మంచిర్యాల సిటీ : ఉచిత నిర్బంధ విద్యను పటిష్టంగా అమలుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా పర్యవేక్షణపై మొదటగా దృష్టి సారించింది. పర్యవేక్షణ పకడ్బందీగా లేనిదే మెరుగైన విద్యనందించడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో శాసనసభ నియోజకవర్గానికో ఉప విద్యాధికారిని నియమించాలని భావిస్తోంది. విద్యాశాఖలో అడ్డగోలుగా ఖాళీలు ఉండడంతో ప్రాథమిక విద్య అడుగుంటిపోతోందని ఉపాధ్యాయ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ఒక్క జిల్లా విద్యాధికారితోపాటు ముగ్గురు మండల విద్యాధికారులే శాశ్వత అధికారులుగా పని చేస్తున్నారు. 49 మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలే ఉన్నారు.
పెరుగనున్న పోస్టులు
జిల్లాలో ప్రస్తుతానికి మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఇద్దరు ఇన్‌చార్జి డెప్యూటీ ఈవోలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున భర్తీ చేస్తే.. 10 నియోజకవర్గాలకు పది మంది ఉపవిద్యాధికారులు నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నియోజక వర్గాలు పెంచాలని సీఎం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. నియోజకవర్గాలు పెరిగితే అందుకు అనుగుణంగా మరిన్ని పోస్టులూ పెరుగుతాయి.
తగ్గనున్న భారం
నియోజకవర్గానికో ఉప విద్యాధికారి నియామకమైతే వారికి భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్నవారు 20కి పైగా మండలాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షించడం ఒక్కరితో సాధ్యం కాదు. నియోజకవర్గానికి ఒకరిని నియమిస్తే పరిపాలన సులభమవుతుంది. విద్యార్థులకు మెరుగైన విద్య అందే అవకాశాలు ఉంటాయి.
సర్వశిక్ష అభియాన్‌కు విద్యాశాఖ అధికారులే..
సర్వశిక్ష అభియాన్‌కు ఇన్నేళ్లుగా విద్యాశాఖకు సంబంధం లేని అధికారులే ప్రాజెక్టు అధికారులుగా నియమితులయ్యేవారు. కేంద్రం ఆదేశాల ప్రకారం పీవో పోస్టులు డీఈవో అజమాయిషీలోనే ఉండాలి. నాలుగేళ్ల కిందట ఈ విధానానికి స్వస్తి పలికింది. ఇతర విభాగాలకు చెందిన అధికారులను నియమించడంతో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులనే నియమించి ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నాలుగేళ్ల కిందటి మాదిరిగా అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నియోజకవర్గానికో ఉపవిద్యాధికారి
Published Thu, Aug 7 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement