ఆర్మూర్ : మహిళా రిజర్వేషన్లు అభాసుపాలవుతున్నాయి. పేరుకే మహిళా ప్రజాప్రతినిధులు.. వారి వెనక కుటుంబ సభ్యులే ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ గురువారం ఆర్మూర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన పట్టణం-మన ప్రణాళిక’ సమీక్ష సమావేశమే. మహిళా కౌన్సెలర్లకు బదులు వారి భర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభంకంటే ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు తప్ప సమావేశంలో ఎవ్వరూ ఉండకూడదని సిబ్బంది పలుమార్లు ప్రకటించారు. అయినా మహిళా కౌన్సెలర్ల భర్తలు సమావేశ మందిరంనుంచి బయటికి వెళ్లలేదు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని అలాగే నిర్వహించారు. సమావేశానికి మహిళా కౌన్సెలర్లు బోన్ల సుజాత, లత జో శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు.
మిగతా మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలు జాగిర్దార్ శ్రీనివాస్, నర్మె నవీన్, పింజ వినోద్, వన్నెల్‌దేవి రాము, మాలిక్ బాబా, మరో కౌన్సిలర్ అన్న సుంకరి రంగన్న సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతి సింగ్ భర్త సంజయ్ సింగ్ బబ్లూ సైతం సమావేశానికి వచ్చారు. సమావేశం ప్రారంభంలో టీఆర్‌ఎస్ నాయకులు, మరికొందరు మహిళా కౌన్సెలర్ల భర్తలు సైతం సమావేశానికి హాజరు కావడంతో టీడీపీ కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డికి కుర్చీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ కౌన్సెలర్‌కు కుర్చీ ఇవ్వని విధానం ఏంటని ప్రశ్నించడంతో కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోయారు. అధికారులు సైతం ఇదేమీ పట్టించుకోలేదు.
మహిళలు వంటింటికే!
Published Fri, Jul 25 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement