సాక్షి, మంచిర్యాల : ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా ఆయా గ్రా మాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర సర్కారు పునఃసమీక్షిస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రజల అవసరాలపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశిం చింది. దీంతో అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శులు సమాచార సేకరణలో బిజీగా మారారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ఆయా గ్రామాలు, ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టింది.
ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు కావాల్సిన రోడ్లు, మరుగుదొడ్లు, నీటిసదుపాయం, ఇతరత్రా సామాజిక అవసరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు వారంపాటు సాగిన ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించారు. వాటిని ‘మన మండలం-మన ప్రణాళిక’లో క్రోడీక రించి జిల్లా స్థాయికి నివేదికలు పంపించారు. జిల్లా ప్రజాపరిషత్ అధికారులు మండలాల సమగ్ర నివేదికలన్నింటి ఆధారంగా జిల్లాకు కావాల్సిన అవసరాలు పేర్కొంటూ సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. అయితే ఈ నమోదు తర్వాత ప్రభుత్వం మొదట ప్రకటించినట్లుగానే ఆయా వివరాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున తప్పుల తడకగా వివరాలు ఉండటం బయటకు వచ్చింది.
వాటితోనే చిక్కంతా..
గ్రామ ప్రణాళికలను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం కాస్త ఇళ్ల నిర్మాణం కోసం, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేదిగా మారింది. ఆయా పథకాల అర్హులు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఒక్కో గ్రామంలో నివసిస్తున్న ప్రజల కంటే పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్యే అధికంగా కనిపించింది. మరోవైపు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచినపుడు గ్రామ ప్రజల కంటే పింఛన్లు పొందుతున్నవారు ఎక్కువని, స్త్రీల కంటే వితంతువుల సంఖ్యే అధికమనే విచిత్రాలు కనిపించాయి.
ఈ అవకతవకలను సరిదిద్దేందుకు సర్కారు వాస్తవ వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జెడ్పీ కార్యాలయం నుంచి ఆయా మండలాల ఎంపీడీవోలకు వివరాలు తిరిగి అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన వారెందరు, పింఛన్ల రావాల్సినవారెందరు అనే సమచారాన్ని గ్రామకార్యదర్శుల ద్వారా ఎంపీడీవోలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సదరు దరఖాస్తుదారుల ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డుల సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఈ తంతు మరో రెండ్రోజుల్లో ముగించి 25వ తేదీ వరకు జిల్లా అధికారులు సమగ్ర నివేదిక సిద్ధంచేసుకునేలా కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మళ్లీ ఇవ్వండి!
Published Tue, Sep 23 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement