District Plan
-
4804 కోట్లు
- జిల్లా ప్రణాళిక సిద్ధం - 10,174 పనులు గుర్తింపు.. - 22న జెడ్పీ పాలక మండలి సమావేశం - ప్రణాళికకు ఆమోదం తెలిపే అవకాశం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా చేపట్టిన ప్రణాళిక సిద్ధమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకొని వారికి కావలసిన అభివృద్ధి పనులను రాష్ట్ర బడ్జెట్లో పొందుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు-మన ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో నేరుగా నిధులు కేటాయించకుండా గ్రామస్థాయిలో ఏఏ పనులు అవసరమో నేరుగా గ్రామస్థాయి ప్రజలను భాగస్వామ్యం చేశారు. ఈ మేరకు జిల్లాలో 10,174 పనులను గుర్తించారు. దీనికి 4804 కోట్ల రూపాయలు అవసరమని నిర్ణయించారు. గ్రామ ప్రణాళికలో జిల్లాలోని 1331 గ్రామ పంచాయతీల్లో మొత్తం 484 పనులను గుర్తించారు. ఇందుకు గాను రూ.2776 కోట్లు నిధుల అవసరం కానున్నట్లు అంచనా వేశారు. మండల స్థాయి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 64మండలాల్లోని ప్రణాళికలను కలుపుకొని 640 పనులకు రూ.2028 కోట్ల అంచనా వేశారు. జిల్లాస్థాయిలో మొతం 50 రకాల పనులు గుర్తించారు. ఈ పనులకు సంబంధించిన నిధుల అంచనాలను ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం... శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సిద్ధం చేసిన ప్రణాళికను ఆమోదానికి పెట్టనున్నారు. జెడ్పీ ఆమోదం పొందిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచేలా చూడనున్నారు. ఆదే రోజు జిల్లా పరిషత్ పరిధిలో ఉండే మొత్తం 7స్టాండింగ్ కమిటీలను ఎన్నుకోనున్నారు. జిల్లాస్థాయి ప్రణాళికలు.... తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండడంతో ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్ట్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే గట్టు మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతోపాటు జిల్లా ప్రజల కల అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు, గద్వాల, నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్, నేషనల్ హైవే, స్టేట్ హైవే కింద కొల్లాపూర్ నుంచి జడ్చర్ల, జడ్చర్ల నుంచి కోదాడ వయా కల్వకుర్తి రోడ్లను ప్రతిపాదించారు. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో ఏరియా ఆసుపత్రులకు ఏర్పాటు, మఖ్తల్, నారాయణపేట్, జడ్చర్ల, అలంపూర్, మహబూబ్‌నగర్, కొత్తకోటల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పెద్దకొత్తపల్లి, ఇటిక్యాల(మాడల్), వడ్డెపల్లి, తెల్కపల్లి, తలకొండపల్లి, దౌల్తాబాద్, కొడంగల్, కొత్తూర్,లింగాల్, బొమ్రాస్పేట్, నర్వ, బిజినపల్లి, చిన్నచింతకుంట, హన్వాడ, ఉప్పునుంతలలో ప్రభుత్వ జూనియర్‌కాలేజీలు, బల్మూర్, అమ్రాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆమన్‌గల్, కల్వకుర్తి, బాలుర అచ్చంపేట, గద్వాల, వడ్డేపల్లి, దేవరకద్ర, మక్తల్‌లలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మించేందుకు ఎంపిక చేశారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రాజోలి మళ్లింపు పథకం, బీమా లిఫ్ట్ ఇరిగేషన్లకు కెనాల్ లైనింగ్ వర్క్స్ చేపట్టాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. గద్వాల నుంచి మాచర్ల వరకు డబుల్ లైన్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లాను పర్యటకరంగంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా ప్రణాళికలో ప్రతిపాదనలను పొందుపర్చారు. ఇందుకు గాను కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించేందుకు బోటింగ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఈ బోటును నడిపేందుకు ప్రతిపాదించారు. దీంతోపాటు ఎకో టూరిజం ప్రాజెక్ట్, పిల్లలమర్రిలో ఆంపి థియేటర్‌తోపాటు పార్క్‌ను ఏర్పాటు చేయాలని, మహబూబ్‌నగర్‌లో మినీ శిల్పారామం ఏర్పాటు, ఫ్యూ పాయింట్‌కు అనుకూలంగా ఉన్న ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, ఫరహాబాద్ వ్యూపాయింట్ల అభివృద్ధిని చేయాలని ప్రతిపాదించారు. -
జిల్లా ప్రణాళిక ఖరారు
సాక్షి, కరీంనగర్ : జిల్లా ప్రణాళిక ఎట్టకేలకు ఖరారైంది. 50 పనులు.. రూ.904.17 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం వెళ్లాయి. జిల్లాలో అవసరాలు, ప్రాధాన్యాంశాల ప్రకారం పనులను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మండల- జిల్లా ప్రణాళికలు నిర్వహించింది. వీటిలో చివరి కార్యక్రమమైన జిల్లా ప్రణాళికలో పనుల గుర్తింపు కోసం గత నెల 25న అత్యవసరంగా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు. తొలుత రూ.5 వేల కోట్లతో 110 పనులకు ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇన్ని పనులు.. నిధుల మంజూరు అనుమానంగా ఉండడం, జిల్లా ప్రణాళికలో కేవలం 30 ప్రాధాన్యతా పనులు గుర్తించి జాబితాను పంపాలని ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పనుల తగ్గింపుపై కసరత్తు చేశారు. చివరకు.. పనులను 50కి, వ్యయాన్ని రూ.904 కోట్లకు కుదించారు. వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ముఖ్యమైన కొన్ని పనుల వివరాలు రూ. 99.99 కోట్లతో మంథని ముత్తారం, మెట్పల్లి, కోహెడ , సిరిసిల్ల, కాల్వశ్రీరాంపూర్, ఇబ్రహీంపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో మానేరువాగుపై బ్రిడ్జిల నిర్మాణం రూ.99.99 కోట్లతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రహరీలు, తాగునీటి వసతుల కల్పన రూ.99 కోట్లతో 33/11 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ ం రూ.93.53 కోట్లతో ఐదు నియోజకవర్గాల్లో చెరువుల ప్రత్యేక మరమ్మతు రూ.42.60 కోట్లతో జిల్లాలో ఐటీఐ, మైనార్టీ విద్యార్థుల కోసం వసతి గృహాల నిర్మాణం రూ.67.62 కోట్లతో జిల్లాలో వ్యవసాయ గోదాములు, ఆఫీసుల ఏర్పాటు రూ.50 కోట్లతో కమాన్‌పూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నంలో డిగ్రీ కళాశాలల ఏర్పాటు రూ.25 కోట్లతో మెట్పల్లి, మహదేవ్పూర్, జగిత్యాల, మానకొండూరులో కోల్స్టోరేజీ గోదాముల ఏర్పాటు. -
జిల్లా ప్రణాళిక రూ.15వేల కోట్లు
నీలగిరి : రాబోయే ఐదేళ్ల కాలంలో జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనుల కోసం రూ.15 వేల 513 కోట్ల, 51లక్షలతో రూపొందించిన జిల్లా ప్రణాళికకు జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలి ప్రణాళికలో మున్సిపాలిటీలు తప్పించి గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫ్లోరైడ్ నివారణకు చేపట్టాల్సిన చర్యలు, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్ల నిర్మాణాలు, విద్య,వె ద్యానికి ప్రాధాన్యమిచ్చారు. ‘మన జిల్లా- మన ప్రణాళిక’లో భాగంగా రూపొందించిన ప్రణాళికకు స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ అధ్యక్షతన ‘మన జిల్లా-మన ప్రణాళిక’ పై కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మన ప్రణాళిక’ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధిలో మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దశలవారీగా ప్రణాళిక అమలు.. ఐదేళ్ల లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రణాళికను దశలవారీగా అమలు చేయనున్నారు. తొలుత మొదటి ఏడాది పూర్తయ్యే పనులకు సంబంధించిన ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత నిధుల సమీకరణ, పనుల అంచనాలకు తగ్గట్టుగా రెండు నుంచి ఐదేళ్లలో పూర్తి చేస్తారు. ఈ ఐదేళ్లలో 28 శాఖలు ప్రణాళికాబద్ధంగా ఎంతమేర నిధులు అవసరమవుతాయో ఆ ప్రకారంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. దీంట్లో ప్రభుత్వంనుంచి విడుదలయ్యే బడ్జెట్‌తోపాటు, వివిధ వనరుల ద్వారా సమకూరే నిధుల వివరాలను కూడా పేర్కొన్నారు. తొలి ఏడాది ప్రణాళికలో చేపట్టాల్సిన పనులు.. మన జిల్లా-మన ప్రణాళికలో 2014-15కు శాఖాపరంగా చేపట్టే కార్యక్ర మాలకు రూ. 3447 కోట్ల బడ్జెట్ రూపొందించారు. దీనిలో ప్రధానంగా తాగు, సాగునీరు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, అర్అండ్బీ, విద్యుత్ శాఖలకు ప్రాధాన్యమిచ్చారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి రూ.575 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.265 కోట్లు, వైద్యానికి రూ. 51 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.13.95 కోట్లు, చేనేత జౌళి శాఖకు రూ.87.80 కోట్లు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖకు రూ.444.76 కోట్లు, ఆర్అండ్బీ రహదారులకు రూ .77 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ. 110.78 కోట్లు కేటాయించారు. వ్యక్తిగత సమస్యలకు చోటు.. మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, మొక్కల పెంపకం (తెలంగాణ హరితహారం), చేపట్టాలని నిర్ణయించింది. అదే విధంగా 2017 నాటికి మరుగుదొడ్లు లేని గ్రామాలను చేయాలని సంకల్పించింది. దీంతో పాటు ఈ ప్రణాళికలో గ్రామాల్లో వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. మన ఊరు-మన ప్రణాళిక గ్రామసభల్లో ప్రజల నుంచి వృద్ధాప్య పెన్షన్లు కావాలని 70 వేలు, వితంతు పెన్షన్ల కోసం 60 వేలు, వికలాంగ పెన్షన్లు 40 వేలు, చేనేత పెన్షన్లకు సంబంధించి 4 వేలమంది దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో వృద్ధాప్య పెన్షన్‌దారుల వయోపరిమితి 60 నుంచి 65 ఏళ్లకు పెంచనుంది. దీంతో జిల్లాలో పెన్షన్లుదారుల సంఖ్య 4 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 3 లక్షల 23 వేల మంది పెన్షనుదారులున్నారు. ఇందులో 4 శాతం పెన్షన్లు కోత పడే అవకాశం ఉంది. రేషన్ కార్డుల విషయానికొస్తే 95 వేల మంది కొత్తగా దరఖాస్తు చేశారు. ఇప్పటికే జిల్లా జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కార్డుల ఏరివేత అనంతరం దరఖాస్తు చేసిన వారిల్లో అర్హులకు కార్డులు ఇస్తారు. ఏకగ్రీవ తీర్మానాలు.. మన జిల్లా-మన ప్రణాళిక అధికారుల ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రామ, మండల స్థాయి ప్రణాళికలో నమోదు కాకుండా ఏమైన ప్రతిపాదనలు ఉన్నట్లయితే శాసనసభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులకు మూడు రోజులు గడువు ఇచ్చారు. ఈ లోగా వారు ప్రతిపాదించిన అంశాలను కూడా జిల్లా ప్రణాళికలో పొందుపరుస్తారు. జిల్లా ప్రణాళికలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. సీఎం ప్రవేశ పెట్టిన మన ఊరు-మన ప్రణాళికకు సభ్యుల ధన్యవాదాలు మూసీ ప్రక్షాళన చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తీర్మానం జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు తాగు, సాగునీటి ప్రాజెక్టులు సత్వర పూర్తి, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం. జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయింపు. వీటిన్నింటికి జిల్లా మంత్రి ఆమోదం తెలిపారు.