జిల్లా ప్రణాళిక రూ.15వేల కోట్లు | District Plan of Rs 15 thousand crore | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రణాళిక రూ.15వేల కోట్లు

Published Mon, Jul 28 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

జిల్లా ప్రణాళిక  రూ.15వేల కోట్లు

జిల్లా ప్రణాళిక రూ.15వేల కోట్లు

నీలగిరి : రాబోయే ఐదేళ్ల కాలంలో జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనుల కోసం రూ.15 వేల 513 కోట్ల, 51లక్షలతో రూపొందించిన జిల్లా ప్రణాళికకు జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలి ప్రణాళికలో మున్సిపాలిటీలు తప్పించి గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫ్లోరైడ్ నివారణకు చేపట్టాల్సిన చర్యలు, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్ల నిర్మాణాలు, విద్య,వె ద్యానికి ప్రాధాన్యమిచ్చారు. ‘మన జిల్లా- మన ప్రణాళిక’లో భాగంగా రూపొందించిన ప్రణాళికకు స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది.
 
 ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ అధ్యక్షతన ‘మన జిల్లా-మన ప్రణాళిక’ పై కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మన ప్రణాళిక’ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధిలో మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
 దశలవారీగా ప్రణాళిక అమలు..
 ఐదేళ్ల లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రణాళికను దశలవారీగా అమలు చేయనున్నారు. తొలుత మొదటి ఏడాది పూర్తయ్యే పనులకు సంబంధించిన ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత నిధుల సమీకరణ, పనుల అంచనాలకు తగ్గట్టుగా రెండు నుంచి ఐదేళ్లలో పూర్తి చేస్తారు. ఈ ఐదేళ్లలో 28 శాఖలు ప్రణాళికాబద్ధంగా ఎంతమేర నిధులు అవసరమవుతాయో ఆ ప్రకారంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. దీంట్లో ప్రభుత్వంనుంచి విడుదలయ్యే బడ్జెట్‌తోపాటు, వివిధ వనరుల ద్వారా సమకూరే నిధుల వివరాలను కూడా పేర్కొన్నారు.
 
 తొలి ఏడాది ప్రణాళికలో చేపట్టాల్సిన పనులు..
 మన జిల్లా-మన ప్రణాళికలో  2014-15కు శాఖాపరంగా చేపట్టే కార్యక్ర మాలకు రూ. 3447 కోట్ల బడ్జెట్ రూపొందించారు. దీనిలో ప్రధానంగా తాగు, సాగునీరు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, అర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖలకు ప్రాధాన్యమిచ్చారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి రూ.575 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.265 కోట్లు, వైద్యానికి రూ. 51 కోట్లు, పర్యాటక అభివృద్ధికి రూ.13.95 కోట్లు, చేనేత జౌళి శాఖకు రూ.87.80 కోట్లు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖకు రూ.444.76 కోట్లు, ఆర్‌అండ్‌బీ రహదారులకు రూ .77 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ. 110.78 కోట్లు కేటాయించారు.
 
 వ్యక్తిగత సమస్యలకు చోటు..
 మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, మొక్కల పెంపకం (తెలంగాణ హరితహారం), చేపట్టాలని నిర్ణయించింది. అదే విధంగా 2017 నాటికి మరుగుదొడ్లు లేని గ్రామాలను చేయాలని సంకల్పించింది. దీంతో పాటు ఈ ప్రణాళికలో గ్రామాల్లో వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. మన ఊరు-మన ప్రణాళిక గ్రామసభల్లో ప్రజల నుంచి వృద్ధాప్య పెన్షన్లు కావాలని 70 వేలు, వితంతు పెన్షన్ల కోసం 60 వేలు, వికలాంగ పెన్షన్లు 40 వేలు, చేనేత పెన్షన్లకు సంబంధించి 4 వేలమంది దరఖాస్తు చేశారు. అయితే ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో వృద్ధాప్య పెన్షన్‌దారుల వయోపరిమితి 60 నుంచి 65 ఏళ్లకు పెంచనుంది. దీంతో జిల్లాలో పెన్షన్లుదారుల సంఖ్య 4 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం  అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 3 లక్షల 23 వేల మంది పెన్షనుదారులున్నారు. ఇందులో 4 శాతం పెన్షన్లు కోత పడే అవకాశం ఉంది. రేషన్ కార్డుల విషయానికొస్తే 95 వేల మంది కొత్తగా దరఖాస్తు చేశారు. ఇప్పటికే జిల్లా జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కార్డుల ఏరివేత అనంతరం దరఖాస్తు చేసిన వారిల్లో అర్హులకు కార్డులు ఇస్తారు.
 
 ఏకగ్రీవ తీర్మానాలు..
 మన జిల్లా-మన ప్రణాళిక అధికారుల ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రామ, మండల స్థాయి ప్రణాళికలో నమోదు కాకుండా ఏమైన ప్రతిపాదనలు ఉన్నట్లయితే శాసనసభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులకు మూడు రోజులు గడువు ఇచ్చారు. ఈ లోగా వారు ప్రతిపాదించిన అంశాలను కూడా జిల్లా ప్రణాళికలో పొందుపరుస్తారు. జిల్లా ప్రణాళికలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది.

 సీఎం ప్రవేశ పెట్టిన మన ఊరు-మన ప్రణాళికకు సభ్యుల ధన్యవాదాలు
 మూసీ ప్రక్షాళన చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తీర్మానం
 జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు తాగు, సాగునీటి ప్రాజెక్టులు సత్వర పూర్తి, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం.
 జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయింపు. వీటిన్నింటికి జిల్లా మంత్రి ఆమోదం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement