సెప్టెంబర్ 4 వరకు ‘శాంతి’ ఉద్యమం
జమాతె ఇస్లామీ హింద్ పిలుపు
సంగారెడ్డి టౌన్: సర్వమతాలకు నిలయమైన మన దేశంలో మత రాజకీయాలు ఎక్కువయ్యాయని, మతసామరస్యానికి, శాంతిని కోరుకొనే మానవతా వాదులంతా కలిసి రావాలని జమాతె ఇస్లామీ హింద్ (జెఐహెచ్) పిలుపునిచ్చింది. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెఐహెచ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు హాఫిజ్ మహ్మద్ రిషాదోద్దీన్ మాట్లాడుతూ శాంతి స్థాపన కోసం, మతసామరస్యం కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు ‘శాంతి-మానవత ఉద్యమం’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ధార్మిక్ జన్మోర్చా కార్యక్రమం ద్వారా రాష్ట్ర, నగర స్థాయిలలో, సద్భావనా మంచ్ ద్వారా కింది స్థాయి వరకు కార్యక్రమాలను తీసుకెళ్తామన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 4న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెఐహెచ్ జిల్లా అధ్యక్షుడు అంజద్ హుస్సేన్, జెఐహెచ్ సంగారెడ్డి అధ్యక్షుడు గౌస్ మోయియోద్దీన్, జెఐహెచ్ సంగారెడ్డి ప్రెస్ అండ్ పబ్లిసిటీ కార్యదర్శి మహ్మద్ అతర్ మోహియోద్దిన్ షాహెద్, యండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.