ఇక రేసులో మిగిలింది భారత్, ఆస్ట్రేలియానే
మొహాలీ: టి-20 ప్రపంచ కప్ గ్రూప్-2 నుంచి మరో జట్టు నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన బంగ్లాదేశ్ (0) ఇంతకుముందే టోర్నీ నుంచి నిష్ర్కమించగా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో పాకిస్తాన్ (2) కూడా అదే బాటపట్టింది. ఈ గ్రూపు టాపర్ న్యూజిలాండ్ (6) హ్యాట్రిక్ విజయంతో సెమీస్కు దూసుకెళ్లగా, మరో బెర్తు కోసం ఈ గ్రూపు నుంచి ఆస్ట్రేలియా(4), భారత్ (4) రేసులో మిగిలాయి.
టీమిండియా సెమీస్ చేరాలంటే ఆదివారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో గెలిచితీరాలి. ఈ మ్యాచ్లో ధోనీసేన గెలిస్తే గ్రూపు-2లో భారత్ ద్వితీయ స్థానంలో నిలిచి నాకౌట్ బెర్తు దక్కించుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దయితే టీమిండియాకు నిరాశ తప్పదు. అప్పుడు భారత్, ఆసీస్ చెరో ఐదు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అయితే భారత్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్న కంగారూలు సెమీస్కు వెళ్తారు. కాబట్టి సెమీస్ చేరాలంటే భారత్ ఆసీస్పై గెలిచితీరాలి. ఇక పాక్ లీగ్ దశలోనాలుగు మ్యాచ్లూ ఆడేసి ఇంటిదారి పట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల మధ్య ఓ మ్యాచ్ జరగాల్సి ఉన్నా ఇది నామమాత్రమే. మెరుగైన రన్రేట్ ఉన్న కివీస్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా గ్రూపులో అగ్రస్థానంలో ఉంటుంది.