Sequoia Capital
-
స్టార్టప్‌లతో 10 కోట్ల కొలువులు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ వ్యవస్థ తోడ్పాటుతో అంకుర సంస్థలు రాబోయే రోజుల్లో 10 కోట్ల పైచిలుకు ఉద్యోగాలను సృష్టించగలవని వెంచర్ క్యాపిటల్ సంస్థ సెకోయా క్యాపిటల్ ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే దేశీ స్టార్టప్‌లు ప్రధానంగా కార్పొరేట్ గవర్నెన్స్‌పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ‘గత కొన్నాళ్లుగా కార్పొరేట్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలి. ఇందుకు సంబంధించి పాటించాల్సిన ప్రక్రియలు, క్రమశిక్షణ మొదలైన వాటి గురించి వ్యవస్థాపకుల్లో అవగాహన పెంచుతున్నాం‘ అని ఆనందన్ వివరించారు. సెకోయా ఇన్వెస్ట్ చేసిన భారత్‌పే, జిలింగో సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన సమస్యలు బైటపడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ అంశాల ఊతంతో అమెరికా, భారత్, చైనా తదితర దేశాల్లోని స్టార్టప్ వ్యవస్థల్లోకి భారీగా నిధులు వచ్చిపడ్డాయని ఆనందన్ చెప్పారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ చైనా వ్యవస్థలోకి గతేడాది దాదాపు 130 బిలియన్ డాలర్లు, అలాగే భారత స్టార్టప్ సంస్థల్లోకి 40 బిలియన్ డాలర్లు వచ్చినట్లు వివరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయని ఆనందన్ చెప్పారు. ‘ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా రేట్లు వేగంగా పెంచవచ్చు. ఎకానమీలోకి కుమ్మరించిన 7 లక్షల కోట్ల డాలర్లలో సింహభాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా స్టార్టప్‌లు ఎదిగేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. -
స్టార్టప్‌ల కోసం సీక్వోయా నిధులు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా సీక్వోయా ఇండియా, సీక్వోయా ఆగ్నేయాసియా 2.85 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,000 కోట్లు)ను సమీకరించాయి. వెరసి గత ఫండ్‌తో పోలిస్తే రెట్టింపు నిధులను సిద్ధం చేసింది. సీక్వోయా తొలిసారి 85 కోట్ల డాలర్లతో దక్షిణాసియాకు ప్రత్యేకించిన ఫండ్‌ను ఆవిష్కరిస్తోంది. మరో 2 బిలియన్ డాలర్లను ఇండియన్ వెంచర్, గ్రోత్ ఫండ్స్‌కు కేటాయించింది. గత 16 ఏళ్లలో ఇండియా, ఆగ్నేయాసియాలకు 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడినట్లు ఎస్ఈసీ ఫైలింగ్స్‌లో సీక్వోయా వెల్లడించింది. సీక్వోయా ఇండియా దేశీయంగా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో దూకుడు చూపుతోంది. ప్రధానంగా ఇండియా, దక్షిణాసియాలలో 400కుపైగా స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసింది. వీటిలో 36 వరకూ యూనికార్న్‌లున్నాయి. ఈ జాబితాలో బైజూస్, జొమాటో, అన్అకాడమీ, పైన్‌ల్యాబ్స్, రేజర్‌పే తదితరాలు చేరాయి. గత 18 నెలల్లో సీక్వోయా నిధులు అందుకున్న స్టార్టప్‌లలో 9 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను సైతం చేపట్టడం గమనార్హం! -
ముందుంది మరింత గడ్డుకాలం!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ఉద్దేశించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వ్యాపారాలు కుదేలవుతున్నాయి. స్టార్టప్ సంస్థలు మరింతగా విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని స్టార్టప్‌లకు యాక్సెల్, కలారి, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, సెకోయా వంటి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు సూచించాయి. కష్టకాలంలో ఉద్యోగాలకు కోత పెట్టకుండా ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని పేర్కొన్నాయి. జీతాలు వాయిదా లేదా తగ్గించడం వంటివి పరిశీలించాలని సూచించాయి. వీసీలు ఈ మేరకు స్టార్టప్‌లకు బహిరంగ లేఖ రాశాయి. వచ్చే 21–30 రోజుల్లో అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రణాళికల అమలుకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, వచ్చే ఏడాది–ఏడాదిన్నర కాలానికి ఎలా ప్రణాళిలు వేసుకోవాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు కుదేలవడంతో వ్యయాలను తగ్గించుకునేందుకు, గడ్డుకాలం గట్టెక్కేందుకు పలు స్టార్టప్ సంస్థలు, డిజిటల్ వ్యాపార సంస్థలు.. సిబ్బందిని తొలగిస్తుండటం, జీతాల్లో కోత పెడుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో తాజాగా వీసీల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వేచి చూసే ధోరణి వద్దు .. ‘భారత్‌లో తొలి దశ ఇన్వెస్టర్లుగా .. మేమంతా దేశీ స్టార్టప్ వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై చాలా ఆశావహంగా ఉన్నాం. మేం ఇన్వెస్ట్ చేసిన సంస్థల వ్యవస్థాపకులు, టీమ్‌లపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి వారంతా బైటపడాలని కోరుకుంటున్నాము‘ అని లేఖలో వీసీ సంస్థలు పేర్కొన్నాయి. నిధుల సమీకరణ, ఉద్యోగుల నిర్వహణ, వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికలు మొదలుకుని ఇన్వెస్టర్లు, వివిధ వాటాదారులతో వ్యవహరించాల్సిన తీరు గురించి ఇందులో పలు సలహాలు, సూచనలు చేశాయి. స్థూలంగా దేశంలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయని ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోగలగడం స్టార్టప్‌లకు చాలా కీలకమని పేర్కొన్నాయి. ‘అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఒకవేళ పరిస్థితి వేగంగా మెరుగుపడిన పక్షంలో దానికి తగ్గట్లుగా సర్దుకుపోవడానికి కూడా సంసిద్ధత ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టత వస్తుందనే ఆశతో.. వేచి చూద్దాం, స్పష్టత వచ్చాకే ఏదో ఒక చర్య తీసుకుందాంలే అనే ధోరణి సరికాదు‘ అని వెంచర్ క్యాపిటల్ సంస్థలు సూచించాయి. ఉద్యోగులు ముఖ్యం... ఈ సందర్భంగా ఏయే అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నదీ వీసీలు వివరించాయి. ‘ముందు ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాతే వ్యాపారాల కొనసాగింపు, లిక్విడిటీ ఉండాలి ‘ అని పేర్కొన్నాయి. మిగతా వ్యయాలన్నింటినీ సమీక్షించుకుని, తగ్గించుకున్న తర్వాతే సిబ్బంది వ్యయాలపై దృష్టి పెట్టాలన్నాయి. సిబ్బంది తొలగింపు, జీతాల తగ్గింపు వంటి అంశాల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తెలుసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలని సూచించాయి. ఒకవేళ ఉద్యోగులపరమై వ్యయాలను తగ్గించుకోవాల్సి వస్తే.. రిక్రూట్‌మెంట్‌ను తాత్కాలికంగా ఆపడం, జీతాలు వాయిదా వేయడం.. తగ్గించడం, విధుల్లో మార్పుచేర్పులు చేయడం, ప్రమోషన్లు వంటి మదింపు విధానాలను సవరించుకోవడం వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలించాలని తెలిపాయి. -
గూగుల్‌కు రాజన్ ఆనందన్ గుడ్‌బై
అమెరికన్ టెక్ జెయింట్ గూగుల్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన గూగుల్‌కు సేవలందించిన గూగుల్ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ సంస్థను వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల చివరి వరకు గూగుల్లోనే కొనసాగుతారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్న ఆనందన్ వెంచర్ ఫండ్ సీక్వోయా క్యాపిటల్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరుగురు మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు ఆనందన్ సంస్థలో నాయకత్వ జట్టులో చేరినట్లు సీక్వోయా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర జి. సింగ్ లింక్డ్ఇన్ పోస్ట్ లో తెలిపారు. మరోవైపు రాజన్ స్థానంలో ప్రస్తుత గూగుల్ సేల్స్ కంట్రీ డైరెక్టర్ వికాస్ అగ్నిహోత్రి తాత్కాలిక బాధ్యత తీసుకుంటారని గూగుల్ వెల్లడించింది. అలాగే గత ఎనిమిదేళ్ళ కాలంలో తమ సంస్థకు విశేష సేవలందించి నందుకుగాను రాజన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గూగుల్ ప్రకటించింది. కాగా, మైక్రోసాఫ్ట్ ఇండియా నుంచి 2010లో ఆనందన్ గూగుల్‌లో చేరారు. అంతకుముందు ఆయన డెల్ ఇండియా, మెకిన్సే అండ్ కంపెనీల్లో పని చేశారు. 8 amazing years. 850million internet users across India and SEA. Many billions of revenue and fastest growing region in the world. Incredible team that thinks big and executes superbly. Thank you @GoogleIndia #GoogleSEA. Loved every minute. — Rajan Anandan (@RajanAnandan) April 2, 2019 -
ఫోర్బ్స్ మిదాస్ లిస్ట్‌లో 11 మంది భారత-అమెరికన్లు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ వంద ఉత్తమ వెంచర్ ఇన్వెస్టర్ల వార్షిక జాబితాలో 11 మంది భారత-అమెరికన్లకు చోటు దక్కింది. వీరంతా స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత తమ వాటాలను భారీ లాభాలకు అమ్మేశారని ఫోర్బ్స్ వివరించింది. మిదాస్ లిస్ట్ పేరుతో ఈ జాబితాను మ్యాగజైన్ రూపొందించింది. ముఖ్యాంశాలు... ఈ జాబితాలో సిక్వియా క్యాపిటల్ భాగస్వామి జిమ్ గోయెట్జ్ అగ్రస్థానంలో నిలిచారు. క్లౌడ్ ఆధారిత ఆర్థిక సేవలు, మానవ వనరుల సాఫ్ట్వేర్ సంస్థ, వర్క్‌డేకు కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత-అమెరికన్ అనీల్ భూస్రీ 17వ స్థానంలో నిలిచారు. ట్విట్టర్, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ టంబ్లర్, పర్సనలైజ్డ్ మ్యాగజైన్ ఫ్లిప్బోర్డ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్సైట్ వెంచర్ పార్ట్నర్స్ ఎండీ దేవన్ పరేఖ్ 22వ స్థానాన్ని సాధించారు. ఇంకా ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత-అమెరికన్లు.. ప్రమోద్ హాకే(27వ స్థానం), నవీన్ చద్దా(30), నీరజ్ అగర్వాల్(37), సమీర్ గాంధీ(41), అషీమ్ చందన(55), వెంకీ గణేశన్(57), వినోద్ ఖోస్లా(63), సలీల్ దేశ్‌పాండే(67), గౌరవ్ గార్గ్(86).