జిల్లా ప్రణాళిక ఖరారు
సాక్షి, కరీంనగర్ : జిల్లా ప్రణాళిక ఎట్టకేలకు ఖరారైంది. 50 పనులు.. రూ.904.17 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం వెళ్లాయి. జిల్లాలో అవసరాలు, ప్రాధాన్యాంశాల ప్రకారం పనులను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మండల- జిల్లా ప్రణాళికలు నిర్వహించింది. వీటిలో చివరి కార్యక్రమమైన జిల్లా ప్రణాళికలో పనుల గుర్తింపు కోసం గత నెల 25న అత్యవసరంగా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు.
తొలుత రూ.5 వేల కోట్లతో 110 పనులకు ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇన్ని పనులు.. నిధుల మంజూరు అనుమానంగా ఉండడం, జిల్లా ప్రణాళికలో కేవలం 30 ప్రాధాన్యతా పనులు గుర్తించి జాబితాను పంపాలని ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పనుల తగ్గింపుపై కసరత్తు చేశారు. చివరకు.. పనులను 50కి, వ్యయాన్ని రూ.904 కోట్లకు కుదించారు. వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచారు.
ముఖ్యమైన కొన్ని పనుల వివరాలు
రూ. 99.99 కోట్లతో మంథని ముత్తారం, మెట్‌పల్లి, కోహెడ , సిరిసిల్ల, కాల్వశ్రీరాంపూర్, ఇబ్రహీంపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో మానేరువాగుపై బ్రిడ్జిల నిర్మాణం రూ.99.99 కోట్లతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రహరీలు, తాగునీటి వసతుల కల్పన
రూ.99 కోట్లతో 33/11 కె.వి విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ ం
రూ.93.53 కోట్లతో ఐదు నియోజకవర్గాల్లో చెరువుల ప్రత్యేక మరమ్మతు రూ.42.60 కోట్లతో జిల్లాలో ఐటీఐ, మైనార్టీ విద్యార్థుల కోసం వసతి గృహాల నిర్మాణం
రూ.67.62 కోట్లతో జిల్లాలో వ్యవసాయ గోదాములు, ఆఫీసుల ఏర్పాటు రూ.50 కోట్లతో కమాన్‌పూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నంలో డిగ్రీ కళాశాలల ఏర్పాటు
రూ.25 కోట్లతో మెట్‌పల్లి, మహదేవ్‌పూర్, జగిత్యాల, మానకొండూరులో కోల్‌స్టోరేజీ గోదాముల ఏర్పాటు.