చరమాంకంలోనూ సడలని ధీర
చరమాంకంలోనూ సడలని ధీర
Published Tue, Aug 2 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
కాళ్లు సహకరించకపోయినా స్వశక్తితో జీవనం
మూడు చక్రాల కుర్చీలో పప్పుబెల్లాల విక్రయం
అలజంగి(బొబ్బిలి రూరల్) : పప్పు కూడు రోజూ తినలేదు.. పప్పు బెల్లాలమ్మి పిల్లల నోరు తీపి చేస్తుంది. వెక్కిరిస్తున్న వైకల్యాన్ని ధిక్కరిస్తోంది. తోబుట్టువుల సహాయ నిరాకరణలోనూ తలెత్తుకు తిరుగుతోంది. వద్ధాప్యం మీద పడుతున్నా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగిపోతోంది. ఆమె అలజంగి గ్రామానికి చెందిన రాపాక అప్పయ్యమ్మ(69). బాల్యంలోనే పోలియో సోకడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రులు కన్నుమూశాక అన్నదమ్ములు చేరదీయలేదు. అండగా ఉంటానన్న ఓ వ్యక్తి మోసగించాడు. ఇప్పుడామె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు పప్పు బెల్లాలు అమ్ముతూ బతుకుతోంది. అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం మంజూరు చేసిన పింఛను కాస్త ఉపయోగపడుతోంది. ఎవరూ లేని అప్పయ్యమ్మ ఇంటి వద్ద వంట చేసుకుని ట్రైసైకిల్‌పై వస్తుంది. చిన్నారులే సహాయం చేస్తూ ఆమెను హైస్కూల్‌కు తీసుకువస్తారు. పాఠశాల సెలవైతే ఆదాయానికి గండి పడుతుంది. ఇంతవరకు ఆత్మస్థయిర్యాన్ని కోల్పోలేదని..కానీ ముంచుకొస్తున్న వద్ధాప్యంతో రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నప్పుడు మాత్రం కాస్త దిగులుగా ఉంటుందనిæఅప్పయ్యమ్మ చెప్పింది.
Advertisement