
న్యూఢిల్లీ: అంతర్జాతీయ భాగస్వామ్యాలు స్వార్థ ప్రయోజనాల ఆధారితంగా జారిపోయే పునాదులపై ఏర్పడినట్టు అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు. దేశాల స్వార్థ విధానాలను ప్రస్తావించారు. భారత్ టీకాల అభివృద్ధి నుంచి రక్షణ ఉత్పత్తులు, సెమీకండక్టర్ల తయారీ వరకు వివిధ రంగాల్లో తన అవసరాలను తానే తీర్చుకునే విధంగా స్వావలంబనను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
వాతావరణం మార్పులు, కరోనా మహమ్మారి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవరోధాలు, ఉక్రెయిన్‌లో యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా భయానికి, అనిశ్చితికి దారితీసినట్టు లింక్డెన్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలు సహకారాత్మక ధోరణితో కాకుండా నేరుగా తలపడే విధంగా మారి పోయినట్టు అదానీ పేర్కొన్నారు. స్వీయ రక్షణ, స్వావలంబన అన్నవి దావోస్‌లో యుద్ధానికి విముఖంగా ఉన్న నేతల ప్రాధాన్యాలుగా ఉన్నట్టు చెప్పారు. సహకారం తగ్గిపోవడం అన్నది కొత్త ప్రపంచక్రమంగా ఉండరాదన్న అభిప్రాయాన్ని అదానీ వ్యక్తం చేశారు.
స్వావలంబన శకం..
భారత్ అన్ని రంగాల్లోనూ స్వీయ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరాన్ని గౌతమ్ అదానీ ప్రస్తావించారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఇంతకంటే ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రస్తుతం భారత్ స్వావలంబన శకంలోనే ఉందన్నారు. ‘‘ఈ స్వావలంబన ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. వివాదాలను అధిగమించాల్సి ఉంటుంది. మనం సెమీ కండక్టర్ ప్లాంట్లు నిర్మించుకోకుండా చాలా మంది ప్రయత్నాలు చేయవచ్చు. జీడీపీలో అధిక భాగాన్ని రక్షణ కోసం ఖర్చు చేయడాన్ని అడ్డుకోవచ్చు. మన విధానాలు విమర్శలకు గురికావచ్చు’’అంటూ వీటిని పట్టించుకోండా స్వీయ సామర్థ్యాల కల్పన దిశగా భారత్ అడుగులు వేయాల్సిన అవసరాన్ని అదానీ ప్రస్తావించారు. అవసరమైతే ప్రపంచానికి భారత్ ప్రత్యామ్నాయాలు చూపాలని గౌతమ్ అదానీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment