టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో భారత్
24 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు
చెలరేగిన రోహిత్ శర్మ
గురువారం ఇంగ్లండ్‌తో సెమీస్
ఏడు నెలల క్రితం తగిలిన దెబ్బకు ఇప్పుడు కాస్త ఉపశమనం! ఫైనల్ కాకపోవచ్చు, ఫార్మాట్ వేరు కావచ్చు... కానీ ప్రపంచ కప్‌లో ఆ్రస్టేలియాను ఓడించడం అంటే సగటు భారత అభిమాని ఆనందాన్ని రెట్టింపు చేసే క్షణం! వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడిన మ్యాచ్‌లో టీమిండియా అలాంటి సంతోషాన్నే పంచింది.
ఆసీస్‌ను చిత్తు చేసి సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరుకు బాటలు వేస్తే మన బౌలర్లు సమర్థంగా లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు. ఈ ఓటమితో ఆసీస్ సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోగా... 2022 తరహాలోనే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధమైంది.
గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండోసారి భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశలో 3 మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా సూపర్–8లోనూ ఆడిన 3 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా సెమీస్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. ఇతర బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), దూబే (22 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. జట్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ ఒక్కడే 15 బౌండరీలు బాదితే, మిగతా బ్యాటర్లు కలిపి 14 బౌండరీలు కొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ట్రవిస్ హెడ్ (43 బంతుల్లో 76; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు.
సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన...
రెండో ఓవర్లో కోహ్లి (0)ని హాజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఆసీస్ సంబరపడింది. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రోహిత్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లందరికీ చుక్కలు చూపించాడు. స్టార్క్ ఓవర్లో 29 పరుగులు బాదిన అతను కమిన్స్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టి 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ జోరు చూస్తే సెంచరీ లాంఛనమే అనిపించినా... చక్కటి యార్కర్‌తో స్టార్క్ రోహిత్‌ను బౌల్డ్ చేశాడు! తన తర్వాతి ఓవర్లో సూర్యనూ అతను వెనక్కి పంపించాడు. చివరి 5 ఓవర్లలో భారత్‌ను ఆసీస్ కట్టడి చేసింది.
హెడ్ మెరుపులు...
ఛేదనలో ఆసీస్ కూడా ఆరంభంలోనే వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. అయితే హెడ్, మార్‡్ష ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 48 బంతుల్లో 81 పరుగులు జోడించారు. హెడ్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే అక్షర్ అద్భుత క్యాచ్‌కు మార్‡్ష వెనుదిరగడంతో ఆసీస్ పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో జట్టు తర్వాతి 5 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) స్టార్క్ 92; కోహ్లి (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 0; పంత్ (సి) హాజల్‌వుడ్ (బి) స్టొయినిస్ 15; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) స్టార్క్ 31; దూబే (సి) వార్నర్ (బి) స్టొయినిస్ 28; పాండ్యా (నాటౌట్) 27; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205.
వికెట్ల పతనం: 1–6, 2–93, 3–127, 4–159, 5–194.
బౌలింగ్: స్టార్క్ 4–0–45–2, హాజల్‌వుడ్ 4–0–14–1, కమిన్స్ 4–0–48–0, జంపా 4–0–41 –0, స్టొయినిస్ 4–0–56–2.
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) అర్‡్షదీప్ 6; హెడ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 76; మార్‡్ష (సి) అక్షర్ (బి) కుల్దీప్ 37; మ్యాక్స్‌వెల్ (బి) కుల్దీప్ 20; స్టొయినిస్ (సి) పాండ్యా (బి) అక్షర్ 2; డేవిడ్ (సి) బుమ్రా (బి) అర్‡్షదీప్ 15; వేడ్ (సి) కుల్దీప్ (బి) అర్‡్షదీప్ 1; కమిన్స్ (నాటౌట్) 11; స్టార్క్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181.
వికెట్ల పతనం: 1–6, 2–87, 3–128, 4–135, 5–150, 6–153, 7–166.
బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–37–3, బుమ్రా 4–0–29–1, అక్షర్ పటేల్ 3–0–21–1, హార్దిక్ పాండ్యా 4–0–47–0, కుల్దీప్ యాదవ్ 4–0–24–2, జడేజా 1–0–17–0.
ఒకే ఓవర్లో 29 పరుగులు...
ఆసీస్ టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో రోహిత్ వరుసగా 6, 6, 4, 6 కొట్టాడు. ఐదో బంతికి పరుగు రాకపోగా, తర్వాత స్టార్క్ ‘వైడ్’ వేశాడు. దాంతో అదనపు బంతిని కూడా రోహిత్ సిక్సర్‌గా మలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment