SelfieWithDaughter
-
అరెరె.. ఆమె డిగ్గీరాజా కూతురు కాదే!
కూతురితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయండి.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఇరకాటంలో పెట్టింది. ఏడు పదుల వయసుకు దగ్గరలో పడిన డిగ్గీరాజా.. ఇటీవలే నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టును త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సరిగ్గా వాటినే చూసిన అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తప్పులో కాలేసింది. ఆమెను మన డిగ్గీ రాజాకు కూతురు అనుకుని, వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని 'సెల్ఫీ విత్ డాటర్' విభాగంలోకి చేర్చేసింది. ఈ విషయాన్ని ఒకరు కనిపెట్టేసి.. దాన్ని ట్వీట్ చేశారు. డిగ్గీరాజా ఈ కాన్సెప్టును తప్పుగా అర్థం చేసుకున్నారని, సెల్ఫీ విత్ డాటర్ అన్నారు తప్ప కూతురి వయసున్న గర్ల్‌ఫ్రెండ్‌తో సెల్ఫీ కాదని అన్నారు. చాలామంది తండ్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించి ఇలా తమ కూతుళ్లతో సెల్ఫీలు తీసుకున్నారనే కథనంలో మరికొన్ని ఇతర ఫొటోలతో కలిపి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిగ్గీ రాజా ఫొటోను కూడా ప్రచురించేసింది. అయితే దీనిపై అటు దిగ్విజయ్ సింగ్ నుంచి గానీ, అమృతా రాయ్ నుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు. -
ప్రపంచ ట్రెండ్‌గా 'సెల్ఫీ విత్ డాటర్'
న్యూఢిల్లీ: ఇప్పుడు ఎక్కడ చూసినా తమ చిన్నారి కూతుర్లను, పెద్దవారైతే వారిని తమ గుండెలకు హత్తుకుని సెల్ఫీలు తీసుకునే పనిలో తండ్రులు పడ్డారు. ఒకటి కాకుంటే మరొకటి అనుకుంటూ వేర్వేరు కోణాల్లో తమ సెల్ ఫోన్లలో బందిస్తున్నారు. ఇదిప్పుడు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాకుతుండటంతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన దేశాల జాబితాల్లో తాజాగా భారత్ కూడా చేరినట్లయింది. లింగ వివక్షను దూరం చేయాలని, కూతుర్లను కూడా కొడుకులతో సమానంగా చూడాలని బ్రూణ హత్యలు తగ్గించాలనే ఉద్దేశంతో పంజాబ్ లోని సునిల్ జగ్లాన్ అనే ఓ గ్రామ పంచాయతీ పెద్దాయన కూతురితో సెల్లో సెల్ఫీ తీసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అలా ఫొటోలు తీసి పంపించినవారిలో కొన్నింటిని ఎంపిక చేసి బహుమతుల ప్రధానం కూడా పెట్టాడు. దీంతో అది మెల్లమెల్లగా పాకి అందరు తండ్రులు తమకూతుర్లతో సెల్ఫీలు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మాట్లాడిన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో పంజాబ్ గ్రామపెద్ద చేసిన పనిని కొనియాడిన మరుక్షణం నుంచి అది కాస్త మరింత ఊపందుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ఒక్క భారత్ ప్రజలే కాకుండా విదేశాల్లోని వారు ఫాలో అవుతుండటంతో మోదీ పిలుపునందుకు ఇప్పుడు అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడిలాంటివారు కూడా దీనికి ఆకర్షితులై తమ కూతుర్లతో కెమెరాల్లో సెల్ఫీలు క్లిక్ మనిపించారు.