Serpanch
-
జీపీ భవనాలకు అదనపు నిధులు
మోర్తాడ్(బాల్కొండ) : ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను కేటాయించి నిర్మిస్తున్న పంచాయతీలకు అదనంగా మరిన్ని నిధులను కేటాయించాలని ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో భవనానికి రూ. 3 లక్షల చొప్పున కేటాయించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనాలకు కొత్త భవనాలను నిర్మించడానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ. 13 లక్షల చొప్పున కేటాయించారు. అయితే ఈ నిధులతో భవన నిర్మాణం పూర్తయినా చిన్న చిన్న సౌకర్యాలను కల్పించడానికి నిధులు సరిపోకపోవడంతో పంచాయతీ భవనాలు వినియోగంలోకి రాలేకపోయాయి. అదనంగా నిధులు కేటాయిస్తేనే పనులు పూర్తి చేసి భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు భావించారు. జిలాŠోల్ల మొదటి విడతలో కొన్ని భవనాలను నిర్మించగా అప్పట్లో ఒక్కో భవనానికి రూ. 11 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండడంతో నిధులు సరిపోయాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మరో 52 పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 13 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 6 కోట్ల 76 లక్షలను కేటాయించారు. భవనాల నిర్మాణం పూర్తయినా సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ వేయడానికి నిధులు సరిపోలేదు. అంచనాలకు మించి వ్యయం పెరిగిపోవడంతో అదనంగా మరింత నిధులు అవసరం అని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఒక్కో పంచాయతీకి రూ. 3 లక్షల చొప్పున కేటాయిస్తే నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు సూచిస్తున్నారు. సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ కోసం రూ. 3 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 1.56 కోట్ల నిధులు అదనంగా అవసరం అవుతున్నాయి. ఈ నిధులను కేటాయిస్తే జిల్లాలోని పంచాయతీ భవనాల కోసం ఉపాధి హమీ పథకం ద్వారా రూ. 8.32 కోట్లు కేటాయించినట్లు జరుగుతుంది. ప్రభుత్వమే అదనపు నిధులను విడుదల చేయడానికి ప్రతిపాదనలు కోరగా ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నిధులు తొందరలోనే విడుదల అవుతాయని నిధుల కేటాయింపు జరగగానే పంచాయతీ భవనాలను వినియోగంలోకి తీసుకు రావడానికి పనులను పూర్తి చేయిస్తామని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. అదనపు నిధులు కేటాయించడం సబబే.. గ్రామ పంచాయతీ భవనాలకు అదనంగా రూ. 3 లక్షల చొప్పున నిధులను కేటాయించడం సబబే. రూ. 13 లక్షలతో భవన నిర్మాణం పూర్తి కాగా ఇతర సౌకర్యాల కోసం అదనంగా నిధులు అవసరం ఉన్నాయి. పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండడంతో ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించడం సమంజసమే. – నాగం పోశన్న, సర్పంచ్, వడ్యాట్ నిధులు మంజూరైతేనే భవనాలు వినియోగంలోకి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా కేటాయించిన రూ. 13 లక్షల నిధులతో భవనాలను నిర్మించారు. కానీ సౌకర్యాలు మెరుగుపడలేదు. ఇప్పుడు రూ. 3 లక్షల అదనపు నిధులు మంజూరైతే సౌకర్యాలు వృద్ధి చెంది భవనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి. – లింగన్న, సర్పంచ్, దోన్పాల్ -
పవర్ ‘పంచాయితీ’
సాక్షి, మంచిర్యాల : గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, సర్పంచుల మధ్య అగాధాన్ని పెంచుతోంది. బకాయిపడ్డ కరెంట్ బిల్లుల చెల్లింపు బాధ్యత పంచాయతీలదేనని ఇది వరకే స్పష్టం చేసిన ప్రభుత్వం బిల్లు వసూళ్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిం చాలని పంచాయతీ, విద్యుత్ అధికారులను ఆదేశించింది. అవసరమైతే పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్యుత్ శాఖాధికారులు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 30కిపైగా గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిపేశారు. ప్రజల ఆందోళనలతో మళ్లీ పునరుద్ధరించారు. విద్యుత్ బకాయి వసూళ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్న సర్పంచులు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లించేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. మరోపక్క.. విద్యుత్ చార్జీల వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినా.. వసూళ్లలో పురోగతి లేకపోవడంతో పంచాయత్‌రాజ్ శాఖ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ శనివారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల డీపీవోలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఒకవేళ సమావేశంలో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే.. బకాయి ఉన్న పంచాయతీలకు కరెంట్ సరఫరా నిలిపివేసే అవకాశాలూ లేకపోలేదని ఆ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. కొనసాగుతున్న కరెంట్ సరఫరా నిలిపివేత.. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 27 మేజర్ పంచాయతీలుండగా.. మిగిలినవి మైన ర్ జీపీలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. సంబంధిత శాఖాధికారులు బకాయిలు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో అంధకారం నెలకొనడంతోపాటు తాగునీటి పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు రక్షిత తాగునీటికి దూరమవుతున్నారు. పలు చోట్ల సర్పంచులు, ఎమ్మెల్యేల హామీతో విద్యుత్ అధికారులు కరెంటును పునరుద్ధరిస్తున్నారు. ఏదీ స్పష్టత...? విద్యుత్ చార్జీల చెల్లింపు విషయంలో ప్రభుత్వం, సర్పంచుల మధ్య అవగాహన లోపమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని పలువురు సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. గతంలో గత ప్రభుత్వాలే గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు చెల్లించేవని, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గ్రామాల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత ఆయా పంచాయతీలపై మోపడం అన్యాయమని సర్పంచులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం గతంలో కేంద్రం నుంచి వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి కోత విధించి జిల్లాలకు పంపించామని, కోత పెట్టిన నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం వచ్చిన నిధులు కోత లేకుండా మొత్తాన్ని పంచాయతీలకు విడుదల చేశామని చెబుతోంది. అయితే.. ఈ విషయాన్ని సర్పంచులకు వివరించడంలో ప్రభుత్వం, అధికారులు వైఫల్యం చెందడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామారావు రాథోడ్ అభిప్రాయపడ్డారు. సర్పంచులు సహకరించడం లేదు. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. మన జిల్లాకు మూడు విడతలుగా రూ.60 కోట్లు వస్తాయి. అందులో నుంచి 15 శాతం నిధులు మాత్రమే విద్యుత్ బకాయిల కింద చెల్లించాలని చెప్పాం. అయినా సర్పంచులెవరూ స్పందించడం లేదు. ఒక్కో పంచాయతీకి సగటున రూ.50 లక్షల నిధులొచ్చాయి. వాటిలో కొంత మేరకైనా బకాయి చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు రూ.55 లక్షలు మాత్రమే చెల్లించారు. విద్యుత్ శాఖకు రూ.83 కోట్ల వరకు బకాయి ఉన్నాం. -
ఒక్క రూపాయి ఇవ్వం
రాజుపాళెం: టీఎఫ్సీ నిధులలో ఒక్క రూపాయి కూడా ఇవ్వమని సర్పంచులు తేల్చి చెప్పారు. మండల పరిషత్ సభా భవనంలో సోమవారం మండలంలోని సర్పంచులందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టీఎఫ్సీ నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర అవసరాలకు వాడేవారమన్నారు. ఉన్న కొద్ది నిధులను విద్యుత్ బకాయిలకు కట్టాలని తీసుకుంటే అభివృద్ధి పనులను ఏ విధంగా చేయాలన్నారు. మండలంలో రూ.58 లక్షల 95,355 విద్యుత్ బకాయి ఉందన్నారు. టంగుటూరుకు రూ. 5, 60,531 విద్యుత్ బకాయిలు కట్టాలని చెప్పారన్నారు. టీఎఫ్‌సీలో రూ. 2 లక్షల 50 వేలు మాత్రమే ఉందని, మిగతా మొత్తం ఏవిధంగా కట్టాలన్నారు. విద్యుత్ బకాయిలు కట్టాలంటూ ఏ ఒక్క సర్పంచ్‌కు నోటీసులు రాలేదన్నారు. అనంతరం ఎంపీడీఓ రామచంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. -
ముగిసిన ‘మన ఊరు-మన ప్రణాళిక’
ఆదిలాబాద్ అర్బన్ : పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘మనఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాలు ముగిశాయి. గ్రామ, వార్డు, మండల, జిల్లా మూడు దశల్లో తయారు చేస్తున్న ఈ ప్రణాళికలో భాగంగా మొదటి దశ అయిన గ్రామాల్లో పూర్తయ్యింది. గ్రామాల్లో ఈనెల 13 నుంచి 18 వరకు ఆరు రోజుల పాటు కొనసాగాయి. ప్రజా అవసరాలు, వసతులు, సహజ వనరులు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సామాజిక అభివృద్ధికి గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు తయారు చేశారు. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారి, సర్పంచ్, గ్రామాధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ ప్రణాళికలకు రూపకల్పన వచ్చింది. ప్రజల సమక్షంలోనే ఆయా అంశాలను చేర్చిన అధికారులు తదుపరి సర్పంచ్ ఆమోదంతో మండలానికి పంపారు. ఈ ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రణాళికపై ప్రజలకు అవగాహన కల్పించే వాల్ పోస్టర్లు కార్యక్రమం ముగింపు సమయంలో జిల్లాకు రావడం కొసమెరుపు. గ్రామ ప్రణాళిక తయారు.. గ్రామ పంచాయతీ అభివృద్ధి అంచనా, వ్యయం, జీపీ ఆదాయం, జీపీ పరిధిలోని ప్రభుత్వ భూమి, సహజ వనరులు, చెరువులు, కుంటలు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు, గ్రామ జనాభా, వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలలు, తాగునీరు, పంచాయతీ పరిధిలో ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రణాళిక, స్మశాన వాటికలు, డంపింగ్ యాడ్స్, మౌలిక సదుపాయాలతోపాటు గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన అంశాలన్నీ ఈ ప్రణాళికలో చేర్చారు. ఇదిలా ఉంటే.. కొన్ని పంచాయతీల్లో భూ పంపిణీ కార్యక్రమం కింద తమకు భూ పంపిణీ చేయాలని కొంత ప్రజలు కోరగా, ఆ అంశం ఇందులో లేదని వెనక్కి పంపించినట్లుగా ప్రజలు పేర్కొంటున్నారు. మండల ప్రణాళిక తయారీ ఇలా.. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల మండలాధికారుల సమన్వయంతో మండల స్థాయి ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. మండలంలోని అన్ని గ్రామస్థాయి ప్రణాళికలను క్రోడీకరించి పూర్తి మండల స్థాయి ప్రణాళికను మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదింపజేస్తారు. ఇలా ఆమోదించిన మండల ప్రణాళికను జిల్లా పరిషత్‌కు పంపాల్సి ఉంటుంది. తయారీకి మంత్రి రాక.. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం కింద మండల స్థాయి ప్రణాళికల తయారీ కార్యక్రమాలు ఈనెల 19 నుంచి 23 వరకు మండలాల్లో కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం బెల్లంపల్లి, రెబ్బెన మండలాల్లో నిర్వహించే మండల ప్రణాళికల తయారీకి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న హాజరుకానున్నారు.