self reliance
-
ఉపాధి, నైపుణ్యాభివృద్ధి
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి తాలూకు ఫలాలు యువత, ఆదివాసీలతో పాటు సమాజంలో అన్ని వర్గాలకూ చేరేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడం, ఉత్పత్తి రంగ వృద్ధికి ఊతమివ్వడం, స్వాతంత్య్రానంతరం నిర్లక్ష్యానికి గురైన ఇతర రంగాల్లోనూ ఉపాధి సృష్టికి కృషి చేయడం తమ లక్ష్యమన్నారు. గుజరాత్ ప్రభుత్వం సోమవారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘దేశంలో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. ఇవి ఉపాధి కల్పించమే గాక లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి దిశగా స్ఫూర్తినిస్తున్నాయి. స్టార్టప్‌లకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు కూడా అందజేస్తోంది’’ అని వివరించారు. ‘‘గుజరాత్లో గత ఐదేళ్లలో లక్షన్నర మంది యువకులకు ప్రభుత్వోద్యోగాలు లభించాయి. 2023లో మరో పాతిక వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి’’ అన్నారు. ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఆరోగ్య, వైద్య పరిశోధనలపై బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ఆయన మాట్లాడారు. వైద్య రంగానికి సంబంధించిన ఎలాంటి పరికరాలనూ, టెక్నాలజీనీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయంసమృద్ధంగా మార్చాల్సిన బాధ్యత దేశ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలపై ఉందన్నారు. ఈ దిశగా తామిప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లపాటు సమీకృత ధోరణి, దీర్ఘకాలిక విజన్ లేమి దేశ వైద్య రంగ వృద్ధికి ముందరి కాళ్ల బంధంగా ఉండేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని చెప్పారు. ‘‘నేను ఫార్మా మార్కెట్ రూ.4 లక్షల కోట్లకు విస్తరించింది. ప్రైవేట్ రంగం, వైద్య విద్యా రంగం మధ్య సరైన సమన్వయముంటే ఇది రూ.10 లక్షల కోట్లకు విస్తరించగలదు. కరోనా కల్లోలం సంపన్న దేశాలను కూడా అల్లాడించింది. దాని దెబ్బకు ప్రపంచమంతా ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ తరుణంలో భారత్ మాత్రం మరో అడుగు ముందుకేసి వెల్నెస్పై దృష్టి పెట్టింది. మనమిప్పుడు ప్రపంచం ముందుంచిన ‘ఒక భూమి, ఒకే ఆరోగ్యం’ విజన్ అందులో భాగమే. మనుషులకే గాక జంతు, వృక్షజాలాలన్నింటికీ ఒకే తరహాలో సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. అంతేగాక ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడటం కూడా మా ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటి. అందుకే ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేపట్టిన చర్యల ద్వారా పేద రోగులకు ఇప్పటికే రూ.80,000 కోట్లు ఆదా అయ్యాయి’’ అని చెప్పారు. మార్చి 7ను జన్ ఔషధీ దివస్ జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. 9,000 జన్ ఔషధీ కేంద్రాల వల్ల పేద, మధ్యతరగతి వారికి రూ.20 వేల కోట్ల దాకా ఆదా అయిందన్నారు. వేసవిలో జాగ్రత్త: మోదీ రానున్న వేసవిలో తీవ్ర ప్రతికూల వా తావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలతో పాటు వైద్య నిపుణులకు, స్థానిక సంస్థలకు సమగ్ర అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. వేసవి సన్నద్ధత దిశగా చేపట్టిన చర్యలను ఆయన సారథ్యంలో ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆహార ధాన్యాల నిల్వలను ఎఫ్‌సీఐ వీలైనంతగా పెంచాలని మోదీ సూచించారు. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను మోదీ దృష్టికి తెచ్చారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. -
స్వావలంబన: ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు
ఆటో మొబైల్ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ను ప్రారంభించింది... మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. ‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్ జనరల్ మేనేజర్ లవ్లీసింగ్. ఆటోమొబైల్ రంగంలో లవ్లీసింగ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్ రంగానికి సంబంధించి సేల్స్ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్. ‘ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సీమ. 27 సంవత్సరాల గుర్మీత్ ఆటో మొబైల్ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్ ఎంజీ. ఆల్–ఉమెన్ టీమ్ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్ ఇండియా ఎండీ రాజీవ్ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్–ఉమెన్ టీమ్’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...
పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్‌కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు. సైదాబాద్‌లోని యాక్సెస్ లైవ్లీ హుడ్‌లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది. ‘నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే టైమ్‌కి నా మిల్లెట్ లడ్డూలను ప్లాస్టిక్ బాక్స్‌ల్లో కాకుండా ఆర్గానిక్ స్టైల్ బాక్స్‌ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్‌ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్‌లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు. ‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు. మిల్లెట్ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్కిన్ల గురించి, మిల్లెట్ మిక్స్‌ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్మేడ్ స్నాక్స్ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్‌గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తోంది. కరోనా సమయంలో... ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్‌ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్ మిక్స్‌లు, డ్రింక్స్ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది. కూలీ పనుల నుంచి... శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్‌లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది. కుటుంబ పోషణే ప్రధానంగా... ‘స్కూల్ ఏజ్‌లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ. మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు. మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
స్వావలంబనే భారత్‌కు మార్గం: గౌతం అదానీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ భాగస్వామ్యాలు స్వార్థ ప్రయోజనాల ఆధారితంగా జారిపోయే పునాదులపై ఏర్పడినట్టు అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు. దేశాల స్వార్థ విధానాలను ప్రస్తావించారు. భారత్ టీకాల అభివృద్ధి నుంచి రక్షణ ఉత్పత్తులు, సెమీకండక్టర్ల తయారీ వరకు వివిధ రంగాల్లో తన అవసరాలను తానే తీర్చుకునే విధంగా స్వావలంబనను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వాతావరణం మార్పులు, కరోనా మహమ్మారి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవరోధాలు, ఉక్రెయిన్‌లో యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా భయానికి, అనిశ్చితికి దారితీసినట్టు లింక్డెన్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలు సహకారాత్మక ధోరణితో కాకుండా నేరుగా తలపడే విధంగా మారి పోయినట్టు అదానీ పేర్కొన్నారు. స్వీయ రక్షణ, స్వావలంబన అన్నవి దావోస్‌లో యుద్ధానికి విముఖంగా ఉన్న నేతల ప్రాధాన్యాలుగా ఉన్నట్టు చెప్పారు. సహకారం తగ్గిపోవడం అన్నది కొత్త ప్రపంచక్రమంగా ఉండరాదన్న అభిప్రాయాన్ని అదానీ వ్యక్తం చేశారు. స్వావలంబన శకం.. భారత్ అన్ని రంగాల్లోనూ స్వీయ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరాన్ని గౌతమ్ అదానీ ప్రస్తావించారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఇంతకంటే ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రస్తుతం భారత్ స్వావలంబన శకంలోనే ఉందన్నారు. ‘‘ఈ స్వావలంబన ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. వివాదాలను అధిగమించాల్సి ఉంటుంది. మనం సెమీ కండక్టర్ ప్లాంట్లు నిర్మించుకోకుండా చాలా మంది ప్రయత్నాలు చేయవచ్చు. జీడీపీలో అధిక భాగాన్ని రక్షణ కోసం ఖర్చు చేయడాన్ని అడ్డుకోవచ్చు. మన విధానాలు విమర్శలకు గురికావచ్చు’’అంటూ వీటిని పట్టించుకోండా స్వీయ సామర్థ్యాల కల్పన దిశగా భారత్ అడుగులు వేయాల్సిన అవసరాన్ని అదానీ ప్రస్తావించారు. అవసరమైతే ప్రపంచానికి భారత్ ప్రత్యామ్నాయాలు చూపాలని గౌతమ్ అదానీ అభిప్రాయపడ్డారు. -
చరమాంకంలోనూ సడలని ధీర
కాళ్లు సహకరించకపోయినా స్వశక్తితో జీవనం మూడు చక్రాల కుర్చీలో పప్పుబెల్లాల విక్రయం అలజంగి(బొబ్బిలి రూరల్) : పప్పు కూడు రోజూ తినలేదు.. పప్పు బెల్లాలమ్మి పిల్లల నోరు తీపి చేస్తుంది. వెక్కిరిస్తున్న వైకల్యాన్ని ధిక్కరిస్తోంది. తోబుట్టువుల సహాయ నిరాకరణలోనూ తలెత్తుకు తిరుగుతోంది. వద్ధాప్యం మీద పడుతున్నా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగిపోతోంది. ఆమె అలజంగి గ్రామానికి చెందిన రాపాక అప్పయ్యమ్మ(69). బాల్యంలోనే పోలియో సోకడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రులు కన్నుమూశాక అన్నదమ్ములు చేరదీయలేదు. అండగా ఉంటానన్న ఓ వ్యక్తి మోసగించాడు. ఇప్పుడామె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు పప్పు బెల్లాలు అమ్ముతూ బతుకుతోంది. అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం మంజూరు చేసిన పింఛను కాస్త ఉపయోగపడుతోంది. ఎవరూ లేని అప్పయ్యమ్మ ఇంటి వద్ద వంట చేసుకుని ట్రైసైకిల్‌పై వస్తుంది. చిన్నారులే సహాయం చేస్తూ ఆమెను హైస్కూల్‌కు తీసుకువస్తారు. పాఠశాల సెలవైతే ఆదాయానికి గండి పడుతుంది. ఇంతవరకు ఆత్మస్థయిర్యాన్ని కోల్పోలేదని..కానీ ముంచుకొస్తున్న వద్ధాప్యంతో రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నప్పుడు మాత్రం కాస్త దిగులుగా ఉంటుందనిæఅప్పయ్యమ్మ చెప్పింది.