semifinal race
-
T20 World Cup 2024: ఆసీస్‌ను పడగొట్టి సెమీఫైనల్‌కు
ఏడు నెలల క్రితం తగిలిన దెబ్బకు ఇప్పుడు కాస్త ఉపశమనం! ఫైనల్ కాకపోవచ్చు, ఫార్మాట్ వేరు కావచ్చు... కానీ ప్రపంచ కప్‌లో ఆ్రస్టేలియాను ఓడించడం అంటే సగటు భారత అభిమాని ఆనందాన్ని రెట్టింపు చేసే క్షణం! వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడిన మ్యాచ్‌లో టీమిండియా అలాంటి సంతోషాన్నే పంచింది. ఆసీస్‌ను చిత్తు చేసి సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేస్తే మన బౌలర్లు సమర్థంగా లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. ఈ ఓటమితో ఆసీస్ సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోగా... 2022 తరహాలోనే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండోసారి భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా సూపర్–8లోనూ ఆడిన 3 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా సెమీస్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. ఇతర బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దూబే (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. జట్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ ఒక్కడే 15 బౌండరీలు బాదితే, మిగతా బ్యాటర్లు కలిపి 14 బౌండరీలు కొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ట్రవిస్ హెడ్ (43 బంతుల్లో 76; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... రెండో ఓవర్లో కోహ్లి (0)ని హాజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఆసీస్ సంబరపడింది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రోహిత్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లందరికీ చుక్కలు చూపించాడు. స్టార్క్ ఓవర్లో 29 పరుగులు బాదిన అతను కమిన్స్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టి 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ జోరు చూస్తే సెంచరీ లాంఛనమే అనిపించినా... చక్కటి యార్కర్‌తో స్టార్క్ రోహిత్‌ను బౌల్డ్ చేశాడు! తన తర్వాతి ఓవర్లో సూర్యనూ అతను వెనక్కి పంపించాడు. చివరి 5 ఓవర్లలో భారత్‌ను ఆసీస్ కట్టడి చేసింది. హెడ్ మెరుపులు... ఛేదనలో ఆసీస్ కూడా ఆరంభంలోనే వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. అయితే హెడ్, మార్‡్ష ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 48 బంతుల్లో 81 పరుగులు జోడించారు. హెడ్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే అక్షర్ అద్భుత క్యాచ్‌కు మార్‡్ష వెనుదిరగడంతో ఆసీస్ పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో జట్టు తర్వాతి 5 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) స్టార్క్ 92; కోహ్లి (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 0; పంత్ (సి) హాజల్‌వుడ్ (బి) స్టొయినిస్ 15; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) స్టార్క్ 31; దూబే (సి) వార్నర్ (బి) స్టొయినిస్ 28; పాండ్యా (నాటౌట్) 27; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–6, 2–93, 3–127, 4–159, 5–194. బౌలింగ్: స్టార్క్ 4–0–45–2, హాజల్‌వుడ్ 4–0–14–1, కమిన్స్ 4–0–48–0, జంపా 4–0–41 –0, స్టొయినిస్ 4–0–56–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) అర్‡్షదీప్ 6; హెడ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 76; మార్‡్ష (సి) అక్షర్ (బి) కుల్దీప్ 37; మ్యాక్స్‌వెల్ (బి) కుల్దీప్ 20; స్టొయినిస్ (సి) పాండ్యా (బి) అక్షర్ 2; డేవిడ్ (సి) బుమ్రా (బి) అర్‡్షదీప్ 15; వేడ్ (సి) కుల్దీప్ (బి) అర్‡్షదీప్ 1; కమిన్స్ (నాటౌట్) 11; స్టార్క్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–6, 2–87, 3–128, 4–135, 5–150, 6–153, 7–166. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–3, బుమ్రా 4–0–29–1, అక్షర్ పటేల్ 3–0–21–1, హార్దిక్ పాండ్యా 4–0–47–0, కుల్దీప్ యాదవ్ 4–0–24–2, జడేజా 1–0–17–0. ఒకే ఓవర్లో 29 పరుగులు... ఆసీస్ టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో రోహిత్ వరుసగా 6, 6, 4, 6 కొట్టాడు. ఐదో బంతికి పరుగు రాకపోగా, తర్వాత స్టార్క్ ‘వైడ్’ వేశాడు. దాంతో అదనపు బంతిని కూడా రోహిత్ సిక్సర్‌గా మలిచాడు. -
T20 WC 2022 2nd Semi Final: హేమాహేమీల సెమీస్.. మళ్లీ అదే చర్చ!
ఇప్పటి వరకు ఒక లెక్క... ఇప్పుడు మరో లెక్క... అవును, లీగ్ దశలో ఎలా ఆడామో, ఏం చేశామో అనేది అనవసరం... మరో రెండు మ్యాచ్‌లు ఈ భారత జట్టు ఘనతను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి... లేదా తేడా వస్తే ఎప్పటికీ మరచిపోలేని వేదనను మిగులుస్తాయి... ఆ రెండింటిలో మొదటి అంకానికి నేడు రంగం సిద్ధమైంది... 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఐదు ఐసీసీ టోర్నీలలో భారత్ నాకౌట్ సమరాల్లో చేతులెత్తేసింది. ఇప్పుడు ఆనందం పంచేందుకు మరో అవకాశం టీమిండియాకు వచ్చింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా ఎక్కడా తగ్గేలా లేదు. మూడేళ్ల వ్యవధిలో ఆ జట్టు రెండో ఐసీసీ టోర్నీ విజయాన్ని ఆశిస్తోంది... అందుకు తగ్గ వనరులు కూడా జట్టు వద్ద ఉన్నాయి కాబట్టి సెమీస్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. టోర్నీలో వాన కారణంగా ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడితేనేమి... న్యూజిలాండ్, శ్రీలంకలపై సాధించిన సాధికారిక విజయాలు జట్టు సామర్థ్యాన్ని చూపించాయి. లైనప్‌లో తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లతో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాయాది జట్టు తుది పోరుకు అర్హత సాధించి రా రమ్మని మనల్ని పిలుస్తున్నట్లుగా ఉంది... ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కోరిక అయిన భారత్, పాక్ ఫైనల్ జరగాలంటే ఇంగ్లండ్ రూపంలో ఉన్న అడ్డంకిని రోహిత్ సేన తొలగించాల్సిందే! అడిలైడ్: టి20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న భారత జట్టుకు సెమీఫైనల్లో ఇంగ్లండ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుగా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్ బెర్త్ కోసం నేడు ఇరు జట్లు తలపడనున్నాయి. బలాబలాలపరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే నాకౌట్ సమరంలో ఉండే తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్‌తో జరిగిన గత నాలుగు టి20 ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా భారతే గెలుచుకోవడం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇందులో రెండు భారత్‌లో జరగ్గా, మరో రెండు ఇంగ్లండ్‌లో జరగడం చూస్తే భారత్ ఆధిపత్యం ఎలాంటిదో స్పష్టమవుతుంది. మళ్లీ అదే చర్చ! భారత తుది జట్టు విషయంలో మొదటి మ్యాచ్ నుంచీ చూస్తే పెద్దగా అనూహ్యాలేమీ జరగలేదు. ఒక మ్యాచ్‌లో అక్షర్ స్థానంలో హుడా, మరో మ్యాచ్‌లో కార్తీక్‌కు బదులుగా పంత్ ఆడటం మినహా అంతా సాఫీగానే సాగిపోయింది. సెమీస్‌లో కూడా ఈ విషయంలోనే టీమ్ మేనేజ్మెంట్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. బ్యాటింగ్‌లో అదనపు బలమంటూ అశ్విన్, అక్షర్‌లను రెగ్యులర్‌గా ఆడిస్తున్నారు. అక్షర్ పెద్దగా ప్రభావం చూపడం లేదు కూడా. ఒకరిని తప్పించి స్పెషలిస్ట్ లెగ్‌స్పిన్నర్ చహల్‌ను ఆడించేందుకు ఒక ప్రత్యామ్నాయం అయితే ఉంది. కానీ కీలకమైన పోరులో వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండా నేరుగా చహల్ బరిలోకి దిగడం కూడా సానుకూలాంశం కాదు. కీపర్ విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతోంది. జింబాబ్వేపై పంత్‌ను ఆడించినా, జట్టు ప్రాధాన్యతల్లో కార్తీక్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఓవరాల్‌గా చూస్తే టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. టోర్నమెంట్ టాప్ స్కోరర్ కోహ్లి (246 పరుగులు) గురించి కొత్తగా చెప్పేదేముంది. అతనికి తోడుగా అగ్నిలా సూర్యకుమార్ (225) దాదాపు 200 స్ట్రయిక్‌రేట్‌తో చెలరేగిపోతున్నాడు. రాహుల్ కూడా కుదురుకోగా, రోహిత్ శర్మ ఫామ్ మాత్రమే కొంత ఇబ్బంది పెడుతోంది. 5 మ్యాచ్‌లలో కలిపి 89 పరుగులే చేసిన రోహిత్ తన స్థాయిని ప్రదర్శించేందుకు సెమీస్‌ను వేదికగా చేసుకుంటే మంచిదేమో. ముగ్గురు పేసర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటం శుభసూచకం. భువీ బౌలింగ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 30 పరుగులు మాత్రమే చేసి 5 సార్లు అవుట్ అయ్యాడంటే ఆరంభంలో పైచేయి చూపించేందుకు భారత్‌కు మరో అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లతో... స్టోక్స్, వోక్స్, స్యామ్ కరన్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్...100 శాతం రెండు విభాగాల్లో పనికొచ్చే ఇంగ్లండ్ ఆటగాళ్లు వీరంతా. బ్యాటింగ్‌లో విఫలమైతే బౌలింగ్‌లో, బౌలింగ్‌లో విఫలమైతే బ్యాటింగ్‌లో సత్తా చాటగల సమర్థులు. ఇంగ్లండ్ విజయావకాశాలు వీరి ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత స్యామ్ కరన్ రాటుదేలగా, కీలక మ్యాచ్‌లో ఏమాత్రం ఒత్తిడిని దరి చేరనీయకుండా ఎలా ఆడాలనేది స్టోక్స్‌కు బాగా తెలుసు. ఓపెనర్లుగా బట్లర్, హేల్స్ అందించే దూకుడైన ఆరంభం ఇంగ్లండ్‌ను ముందంజలో నిలపగలదు. హేల్స్ టోర్నీ మొత్తం నిలకడగా ఆడుతుండగా, బట్లర్ అసలు సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్ కీలకం కాగా, మలాన్ రూపంలో మరో కీలక బ్యాటర్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న మలాన్ కోలుకోకపోతే సాల్ట్ జట్టులోకి వస్తాడు. బౌలింగ్‌లో కూడా జట్టుకు పెద్ద దెబ్బ పడింది. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న మార్క్ వుడ్ కూడా గాయపడి కోలుకోలేదు. అతను ఆడలేకపోతే జోర్డాన్‌కు అవకాశం దక్కుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్య, హార్దిక్, కార్తీక్, అక్షర్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), హేల్స్, మలాన్/సాల్ట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్ కరన్, వోక్స్, జోర్డాన్, రషీద్. పిచ్, వాతావరణం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. బంగ్లాదేశ్‌పై ఇదే మైదానంలో ఆడి భారత్ భారీ స్కోరు సాధించింది. పాక్ కూడా బంగ్లాను ఇక్కడే ఓడించింది. స్క్వేర్‌లెగ్ బౌండరీలు చిన్నవి (గరిష్టంగా 63 మీటర్లు) కాగా, నేరుగా బౌండరీ ఎక్కువ దూరం (80 మీటర్లు) ఉండటం ఈ ఓవల్ మైదానం ప్రత్యేకత. దీనిని బట్టి జట్టు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. 3: టి20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచ్‌లు జరగ్గా, భారత్ 2 గెలిచి, 1 ఓడింది. 12: ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ మధ్య 22 అంతర్జాతీయ టి20లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. -
Commonwealth Games 2022: భారత్ ధనాధన్
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ టి20 క్రికెట్ ఈవెంట్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దాయాది పాకిస్తాన్‌ను కంగు తినిపించింది. తద్వారా సెమీఫైనల్ రేసులో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట పాకిస్తాన్ మహిళల జట్టు 18 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. రాధ యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. రేణుక, మేఘన సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 11.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (14; 2 ఫోర్లు) ధాటిగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. బుధవారం బార్బడోస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది. -
ఇక రేసులో మిగిలింది భారత్, ఆస్ట్రేలియానే
మొహాలీ: టి-20 ప్రపంచ కప్ గ్రూప్-2 నుంచి మరో జట్టు నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ (0) ఇంతకుముందే టోర్నీ నుంచి నిష్ర్కమించగా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో పాకిస్తాన్ (2) కూడా అదే బాటపట్టింది. ఈ గ్రూపు టాపర్ న్యూజిలాండ్ (6) హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లగా, మరో బెర్తు కోసం ఈ గ్రూపు నుంచి ఆస్ట్రేలియా(4), భారత్ (4) రేసులో మిగిలాయి. టీమిండియా సెమీస్ చేరాలంటే ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచితీరాలి. ఈ మ్యాచ్‌లో ధోనీసేన గెలిస్తే గ్రూపు-2లో భారత్ ద్వితీయ స్థానంలో నిలిచి నాకౌట్ బెర్తు దక్కించుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దయితే టీమిండియాకు నిరాశ తప్పదు. అప్పుడు భారత్, ఆసీస్ చెరో ఐదు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అయితే భారత్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న కంగారూలు సెమీస్‌కు వెళ్తారు. కాబట్టి సెమీస్ చేరాలంటే భారత్ ఆసీస్‌పై గెలిచితీరాలి. ఇక పాక్ లీగ్ దశలోనాలుగు మ్యాచ్‌లూ ఆడేసి ఇంటిదారి పట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ల మధ్య ఓ మ్యాచ్ జరగాల్సి ఉన్నా ఇది నామమాత్రమే. మెరుగైన రన్‌రేట్ ఉన్న కివీస్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా గ్రూపులో అగ్రస్థానంలో ఉంటుంది.