబంధిత అంశాలు దోహదం చేస్తాయన్నారు. ప్రదర్శనలో ఉన్న వస్తువులను పరిశీలించి వాటిని తయారు చేసిన వారిని, వారికి శిక్షణ ఇచ్చిన వారిని వీసీ అభినందించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సరస్వతిరాజు అయ్యర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ ఉత్పత్తుల ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఉజ్వల హోం నిర్వాహకులు సిస్టర్ రోజ్లీనా, రూప తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీకి చెందిన వివిధ విభాగాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు ప్రదర్శనను వీక్షించి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. -
సెల్ఫ్ హెల్ప్ గురు
ఎప్పుడూ మూడు ఉపన్యాసాలుంటాయి: నువ్వు సాధన చేసింది; నువ్వు ఇచ్చింది; నువ్వు ఇచ్చివుంటే బాగుండేదనుకున్నది. - డేల్ కార్నెగీ ‘నేర్చుకోవడం అనేది అంత ప్రధానం కాదు; నేర్చుకుంటుండగా నువ్వెలాంటి మనిషివిగా తయారవుతావన్నది అంతకంటే ముఖ్యం’ అంటాడు డేల్ కార్నెగీ. ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్ధభాగంలో వ్యక్తిత్వ వికాసానికి తనదైన బాట పరిచిన కార్నెగీ తరచూ ఇలా చెప్పేవాడు: ‘నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకో: నాకు ఇంతకంటే చెడు ఏం జరగ్గలుగుతుంది? ఆ చెడును అంగీకరించడానికి సిద్ధపడు. ఆ చెడునుంచి మెరుగవడానికి ప్రయత్నించు’. వ్యక్తిగతంగా కూడా డేల్ కార్నెగీ చాలా చెడ్డ పరిస్థితుల్లోంచే మెరుగవుతూ వచ్చాడు. ఈ భవిష్యత్ ‘సెల్ఫ్ హెల్ప్ గురు’... అమెరికాలో 1888 నవంబర్ 24న పేద రైతుకుటుంబంలో జన్మించాడు. వాళ్ల ఊరిని పక్కనున్న నది ఎప్పుడూ వరదల్తో ముంచెత్తేది. దానివల్ల కరువు ఉత్పన్నమయ్యేది. అప్పుల భారంతో వాళ్ల నాన్న ఒక దశలో ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డాడు. ‘సిగ్గుపడే పరిస్థితుల్లోకి నెట్టిన’ పేదరికాన్ని చిన్నారి డేల్ ఈసడించుకునేవాడు. అయితే అంతటి విపత్కర కాలంలోనూ సంసారాన్ని ఈదడానికి ధైర్యంగా నిలబడిన వాళ్ల అమ్మ వ్యక్తిత్వం అతడిని ముగ్ధుడిని చేసేది. బడికి గుర్రం మీద వెళ్లేవాడు డేల్. ఫీజులేని చోట చదివేవాడు. చదువుకుంటూ పొలం పనులు చేసేవాడు. ఆవుల పాలు పిండటానికి ఉదయం నాలుగింటికి లేచేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించానని చెబితే, ఆమె తిరస్కరించింది. దీనికి కచ్చితంగా తన పేదరికమే కారణమని బలంగా విశ్వసించాడు. తాను ఎప్పటికైనా ధనవంతుడినీ, గొప్పవాడినీ కావాలనీ గట్టిగా శపథం చేసుకున్నాడు. కాలం దాన్ని నిజం చేసింది కూడా! భుక్తి కోసం డేల్ కార్నెగీ కొన్నాళ్లు సేల్స్‌మన్‌గా పనిచేశాడు. మరికొన్నాళ్లు నటుడిగా ప్రయత్నించాడు. కొన్నిరోజులు పాఠాలు చెప్పాడు. అయితే, స్టేజీ మీద మాట్లాడాలంటే అందరూ భయపడటాన్ని గమనించిన కార్నెగీకి ‘పబ్లిక్ స్పీకింగ్’లోనే కెరీర్ కనబడింది. ‘ఎప్పుడూ మూడు ఉపన్యాసాలుంటాయి: నువ్వు సాధన చేసింది; నువ్వు ఇచ్చింది; నువ్వు ఇచ్చివుంటే బాగుండేదనుకున్నది’. తొలినాళ్లలో రాబడిలో 80 శాతం యజమానికి ఇచ్చే ఒప్పందం మీద ఒక హాల్‌ను అద్దెకు తీసుకున్నాడు. వికాస పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు. ‘ఎదుటివారిని విమర్శించేముందు నీ లోపాల గురించి మాట్లాడు’. ‘మెరుగైనది ఎంతచిన్నదైనా అభినందించు; ప్రతి మెరుగైనదాన్నీ అభినందించు’. ‘నీదే తప్పయితే వెంటనే ఒప్పుకో; దృఢంగా ఒప్పుకో’. ‘మంచి శ్రోతవు కా; ఎదుటివారిని తమగురించి చెప్పుకునేలా ప్రోత్సహించు’. ‘వాదనలోంచి బయటపడే ఉచితమైన మార్గం ఏమిటంటే, అది లేకుండా చేసుకోవడమే!’ విద్యార్థులు, ఉద్యోగార్థులు, వ్యాపారులు, సంసారులు అన్న తేడా లేకుండా ఆయన తరగతులకు హాజరయ్యేవారు. వాళ్లను వాళ్లతోనే తమ సమస్యలకు పరిష్కారాలు వెతికించేవాడు. ‘ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసుకో: సమస్య ఏమిటి? ఆ సమస్యకు కారణాలేమిటి? ఆ సమస్యకు ఉండదగిన పరిష్కారాలేమిటి? ఉన్నవాటిల్లో అత్యుత్తమ పరిష్కారం ఏమిటి?’ ‘అన్ని వాస్తవాలనీ సేకరించు; వాస్తవాలన్నింటినీ బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి రా; ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, దానికనుగుణంగా నడుచుకో!’ కార్నెగీ వార్తాపత్రికలకు కాలమ్స్ రాసేవాడు. రేడియోలో షో నిర్వహించేవాడు. బాధల్ని అధిగమించడానికి సగటు సూత్రాన్ని ఉపయోగించమనేవాడు. అలాగే, తొలగించలేనిదానికి అంగీకారమే శరణ్యం అని చెప్పేవాడు. ఇవన్నీ తన సొంత ఆలోచనలేమీ కాదనీ, సోక్రటీస్, చెస్టర్‌ఫీల్డ్, జీసస్ నుంచి అరువు తెచ్చుకున్నవేననీ అనేవాడు. ‘అవే నచ్చకపోతే మరింక ఎవరివి వాడతావు?’ ఆయన పాఠాల్లో కొన్నింటిని క్రోడీకరించి, ‘పబ్లిక్ స్పీకింగ్: ఎ ప్రాక్టికల్ కోర్స్ ఫర్ బిజినెస్మెన్’ వెలువరించాడు. అయితే, కార్నెగీ పేరును ఖండం దాటించిన పుస్తకం మాత్రం ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లూయెన్స్ పీపుల్’ (1937). దానికి ముందు ‘ది ఆర్ట్ ఆఫ్ గెటింగ్ అలాంగ్ విత్ పీపుల్’ అని పేరు పెట్టాడాయన. ప్రచురణకర్తల్ని ఆ టైటిల్ ఆకర్షించలేదు. పేరు మార్చి, విషయం చేర్చి, మళ్లీ ఇచ్చాడు. అయితే, గట్టిగా 30,000 కాపీలు పోతుందనుకున్నది, నెల లోపలే 3,33,000 ప్రతులు అమ్ముడుపోయింది. ‘ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యచకితుణ్ని’ అన్నాడు ఇంటర్వ్యూకు వచ్చిన విలేఖరితో. తర్వాత కోటిన్నర కాపీలు అమ్ముడుపోయింది. వివిధ భాషల్లోకి అనువాదమైంది. 1948లో ‘హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’ ప్రచురించాడు. ఆయన మొత్తం బోధనల్లోని సారాంశం ఇలా ఉంటుంది: ‘విమర్శ, నింద, ఫిర్యాదు తగవు’. ‘నిజాయితీగా ప్రశంసించు’. ‘నవ్వు’. ‘ఇతరుల మీద మనఃపూర్వక ఆసక్తిని చూపించు’. ‘ఇతరుల్ని అనుకరించకు’. ‘ఇతరులకోసం సంతోషాన్ని సృష్టించు’. ‘నీ కష్టాల్ని కాదు, నీ వరాల్ని లెక్కించుకో’. ‘పనిలోనే విశ్రాంతి తీసుకోవడం ఎలాగో నేర్చుకో’. ‘వాటి ప్రాధాన్యతా క్రమంలో పనుల్ని పూర్తిచేయి’. ‘నిన్ను నువ్వు కనుక్కో; నీలా ఉండు; ఈ భూమ్మీద నిన్ను పోలిన మనిషి మరొకరు లేరని గుర్తుంచుకో’. ఆయన చెప్పినవన్నీ మరెక్కడైనా విన్నట్టనిపిస్తోందా? అదే కార్నెగీ గొప్పతనం! - ఆర్.ఆర్.