వైద్య సీట్లకు ‘ప్రైవేటు’ పరీక్ష
- 35 శాతం ప్రైవేటు వైద్య సీట్లకు ప్రత్యేక ఎంసెట్
- ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుంచే కన్వీనర్
- స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ
- ‘బి’ కేటగిరీ ఎత్తివేత, 10 శాతం వైద్య, దంత సీట్లకు ఫీజుల పెంపు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ
హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి రాష్ర్ట ప్రభుత్వం తలొగ్గింది. ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోని 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లను మినహాయించి.. మిగిలిన 35 శాతం సీట్లకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ‘బి’ కేటగిరీని ఎత్తేసి ఆ 10 శాతం సీట్లకు ఫీజులను భారీగా పెంచింది. రాష్ర్టంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి.
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం(1,050) సీట్లు, ‘బి’ కేటగిరీ 10 శాతం(210) సీట్లను ఎంసెట్ మెరిట్ ద్వారానే ఇప్పటిదాకా ప్రభుత్వం భర్తీ చేస్తూ వచ్చింది. మిగిలిన 40 శాతం (25 శాతం యాజమాన్య, 15 శాతం ప్రవాస భారతీయ) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చిన రీతిన భర్తీ చేసుకునేవి. ఇప్పుడు ‘బి’ కేటగిరీని ఎత్తేశారు. అందులోని 10 శాతం సీట్లను ఎంసెట్‌తో సంబంధం లేకుండా ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించారు. దీంతో మొత్తంగా 50 శాతం(1,050) సీట్లు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినట్లయింది.
అయితే 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లను మినహాయించి మిగిలిన 35 శాతం(735) సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవడానికి సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది. బి కేటగిరీని ఎత్తేసి, ఫీజులు పెంచడం అత్యంత దారుణమని జూనియర్ డాక్టర్ల(జూడా) కన్వీనర్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలతో మొత్తం వైద్య విద్య ప్రైవేటు చేతుల్లోకి పోయినట్లేనన్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ర్యాంకులు అమ్మే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరారు.
ప్రత్యేక ప్రవేశ పరీక్షకు మార్గదర్శకాలు
తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం(టీపీఎండీసీఎంఏ) నేతృత్వంలో వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష-కళాశాలల సంఘం(ఎంసెట్-ఏసీ) ఏర్పాటవుతుంది. సీట్ల భర్తీ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. అందులో యూనివర్సిటీ నుంచి కూడా ప్రతినిధి ఉంటారు. ఆ కమిటీలో నుంచి ఒకరిని కన్వీనర్‌గా ఎన్నుకుంటారు.
- కన్వీనర్ ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
- ఈ పరీక్షను ప్రభుత్వ ఆధ్వర్యంలోని అడ్మిషన్ అండ్ ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) పర్యవేక్షిస్తుంది.
- ఎంసెట్-ఏసీ పరీక్ష తేదీని, పరీక్ష జరిగే కేంద్రాలను తెలియజేస్తూ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు.
- తెలంగాణలోని ముఖ్య కేంద్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో గుర్తించిన కేంద్రాల్లోనూ పరీక్ష ఉంటుంది.
- ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్ల భర్తీ జరుగుతుంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం లేదా వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయి.
- కన్వీనరే కౌన్సెలింగ్ జరిగే స్థలం, తేదీ, సమయాన్ని ప్రకటిస్తారు.
- ఎంసెట్-ఏసీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను కమిటీ తయారుచేస్తుంది.
- ఒకే ర్యాంకు ఎక్కువ మందికి వస్తే ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో మార్కులను ఆధారం చేసుకుంటారు.
- ఇక రెండో కౌన్సెలింగ్‌లోనూ ‘ఎ’ కేటగిరీలో భర్తీ కాని సీట్లను కూడా కాలేజీలవారీగా ‘సి’ కేటగిరీలోకి చేర్చుతారు.
అందని ద్రాక్షగా వైద్య విద్య
ప్రభుత్వ ఉత్తర్వులతో రాష్ర్టంలో వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. పది శాతం ఉండే ‘బి’ కేటగిరీ వైద్య సీట్లను ప్రైవేటు కాలేజీలకే అప్పగించడంతో పాటు వాటి ఫీజును రూ.2.40 లక్షల నుంచి రూ.9 లక్షలకు సర్కారు పెంచింది. బి, సీ1 కేటగిరీలను కలిపి 35 శాతం సీట్లకు ఏకీకృత ఫీజును నిర్ధారించారు. ఇక నుంచి 35 శాతం సీట్లను ‘బి’ కేటగిరీగానే పిలుస్తారు. ప్రైవేటు దంత కళాశాలల్లోనూ ‘బి’ కేటగిరీని ఎత్తివేశారు. అందులోని 10 శాతం సీట్ల ఫీజునూ పెంచేశారు.
ఇంతకుముందు రూ. 1.30 లక్షలుగా ఉన్న ఫీజును రూ. 4 లక్షలకు పెంచారు. మైనారిటీ కాలేజీల్లో మాత్రం ఈ కేటగిరీ సీట్లకు ఫీజును రూ. 2.70 లక్షలుగా నిర్ణయించారు. ఈ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి పిల్లలకు వైద్య విద్య ఖరీదైపోయింది. గతంలో 2 నుంచి 3 వేల మధ్య ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు బి కేటగిరిలో సీటు వస్తే ఏటా 2.40 లక్షల ఫీజు చెల్లించే వారు. ఇప్పుడు ఆ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఈసారి సీటు రాదు. ఎందుకంటే బీ కేటగిరీ ఎంసెట్ పరిధిలో ఉండదు. పోనీ ప్రైవేట్ కాలేజీలు పెట్టే ప్రత్యేక పరీక్షలో తొలి ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాలంటే రూ.50 లక్షలు ఖర్చు కానుంది. ఇది తలకు మించిన భారమే.