ముగిసిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ | released funds for development of rural areas | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘మన ఊరు-మన ప్రణాళిక’

Published Sat, Jul 19 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

ముగిసిన ‘మన ఊరు-మన ప్రణాళిక’

ముగిసిన ‘మన ఊరు-మన ప్రణాళిక’

ఆదిలాబాద్ అర్బన్ : పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘మనఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాలు ముగిశాయి. గ్రామ, వార్డు, మండల, జిల్లా మూడు దశల్లో తయారు చేస్తున్న ఈ ప్రణాళికలో భాగంగా మొదటి దశ అయిన గ్రామాల్లో పూర్తయ్యింది. గ్రామాల్లో ఈనెల 13 నుంచి 18 వరకు ఆరు రోజుల పాటు కొనసాగాయి. ప్రజా అవసరాలు, వసతులు, సహజ వనరులు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సామాజిక అభివృద్ధికి గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు తయారు చేశారు.
 
గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారి, సర్పంచ్, గ్రామాధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ ప్రణాళికలకు రూపకల్పన వచ్చింది. ప్రజల సమక్షంలోనే ఆయా అంశాలను చేర్చిన అధికారులు తదుపరి సర్పంచ్ ఆమోదంతో మండలానికి పంపారు. ఈ ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రణాళికపై ప్రజలకు అవగాహన కల్పించే వాల్ పోస్టర్లు కార్యక్రమం ముగింపు సమయంలో జిల్లాకు రావడం కొసమెరుపు.
 
గ్రామ ప్రణాళిక తయారు..

గ్రామ పంచాయతీ అభివృద్ధి అంచనా, వ్యయం, జీపీ ఆదాయం, జీపీ పరిధిలోని ప్రభుత్వ భూమి, సహజ వనరులు, చెరువులు, కుంటలు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు, గ్రామ జనాభా, వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలలు, తాగునీరు, పంచాయతీ పరిధిలో ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రణాళిక, స్మశాన వాటికలు, డంపింగ్ యాడ్స్, మౌలిక సదుపాయాలతోపాటు గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన అంశాలన్నీ ఈ ప్రణాళికలో చేర్చారు. ఇదిలా ఉంటే.. కొన్ని పంచాయతీల్లో భూ పంపిణీ కార్యక్రమం కింద తమకు భూ పంపిణీ చేయాలని కొంత ప్రజలు కోరగా, ఆ అంశం ఇందులో లేదని వెనక్కి పంపించినట్లుగా ప్రజలు పేర్కొంటున్నారు.
 
మండల ప్రణాళిక తయారీ ఇలా..
మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల మండలాధికారుల సమన్వయంతో మండల స్థాయి ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. మండలంలోని అన్ని గ్రామస్థాయి ప్రణాళికలను క్రోడీకరించి పూర్తి మండల స్థాయి ప్రణాళికను మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదింపజేస్తారు. ఇలా ఆమోదించిన మండల ప్రణాళికను జిల్లా పరిషత్‌కు పంపాల్సి ఉంటుంది.
 
తయారీకి మంత్రి రాక..
మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం కింద మండల స్థాయి ప్రణాళికల తయారీ కార్యక్రమాలు ఈనెల 19 నుంచి 23 వరకు మండలాల్లో కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం బెల్లంపల్లి, రెబ్బెన మండలాల్లో నిర్వహించే మండల ప్రణాళికల తయారీకి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement