బాంబుల మోత మధ్య బార్డర్ సెల్ఫీలు!
జమ్ము: అది జమ్ములోని సరిహద్దు ప్రాంతం. అక్కడ నిర్విరామంగా తుపాకుల మోత మోగుతూనే ఉంటుంది. ఇరువైపుల సైనికులు ప్రయోగించే షెల్స్, బాంబులతో దద్దరిల్లుతుంటుంది. ఈ కాల్పుల బారి నుంచి తప్పించుకునేందుకు స్థానకులే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండగా.. పర్యాటకులు మాత్రం సరిహద్దు అందాలను తిలకించేందుకు సాహసిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో సెల్ఫీలు దిగి మురిసిపోతున్నారు. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరణమ ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ.. గత రెండేళ్లలో జమ్ములోని ఆర్ఎస్ పుర సెక్టర్లో అంతర్జాతీయ సరిహద్దులను దర్శించేందుకు వందలమంది పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో ఇక్కడ పర్యాటకం నానాటికీ వృద్ధి చెందుతున్నది.
ఉత్తరాఖండ్‌కు చెందిన షెల్జా కుటుంబం కూడా ఆర్ఎస్ పురలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. ఈ అనుభవం గురించి ఆమె చెప్తూ.. 'అదొక కన్నులపండుగలాంటి దృశం. సరిహద్దు కంచె వద్ద నిలబడి మేం సెల్ఫీలు దిగాం. భారత్, పాకిస్థాన్ బంకర్లు, వాటిపై ఎగురుతున్న జెండాలను చూశాం. ఇదెంతో బాగా అనిపించింది. పాకిస్థాన్ టూరిస్టులు కూడా ఇలా సరిహద్దులను సందర్శించేందుకు వస్తే బాగుంటుందనిపించింది' అని చెప్పారు.
ఆర్ఎస్ పుర సెక్టర్లో గతవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సరిహద్దు కంచెకు మరమ్మతులు చేస్తున్న భద్రతా సిబ్బంది, కార్మికులపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, 12 మంది గాయపడ్డారు. దీంతో దాదాపు 300 మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయినా పర్యాటకులు మాత్రం ఇక్కడికి రావడం ఆపడం లేదు.