seniority list of teachers
-
సీనియారిటీ జాబితా తయారీ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల సీనియారిటీ జాబితా రూపకల్పన గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఉపాధ్యాయ బదిలీల్లో న్యాయ తదితర వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం కొత్త షెడ్యూల్ విడుదల చేశారు. అన్ని క్యాడర్ల టీచర్లకూ సీనియారిటీ జాబితా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన తదితర క్యాడర్ల ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను తయారు చేసి ఆగస్టు 1వ తేదీ నాటికే వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా సీనియారిటీ జాబితాల తయారీ గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేశారు. వీటన్నింటినీ పూర్తి చేశాక ఉపాధ్యాయులకు నెలవారీగా పదోన్నతులు అమలు చేయనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై ఏపీ ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం హర్షం వ్యక్తం చేశారు. తాజా షెడ్యూల్ ఇలా.. ► ఆగస్టు 10వ తేదీ నాటికి ఉపాధ్యాయుల సీనియారిటీ వివరాలు సేకరించాలి. ► ఆగస్టు 18 వ తేదీ నాటికల్లా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాలను వెబ్సైట్లో ఉంచాలి. ► ఆగస్టు 31వ తేదీకల్లా జాబితాపై టీచర్లు తమ అభ్యంతరాలను తెలియజేయాలి ► సెప్టెంబర్ 12వ తేదీ నాటికి ఆ అభ్యంతరాలను అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు. ► సెప్టెంబర్ 15వ తేదీ నాటికల్లా దాదాపు అన్ని క్యాడర్ల తుది సీనియారిటీ జాబితాలను విడుదల చేస్తారు. -
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల
సాక్షి, మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈమేరకు ఉపాధ్యాయులు ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో పరిశీలిస్తూ తమ స్థానాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు. ఇంకోపక్క వివిధ ప్రిపరెన్షియల్ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలు సరైనవేనా అని పరిశీలించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక తక్కువ పాయింట్లు వచ్చినా, పూర్తి స్తాయిలో పాయింట్లు రాకపోయినా ఉపాధ్యాయులు అధికారులకు మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. చాలా మంది తమకు నాలుగో కేటగిరీ పాఠశాలలకు సంబంధించి పాయింట్లు కలపలేదని చెబుతుండగా.. స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నా తక్కువ పాయింట్లు కలిపిన నేపథ్యంలో మరికొందరు దరఖాస్తు వెనక్కి తీసుకుంటున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్లో అధికారులు ఉపాధ్యాయులకు నమోదైన పాయింట్ల వివరాలను పరిశీలిస్తున్నారు. -
జాబితా సిద్ధం
6,060 మందితో టీచర్ల సీనియార్టీ లిస్ట్ అభ్యంతరాలు స్వీకరణకు నేడు గడువు వెలుగు చూస్తున్న అక్రమాలు అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన సీనియార్టీ జాబితా ఎట్టకేలకు తయారైంది. శుక్రవారం రాత్రి ఈ జాబితాను విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. అన్ని కేడర్లకు సంబంధించి 6,060 మంది టీచర్లతో కూడిన సీనియార్టీ జాబితాను డీఈఓ వెబ్సైట్లో ఉంచారు. షెడ్యూలు ప్రకారమైతే శుక్ర, శనివారం అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. అయితే ఒకరోజు ఇప్పటికే ముగియడంతో శనివారం సాయంత్రం మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాలు ఎస్జీటీ కేడర్ అయితే మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ అసిస్టెంట్ కేడర్ అయితే డిప్యూటీ డీఈఓలకు ఆధారాలతో సహా అందజేయాల్సి ఉంటుంది. ఆయా ఎంఈఓ, డిప్యూటీ డీఈఓల పరిశీలన అనంతరం వాటిని పరిగ ణలోకి తీసుకుంటారు. అయితే ప్రాధాన్యత పాయింట్లు కేటాయింపుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయులకు పాఠశాలలకు హాజరుశాతం, దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధి, స్థానికంగా ఉన్నట్లు ధ్రువీకరణ తదితర అంశాల్లో భారీగానే అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టీచర్లు అక్రమాలకు సంబంధించిన ఆధారాలను విద్యాశాఖ అధికారులకు అందజేశారు. సీనియార్టీ జాబితా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో పని చేస్తున్న తోటి ఉపాధ్యాయులే కడుపు మండి అక్రమంగా పాయింట్లు వాడుకున్న టీచర్ల గురించి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం అక్రమాల వివరాలను సేకరిస్తున్నారు. ఊపిరి పీల్చుకున్న విద్యాశాఖ సిబ్బంది ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు ఆమోదం చేసిన దరఖాస్తులను ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేసే ప్రక్రియ ముగియడంతో విద్యాశాఖ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డీఈఓ కార్యాలయంలో మూ డు రోజులుగా రోజూ అర్ధరాత్రి దాకా కన్ఫర్మేషన్ చేశారు. డీఈఓ అంజయ్య, డిప్యూటీ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సుమారు 15 మంది హెచ్ఎంలు, డీఈఓ కార్యాలయ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.