ఇప్పటి వరకు ఒక లెక్క... ఇప్పుడు మరో లెక్క... అవును, లీగ్ దశలో ఎలా ఆడామో, ఏం చేశామో అనేది అనవసరం... మరో రెండు మ్యాచ్‌లు ఈ భారత జట్టు ఘనతను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి... లేదా తేడా వస్తే ఎప్పటికీ మరచిపోలేని వేదనను మిగులుస్తాయి... ఆ రెండింటిలో మొదటి అంకానికి నేడు రంగం సిద్ధమైంది... 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఐదు ఐసీసీ టోర్నీలలో భారత్ నాకౌట్ సమరాల్లో చేతులెత్తేసింది. ఇప్పుడు ఆనందం పంచేందుకు మరో అవకాశం టీమిండియాకు వచ్చింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా ఎక్కడా తగ్గేలా లేదు.
మూడేళ్ల వ్యవధిలో ఆ జట్టు రెండో ఐసీసీ టోర్నీ విజయాన్ని ఆశిస్తోంది... అందుకు తగ్గ వనరులు కూడా జట్టు వద్ద ఉన్నాయి కాబట్టి సెమీస్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. టోర్నీలో వాన కారణంగా ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడితేనేమి... న్యూజిలాండ్, శ్రీలంకలపై సాధించిన సాధికారిక విజయాలు జట్టు సామర్థ్యాన్ని చూపించాయి. లైనప్‌లో తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లతో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది.
ఇప్పటికే దాయాది జట్టు తుది పోరుకు అర్హత సాధించి రా రమ్మని మనల్ని పిలుస్తున్నట్లుగా ఉంది... ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కోరిక అయిన భారత్, పాక్ ఫైనల్ జరగాలంటే ఇంగ్లండ్ రూపంలో ఉన్న అడ్డంకిని రోహిత్ సేన తొలగించాల్సిందే!
అడిలైడ్: టి20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న భారత జట్టుకు సెమీఫైనల్లో ఇంగ్లండ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుగా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్ బెర్త్ కోసం నేడు ఇరు జట్లు తలపడనున్నాయి. బలాబలాలపరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే నాకౌట్ సమరంలో ఉండే తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్‌తో జరిగిన గత నాలుగు టి20 ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా భారతే గెలుచుకోవడం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇందులో రెండు భారత్‌లో జరగ్గా, మరో రెండు ఇంగ్లండ్‌లో జరగడం చూస్తే భారత్ ఆధిపత్యం ఎలాంటిదో స్పష్టమవుతుంది.
మళ్లీ అదే చర్చ!
భారత తుది జట్టు విషయంలో మొదటి మ్యాచ్ నుంచీ చూస్తే పెద్దగా అనూహ్యాలేమీ జరగలేదు. ఒక మ్యాచ్‌లో అక్షర్ స్థానంలో హుడా, మరో మ్యాచ్‌లో కార్తీక్‌కు బదులుగా పంత్ ఆడటం మినహా అంతా సాఫీగానే సాగిపోయింది. సెమీస్‌లో కూడా ఈ విషయంలోనే టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. బ్యాటింగ్‌లో అదనపు బలమంటూ అశ్విన్, అక్షర్‌లను రెగ్యులర్‌గా ఆడిస్తున్నారు.
అక్షర్ పెద్దగా ప్రభావం చూపడం లేదు కూడా. ఒకరిని తప్పించి స్పెషలిస్ట్ లెగ్‌స్పిన్నర్ చహల్‌ను ఆడించేందుకు ఒక ప్రత్యామ్నాయం అయితే ఉంది. కానీ కీలకమైన పోరులో వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండా నేరుగా చహల్ బరిలోకి దిగడం కూడా సానుకూలాంశం కాదు. కీపర్ విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతోంది.
జింబాబ్వేపై పంత్‌ను ఆడించినా, జట్టు ప్రాధాన్యతల్లో కార్తీక్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఓవరాల్‌గా చూస్తే టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. టోర్నమెంట్ టాప్ స్కోరర్ కోహ్లి (246 పరుగులు) గురించి కొత్తగా చెప్పేదేముంది. అతనికి తోడుగా అగ్నిలా సూర్యకుమార్ (225) దాదాపు 200 స్ట్రయిక్‌రేట్‌తో చెలరేగిపోతున్నాడు.
రాహుల్ కూడా కుదురుకోగా, రోహిత్ శర్మ ఫామ్ మాత్రమే కొంత ఇబ్బంది పెడుతోంది. 5 మ్యాచ్‌లలో కలిపి 89 పరుగులే చేసిన రోహిత్ తన స్థాయిని ప్రదర్శించేందుకు సెమీస్‌ను వేదికగా చేసుకుంటే మంచిదేమో. ముగ్గురు పేసర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటం శుభసూచకం. భువీ బౌలింగ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 30 పరుగులు మాత్రమే చేసి 5 సార్లు అవుట్ అయ్యాడంటే ఆరంభంలో పైచేయి చూపించేందుకు భారత్‌కు మరో అవకాశం ఉంది.
ఆల్‌రౌండర్లతో...
స్టోక్స్, వోక్స్, స్యామ్ కరన్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్...100 శాతం రెండు విభాగాల్లో పనికొచ్చే ఇంగ్లండ్ ఆటగాళ్లు వీరంతా. బ్యాటింగ్‌లో విఫలమైతే బౌలింగ్‌లో, బౌలింగ్‌లో విఫలమైతే బ్యాటింగ్‌లో సత్తా చాటగల సమర్థులు. ఇంగ్లండ్ విజయావకాశాలు వీరి ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత స్యామ్ కరన్ రాటుదేలగా, కీలక మ్యాచ్‌లో ఏమాత్రం ఒత్తిడిని దరి చేరనీయకుండా ఎలా ఆడాలనేది స్టోక్స్‌కు బాగా తెలుసు.
ఓపెనర్లుగా బట్లర్, హేల్స్ అందించే దూకుడైన ఆరంభం ఇంగ్లండ్‌ను ముందంజలో నిలపగలదు. హేల్స్ టోర్నీ మొత్తం నిలకడగా ఆడుతుండగా, బట్లర్ అసలు సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్ కీలకం కాగా, మలాన్ రూపంలో మరో కీలక బ్యాటర్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న మలాన్ కోలుకోకపోతే సాల్ట్ జట్టులోకి వస్తాడు. బౌలింగ్‌లో కూడా జట్టుకు పెద్ద దెబ్బ పడింది. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న మార్క్ వుడ్ కూడా గాయపడి కోలుకోలేదు. అతను ఆడలేకపోతే జోర్డాన్‌కు అవకాశం దక్కుతుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్య, హార్దిక్, కార్తీక్, అక్షర్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), హేల్స్, మలాన్/సాల్ట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్ కరన్, వోక్స్, జోర్డాన్, రషీద్.
పిచ్, వాతావరణం
సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. బంగ్లాదేశ్‌పై ఇదే మైదానంలో ఆడి భారత్ భారీ స్కోరు సాధించింది. పాక్ కూడా బంగ్లాను ఇక్కడే ఓడించింది. స్క్వేర్‌లెగ్ బౌండరీలు చిన్నవి (గరిష్టంగా 63 మీటర్లు) కాగా, నేరుగా బౌండరీ ఎక్కువ దూరం (80 మీటర్లు) ఉండటం ఈ ఓవల్ మైదానం ప్రత్యేకత. దీనిని బట్టి జట్టు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు.
3: టి20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచ్‌లు జరగ్గా, భారత్ 2 గెలిచి, 1 ఓడింది.
12: ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ మధ్య 22 అంతర్జాతీయ టి20లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment