- జిల్లా ప్రణాళిక సిద్ధం
- 10,174 పనులు గుర్తింపు..
- 22న జెడ్పీ పాలక మండలి సమావేశం
- ప్రణాళికకు ఆమోదం తెలిపే అవకాశం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా చేపట్టిన ప్రణాళిక సిద్ధమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకొని వారికి కావలసిన అభివృద్ధి పనులను రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నేరుగా నిధులు కేటాయించకుండా గ్రామస్థాయిలో ఏఏ పనులు అవసరమో నేరుగా గ్రామస్థాయి ప్రజలను భాగస్వామ్యం చేశారు. ఈ మేరకు జిల్లాలో 10,174 పనులను గుర్తించారు. దీనికి 4804 కోట్ల రూపాయలు అవసరమని నిర్ణయించారు.
గ్రామ ప్రణాళికలో జిల్లాలోని 1331 గ్రామ పంచాయతీల్లో మొత్తం 484 పనులను గుర్తించారు. ఇందుకు గాను రూ.2776 కోట్లు నిధుల అవసరం కానున్నట్లు అంచనా వేశారు. మండల స్థాయి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 64మండలాల్లోని ప్రణాళికలను కలుపుకొని 640 పనులకు రూ.2028 కోట్ల అంచనా వేశారు. జిల్లాస్థాయిలో మొతం 50 రకాల పనులు గుర్తించారు. ఈ పనులకు సంబంధించిన నిధుల అంచనాలను ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం...
శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సిద్ధం చేసిన ప్రణాళికను ఆమోదానికి పెట్టనున్నారు. జెడ్పీ ఆమోదం పొందిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచేలా చూడనున్నారు. ఆదే రోజు జిల్లా పరిషత్ పరిధిలో ఉండే మొత్తం 7స్టాండింగ్ కమిటీలను ఎన్నుకోనున్నారు.
జిల్లాస్థాయి ప్రణాళికలు....
తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండడంతో ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్ట్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే గట్టు మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు జిల్లా ప్రజల కల అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు, గద్వాల, నారాయణపేటలో టెక్స్‌టైల్ పార్క్, నేషనల్ హైవే, స్టేట్ హైవే కింద కొల్లాపూర్ నుంచి జడ్చర్ల, జడ్చర్ల నుంచి కోదాడ వయా కల్వకుర్తి రోడ్లను ప్రతిపాదించారు.
వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో ఏరియా ఆసుపత్రులకు ఏర్పాటు, మఖ్తల్, నారాయణపేట్, జడ్చర్ల, అలంపూర్, మహబూబ్‌నగర్, కొత్తకోటల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పెద్దకొత్తపల్లి, ఇటిక్యాల(మాడల్), వడ్డెపల్లి, తెల్కపల్లి, తలకొండపల్లి, దౌల్తాబాద్, కొడంగల్, కొత్తూర్,లింగాల్, బొమ్రాస్‌పేట్, నర్వ, బిజినపల్లి, చిన్నచింతకుంట, హన్వాడ, ఉప్పునుంతలలో ప్రభుత్వ జూనియర్‌కాలేజీలు, బల్మూర్, అమ్రాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆమన్‌గల్, కల్వకుర్తి, బాలుర అచ్చంపేట, గద్వాల, వడ్డేపల్లి, దేవరకద్ర, మక్తల్‌లలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మించేందుకు ఎంపిక చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రాజోలి మళ్లింపు పథకం, బీమా లిఫ్ట్ ఇరిగేషన్‌లకు కెనాల్ లైనింగ్ వర్క్స్ చేపట్టాలని ప్రణాళికలను సిద్ధం చేశారు.
గద్వాల నుంచి మాచర్ల వరకు డబుల్ లైన్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లాను పర్యటకరంగంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా ప్రణాళికలో ప్రతిపాదనలను పొందుపర్చారు. ఇందుకు గాను కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించేందుకు బోటింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఈ బోటును నడిపేందుకు ప్రతిపాదించారు. దీంతోపాటు ఎకో టూరిజం ప్రాజెక్ట్, పిల్లలమర్రిలో ఆంపి థియేటర్‌తోపాటు పార్క్‌ను ఏర్పాటు చేయాలని, మహబూబ్‌నగర్‌లో మినీ శిల్పారామం ఏర్పాటు, ఫ్యూ పాయింట్‌కు అనుకూలంగా ఉన్న ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, ఫరహాబాద్ వ్యూపాయింట్‌ల అభివృద్ధిని చేయాలని ప్రతిపాదించారు.
4804 కోట్లు
Published Thu, Aug 21 2014 3:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement