బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ టి20 క్రికెట్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దాయాది పాకిస్తాన్‌ను కంగు తినిపించింది. తద్వారా సెమీఫైనల్ రేసులో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన ఈ పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట పాకిస్తాన్ మహిళల జట్టు 18 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
రాధ యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. రేణుక, మేఘన సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 11.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (14; 2 ఫోర్లు) ధాటిగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. బుధవారం బార్బడోస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment