‘ఇంతి’ంతై..
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అనేది మొన్నటి మాట. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉద్యోగాల్లో సైతం ముందుంటున్నారు. వ్యవసాయంలోనూ తమ సత్తా చాటుతున్నారు. పట్టుదలతో తమకు సాటి లేదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారత సాధన దిశగా కదం తొక్కుతున్నారు.
నేడు మహిళాదినోత్సవం ఈ సందర్భంగా..
తెనాలి టౌన్, న్యూస్‌లైన్
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంతోమంది మహిళలు అధికారులుగా పనిచేస్తున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారి అభిప్రాయాలు..
సెల్ఫ్ ప్రొటెక్షన్‌పై తరగతులు నిర్వహించాలి..
ప్రాథమిక విద్యాదశ నుంచే బాలికలకు పాఠశాలల్లో సెల్ఫ్ ప్రొటక్షన్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. మహిళా దినోత్సవం నిర్వహణ వల్ల సామాజికాంశాల్లో అవగాహన వస్తుంది. సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది.
- కె.జ్యోతిరమణి, ఏడీఏ
అబ్బాయిలకూ అవగాహన కల్పించాలి..
ఈ రోజుల్లో ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తోంది. సమాజంపై అబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాలి. పురుషులతో పాటు అన్ని పనులు చేసే ఘనత మహిళలకే దక్కుతుంది.
-పి.లావణ్య, మార్కెట్ యార్డు
ఉన్నత శ్రేణి కార్యదర్శి
ఆర్థిక స్వాతంత్య్రం రావాలి..
సమాజంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. బాలికలను పెంచే విధానంలో మార్పురావాలి. ధైర్యసాహసాలను పెంపొందించి, ఆత్మనూన్యతాభావాన్ని పారదోలాలి.
- ఎ.సులోచన, సీడీసీవో
విద్యతో విజ్ఞానం..
విద్య వల్ల విజ్ఞానం కలుగుతుంది. అభివృద్ధికి కారణం అవుతుంది. పురుషుల సహకారం ఎంతో అవసరం. సంప్రదాయాలను పాటిస్తూ, కుటుంబ పరిస్థితులను చూసుకుంటూ ఉద్యోగాల్లో పురుషులతో పాటు ధీటుగా పనిచేస్తున్నాం.
-కె.అమలకుమారి, వ్యవసాయాధికారి
చిన్నచూపు తగదు..
సమాజంలో ఆడపిల్లలపై చిన్నచూపు తగదు. సమాజంలో మహిళలను గౌరవించాలనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటినుంచే నేర్పించాలి. ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్ బి.శ్రీదేవి,
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
వ్యవ‘సాయం’లోనూ..
పిట్టలవానిపాలెం, న్యూస్‌లైన్ : సేంద్రియ వ్యవ‘సాయం’లో ఈ మహిళలు భాగస్వాములవుతున్నారు. డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్యలు సంయుక్తంగా అమలు చేస్తున్న సుస్థిర సేంద్రియ వ్యవసాయ విధానంలో భాగంగా ఎలాంటి రసాయనిక, పురుగుమందులు వినియోగించకుండా వ్యవసాయం చే యిస్తూ మండలంలో పలువురి ప్రశంశలు పొందుతున్నారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 14 మంది మహిళలు గ్రామ కోర్డినేటర్లుగా పనిచేస్తూ సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది మండలంలో గోకరాజునల్లిబోయినవారిపాలెం గ్రామంలో ఎన్‌పీఎం(నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న పంటలను చూసిన రాష్ట్రస్థాయి అధికారుల బృందం మహిళలను అభినందించింది. ఈ సందర్భంగా మహిళలు అభిప్రాయాలు..
మహిళలే ముందంజ..
మండలంలో సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. సంప్రదాయ వ్యవసాయంలోనూ, నూతన పద్ధతుల సాగులోనూ మహిళలు ముందున్నారనడానికి ఇదే నిదర్శనం. - వరధానం (క్లస్టర్ కోఆర్డినేటర్ )