Our town-our plan
-
మళ్లీ ఇవ్వండి!
సాక్షి, మంచిర్యాల : ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా ఆయా గ్రా మాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర సర్కారు పునఃసమీక్షిస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రజల అవసరాలపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశిం చింది. దీంతో అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శులు సమాచార సేకరణలో బిజీగా మారారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ఆయా గ్రామాలు, ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు కావాల్సిన రోడ్లు, మరుగుదొడ్లు, నీటిసదుపాయం, ఇతరత్రా సామాజిక అవసరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు వారంపాటు సాగిన ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించారు. వాటిని ‘మన మండలం-మన ప్రణాళిక’లో క్రోడీక రించి జిల్లా స్థాయికి నివేదికలు పంపించారు. జిల్లా ప్రజాపరిషత్ అధికారులు మండలాల సమగ్ర నివేదికలన్నింటి ఆధారంగా జిల్లాకు కావాల్సిన అవసరాలు పేర్కొంటూ సంబంధిత వెబ్సైట్లో నమోదు చేశారు. అయితే ఈ నమోదు తర్వాత ప్రభుత్వం మొదట ప్రకటించినట్లుగానే ఆయా వివరాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్లైన్లో ఉంచింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున తప్పుల తడకగా వివరాలు ఉండటం బయటకు వచ్చింది. వాటితోనే చిక్కంతా.. గ్రామ ప్రణాళికలను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం కాస్త ఇళ్ల నిర్మాణం కోసం, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేదిగా మారింది. ఆయా పథకాల అర్హులు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఒక్కో గ్రామంలో నివసిస్తున్న ప్రజల కంటే పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్యే అధికంగా కనిపించింది. మరోవైపు వివరాలను ఆన్లైన్లో ఉంచినపుడు గ్రామ ప్రజల కంటే పింఛన్లు పొందుతున్నవారు ఎక్కువని, స్త్రీల కంటే వితంతువుల సంఖ్యే అధికమనే విచిత్రాలు కనిపించాయి. ఈ అవకతవకలను సరిదిద్దేందుకు సర్కారు వాస్తవ వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జెడ్పీ కార్యాలయం నుంచి ఆయా మండలాల ఎంపీడీవోలకు వివరాలు తిరిగి అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన వారెందరు, పింఛన్ల రావాల్సినవారెందరు అనే సమచారాన్ని గ్రామకార్యదర్శుల ద్వారా ఎంపీడీవోలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సదరు దరఖాస్తుదారుల ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డుల సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఈ తంతు మరో రెండ్రోజుల్లో ముగించి 25వ తేదీ వరకు జిల్లా అధికారులు సమగ్ర నివేదిక సిద్ధంచేసుకునేలా కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘మన ప్రణాళిక’లో పది పనులకు అత్యంత ప్రాధాన్యం
పూడూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో పది పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తెలిపారు. మండలంలో అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 2013-2014లో మంజూరైన పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. మండలానికి గత సంవత్సరంలో జెడ్పీ, బీఆర్జీఎఫ్లకు సంబంధించి రూ. కోటి విలువైన పనులు మంజూరైనట్లు చెప్పారు. అయితే వాటిలో చాలా పనులు అసంపూర్తిగానే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను కాంట్రాక్ట్ తీసుకొని పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్ల లెసైన్సులను రద్దు చేసేందుకు వెనకాడబోమన్నారు. చన్గోముల్ నుంచి వ్యవసాయ పొలాల వరకు ఫార్మేషన్ రోడ్డు మంజూరై అగ్రిమెంట్ అయినా ఇంత వరకు పనులు పూర్తి కాలేదన్నారు. చన్గోముల్, పూడూరు, కంకల్, పుడుగుర్తి గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కంకల్వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓను గ్రామ ఉపసర్పంచ్ జమీర్ కోరారు. అనంతరం మండల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆమ్రాది భారతమ్మ, ఎంపీడీఓ సుధారాణి, పీఆర్డీఈ అంజయ్య, ఏఈలు నర్సింలు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి తదతరులు పాల్గొన్నారు. -
రహదారులకు మహర్దశ
నిజామాబాద్ సిటీ: జిల్లాలోని ప్రధాన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇందుకోసం ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భారీ ప్రతిపాదనలను చేర్చారు. కొత్త రోడ్లను నిర్మించటంతో పాటు, ఉన్న రోడ్ల ను అభివృద్ధి చేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రానున్న ఐదేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా రూ.770.20 కో ట్ల పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిం చారు. నిజామాబాద్ డివిజన్లో రూ. 508.70 కోట్లు, జిల్లా కేంద్రంలో రూ. 8 కోట్లు, బోధన్ డివిజన్లో 253.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పటి వరకు అసలే లేని చోట రోడ్లను నిర్మించి, ఒక గ్రామంతో మరొక గ్రావూనికి అనుసంధానం చేయనున్నారు. దీంతో దూరం తగ్గటమే కాకుండా, ప్రయాణ వ్యయం తగ్గుతుంది. నిజామాబాద్-నర్సి మార్గంలో ఆరు మైనర్ బ్రిడ్జిలను ప్రతిపాదనలో చేర్చారు. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వరకు రోడ్డును వెడల్పు చేసి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు. మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిజామాబాద్, డిచ్పల్లి రహదారిలోని మాధవనగర్ రైల్వేగేట్ వద్ద నిత్యం విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ మధ్య గతంలో మాధవనగర్, డిచ్పల్లి, కామారెడ్డి, గుండ్ల పోచంపల్లి మొత్తం నాలుగు ప్రాంతాలలో రైల్వే గేట్లు ఉండేవి. హైదరాబాద్ నుంచి డిచ్పల్లి వరకు రోడ్డును విస్తరించటంతో గుండ్ల పోచంపల్లి, కామారెడ్డి, డిచ్పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. దీంతో ప్రయాణికులకు చాలావరకు ప్రయాణ సమయం ఆదా అయ్యింది. ఇక మాధవ్‌నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి కలగానే మిగిలిపోయిం ది. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో ఇక్కడ రైల్వేఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 80కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. దీని నిర్మాణం పూర్తయితే ప్రజలకు రైల్వేగేట్‌తో ఇబ్బందులు తప్పనున్నాయి. నగరంలో నగరంలో రైల్వేకమాన్ వద్ద ప్రస్తుతం ఒకటే మార్గం ఉంది. దీని పక్కన మరొకటి నిర్మించేందుకు రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. అర్సపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు రూ. 40 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. వాస్తవానికి బైపాస్‌రోడ్డు నిర్మాణం మొదలు పెట్టగానే ఈ బ్రిడ్జి పనులు మొదలు పెట్టవలసి ఉండగా, నేటికీ శంకుస్థాపన జరుగలేదు. ఇప్పుడు మన ఊరు ప్రణాళికలో దీనిని చేర్చారు. -
4804 కోట్లు
- జిల్లా ప్రణాళిక సిద్ధం - 10,174 పనులు గుర్తింపు.. - 22న జెడ్పీ పాలక మండలి సమావేశం - ప్రణాళికకు ఆమోదం తెలిపే అవకాశం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా చేపట్టిన ప్రణాళిక సిద్ధమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకొని వారికి కావలసిన అభివృద్ధి పనులను రాష్ట్ర బడ్జెట్లో పొందుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో నేరుగా నిధులు కేటాయించకుండా గ్రామస్థాయిలో ఏఏ పనులు అవసరమో నేరుగా గ్రామస్థాయి ప్రజలను భాగస్వామ్యం చేశారు. ఈ మేరకు జిల్లాలో 10,174 పనులను గుర్తించారు. దీనికి 4804 కోట్ల రూపాయలు అవసరమని నిర్ణయించారు. గ్రామ ప్రణాళికలో జిల్లాలోని 1331 గ్రామ పంచాయతీల్లో మొత్తం 484 పనులను గుర్తించారు. ఇందుకు గాను రూ.2776 కోట్లు నిధుల అవసరం కానున్నట్లు అంచనా వేశారు. మండల స్థాయి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 64మండలాల్లోని ప్రణాళికలను కలుపుకొని 640 పనులకు రూ.2028 కోట్ల అంచనా వేశారు. జిల్లాస్థాయిలో మొతం 50 రకాల పనులు గుర్తించారు. ఈ పనులకు సంబంధించిన నిధుల అంచనాలను ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం... శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సిద్ధం చేసిన ప్రణాళికను ఆమోదానికి పెట్టనున్నారు. జెడ్పీ ఆమోదం పొందిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచేలా చూడనున్నారు. ఆదే రోజు జిల్లా పరిషత్ పరిధిలో ఉండే మొత్తం 7స్టాండింగ్ కమిటీలను ఎన్నుకోనున్నారు. జిల్లాస్థాయి ప్రణాళికలు.... తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండడంతో ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్ట్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే గట్టు మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు జిల్లా ప్రజల కల అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు, గద్వాల, నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్, నేషనల్ హైవే, స్టేట్ హైవే కింద కొల్లాపూర్ నుంచి జడ్చర్ల, జడ్చర్ల నుంచి కోదాడ వయా కల్వకుర్తి రోడ్లను ప్రతిపాదించారు. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో ఏరియా ఆసుపత్రులకు ఏర్పాటు, మఖ్తల్, నారాయణపేట్, జడ్చర్ల, అలంపూర్, మహబూబ్‌నగర్, కొత్తకోటల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పెద్దకొత్తపల్లి, ఇటిక్యాల(మాడల్), వడ్డెపల్లి, తెల్కపల్లి, తలకొండపల్లి, దౌల్తాబాద్, కొడంగల్, కొత్తూర్,లింగాల్, బొమ్రాస్పేట్, నర్వ, బిజినపల్లి, చిన్నచింతకుంట, హన్వాడ, ఉప్పునుంతలలో ప్రభుత్వ జూనియర్‌కాలేజీలు, బల్మూర్, అమ్రాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆమన్‌గల్, కల్వకుర్తి, బాలుర అచ్చంపేట, గద్వాల, వడ్డేపల్లి, దేవరకద్ర, మక్తల్‌లలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మించేందుకు ఎంపిక చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రాజోలి మళ్లింపు పథకం, బీమా లిఫ్ట్ ఇరిగేషన్లకు కెనాల్ లైనింగ్ వర్క్స్ చేపట్టాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. గద్వాల నుంచి మాచర్ల వరకు డబుల్ లైన్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లాను పర్యటకరంగంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా ప్రణాళికలో ప్రతిపాదనలను పొందుపర్చారు. ఇందుకు గాను కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించేందుకు బోటింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఈ బోటును నడిపేందుకు ప్రతిపాదించారు. దీంతోపాటు ఎకో టూరిజం ప్రాజెక్ట్, పిల్లలమర్రిలో ఆంపి థియేటర్‌తోపాటు పార్క్‌ను ఏర్పాటు చేయాలని, మహబూబ్‌నగర్‌లో మినీ శిల్పారామం ఏర్పాటు, ఫ్యూ పాయింట్‌కు అనుకూలంగా ఉన్న ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, ఫరహాబాద్ వ్యూపాయింట్ల అభివృద్ధిని చేయాలని ప్రతిపాదించారు. -
‘మన ఊరు-మన ప్రణాళిక’ ఉల్టా పల్టా...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ జిల్లాలో గందరగోళంగా మారింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాల వారీగా ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రూ. 1372 కోట్లతో పనులకు జులై నెలాఖరు నాటికి ప్రణాళికలు తయారు చేసి వాటిని జిల్లా యంత్రాంగానికి సమర్పించారు. అయితే ఈ ప్రణాళికలో భారీగా పొరపాట్లు చోటు చేసుకోవడంతో యంత్రాంగానికి తలనొప్పి మొదలైంది. సోమవారం జిల్లా పరిషత్‌లో ఎంపీడీఓలు, ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో అసలు కథ బయటపడింది. ఒకే కేటగిరీ పనులను గుర్తిస్తూ.. నిబంధనల ప్రకారం ప్రతి హాబిటేషన్ స్థాయిలో మూడు పనులు, మండల స్థాయిలో పది పనులు గుర్తించాలి. ఇలా గుర్తించే పనుల్లో వేరువేరుగా.. రోడ్డు, మురుగు నీటి పారుదల, తాగునీరు ఇలా ఉండాలి. కానీ పలు మండలాల్లో ఒకే కేటగిరీకి సంబంధించి రెండు, మూడు చొప్పున పనులు గుర్తిస్తూ ప్రణాళికలు తయారు చేసారు. దీంతో ప్రణాళిక కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ రెండో పనిని ఆమోదించడం లేదు. అదేవిధంగా హాబిటేషన్ స్థాయిలో మూడు పనులు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. కొన్ని మండలాల్లో పంచాయతీ స్థాయిలో మూడు పనులు చొప్పున గుర్తిస్తూ ప్రణాళికలు తయారు చేశారు. దాదాపు 17 మండలాల్లో రెండేసి పనులు గుర్తించినట్లు సమాచారం. ఫలితంగా ప్రణాళికలపై తీవ్ర గంద రగోళం నెలకొంది. హడావుడిగా ‘సవరణ’లు.. గ్రామ, మండల స్థాయిలో రూపొందించిన ప్రణాళికల్ని సర్కారు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చే యాల్సి ఉంది. ఈనెల 8వతేదీతో సాఫ్ట్వేర్ మూతపడనుంది. ఆ తర్వాత జిల్లాల వారీగా సీఎం పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రణాళికపై ఆయన స్పందించనున్నారు. దీంతో గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ఎన్.శ్రీధర్ సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పలు మండలాలోని ప్రణాళికలు అసంపూర్తిగా ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాట్లను ప్రస్తావిస్తూ సాయంత్రానికల్లా సరిదిద్దాలని స్పష్టం చేశారు. దీంతో ఎంపీడీఓలు ప్రణాళికల్లో సవరణకు దిగారు. రాత్రి పొద్దుపోయేవరకు జిల్లా పరిషత్‌లోనే ఈ ప్రక్రియ కొనసాగింది. తారుమారు.. ప్రణాళికల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో వాటిని సవరించేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. మొత్తంగా సోమవారం రాత్రికల్లా జిల్లా పరిషత్‌లో ఆయా ప్రణాళికలు సమర్పించారు. అయితే ఇందుకు సంబంధించి అంచనాలు కొలిక్కి రాలేదు. మండల, గ్రామ స్థాయికి సంబంధించిన ప్రణాళికల్లో పొరపాట్లను సరిదిద్దడంతో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. ప్రజాప్రతినిధులు, పాలకవర్గాల ఆమోదంతో ప్రణాళికల్లో చేర్చిన పలు పనులు తారుమారయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో మరింత గందరగోళం జరిగే అవకాశం ఉంది. ఎంపీడీఓల నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో పొరపాట్లను సరిదిద్ది ప్రణాళికలను వెబ్సైట్లో నిక్షిప్తం చేయనున్నట్లు జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
మహిళలు వంటింటికే!
ఆర్మూర్ : మహిళా రిజర్వేషన్లు అభాసుపాలవుతున్నాయి. పేరుకే మహిళా ప్రజాప్రతినిధులు.. వారి వెనక కుటుంబ సభ్యులే ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ గురువారం ఆర్మూర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన పట్టణం-మన ప్రణాళిక’ సమీక్ష సమావేశమే. మహిళా కౌన్సెలర్లకు బదులు వారి భర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంకంటే ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు తప్ప సమావేశంలో ఎవ్వరూ ఉండకూడదని సిబ్బంది పలుమార్లు ప్రకటించారు. అయినా మహిళా కౌన్సెలర్ల భర్తలు సమావేశ మందిరంనుంచి బయటికి వెళ్లలేదు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని అలాగే నిర్వహించారు. సమావేశానికి మహిళా కౌన్సెలర్లు బోన్ల సుజాత, లత జో శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. మిగతా మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలు జాగిర్దార్ శ్రీనివాస్, నర్మె నవీన్, పింజ వినోద్, వన్నెల్దేవి రాము, మాలిక్ బాబా, మరో కౌన్సిలర్ అన్న సుంకరి రంగన్న సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ భర్త సంజయ్ సింగ్ బబ్లూ సైతం సమావేశానికి వచ్చారు. సమావేశం ప్రారంభంలో టీఆర్ఎస్ నాయకులు, మరికొందరు మహిళా కౌన్సెలర్ల భర్తలు సైతం సమావేశానికి హాజరు కావడంతో టీడీపీ కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డికి కుర్చీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ కౌన్సెలర్‌కు కుర్చీ ఇవ్వని విధానం ఏంటని ప్రశ్నించడంతో కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోయారు. అధికారులు సైతం ఇదేమీ పట్టించుకోలేదు. -
ముగిసిన ‘మన ఊరు-మన ప్రణాళిక’
ఆదిలాబాద్ అర్బన్ : పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘మనఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాలు ముగిశాయి. గ్రామ, వార్డు, మండల, జిల్లా మూడు దశల్లో తయారు చేస్తున్న ఈ ప్రణాళికలో భాగంగా మొదటి దశ అయిన గ్రామాల్లో పూర్తయ్యింది. గ్రామాల్లో ఈనెల 13 నుంచి 18 వరకు ఆరు రోజుల పాటు కొనసాగాయి. ప్రజా అవసరాలు, వసతులు, సహజ వనరులు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సామాజిక అభివృద్ధికి గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు తయారు చేశారు. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారి, సర్పంచ్, గ్రామాధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ ప్రణాళికలకు రూపకల్పన వచ్చింది. ప్రజల సమక్షంలోనే ఆయా అంశాలను చేర్చిన అధికారులు తదుపరి సర్పంచ్ ఆమోదంతో మండలానికి పంపారు. ఈ ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రణాళికపై ప్రజలకు అవగాహన కల్పించే వాల్ పోస్టర్లు కార్యక్రమం ముగింపు సమయంలో జిల్లాకు రావడం కొసమెరుపు. గ్రామ ప్రణాళిక తయారు.. గ్రామ పంచాయతీ అభివృద్ధి అంచనా, వ్యయం, జీపీ ఆదాయం, జీపీ పరిధిలోని ప్రభుత్వ భూమి, సహజ వనరులు, చెరువులు, కుంటలు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు, గ్రామ జనాభా, వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలలు, తాగునీరు, పంచాయతీ పరిధిలో ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రణాళిక, స్మశాన వాటికలు, డంపింగ్ యాడ్స్, మౌలిక సదుపాయాలతోపాటు గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన అంశాలన్నీ ఈ ప్రణాళికలో చేర్చారు. ఇదిలా ఉంటే.. కొన్ని పంచాయతీల్లో భూ పంపిణీ కార్యక్రమం కింద తమకు భూ పంపిణీ చేయాలని కొంత ప్రజలు కోరగా, ఆ అంశం ఇందులో లేదని వెనక్కి పంపించినట్లుగా ప్రజలు పేర్కొంటున్నారు. మండల ప్రణాళిక తయారీ ఇలా.. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల మండలాధికారుల సమన్వయంతో మండల స్థాయి ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. మండలంలోని అన్ని గ్రామస్థాయి ప్రణాళికలను క్రోడీకరించి పూర్తి మండల స్థాయి ప్రణాళికను మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదింపజేస్తారు. ఇలా ఆమోదించిన మండల ప్రణాళికను జిల్లా పరిషత్‌కు పంపాల్సి ఉంటుంది. తయారీకి మంత్రి రాక.. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం కింద మండల స్థాయి ప్రణాళికల తయారీ కార్యక్రమాలు ఈనెల 19 నుంచి 23 వరకు మండలాల్లో కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం బెల్లంపల్లి, రెబ్బెన మండలాల్లో నిర్వహించే మండల ప్రణాళికల తయారీకి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న హాజరుకానున్నారు.