సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’ జిల్లాలో గందరగోళంగా మారింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాల వారీగా ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రూ. 1372 కోట్లతో పనులకు జులై నెలాఖరు నాటికి ప్రణాళికలు తయారు చేసి వాటిని జిల్లా యంత్రాంగానికి సమర్పించారు. అయితే ఈ ప్రణాళికలో భారీగా పొరపాట్లు చోటు చేసుకోవడంతో యంత్రాంగానికి తలనొప్పి మొదలైంది. సోమవారం జిల్లా పరిషత్‌లో ఎంపీడీఓలు, ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో అసలు కథ బయటపడింది.
ఒకే కేటగిరీ పనులను గుర్తిస్తూ..
నిబంధనల ప్రకారం ప్రతి హాబిటేషన్ స్థాయిలో మూడు పనులు, మండల స్థాయిలో పది పనులు గుర్తించాలి. ఇలా గుర్తించే పనుల్లో వేరువేరుగా.. రోడ్డు, మురుగు నీటి పారుదల, తాగునీరు ఇలా ఉండాలి. కానీ పలు మండలాల్లో ఒకే కేటగిరీకి సంబంధించి రెండు, మూడు చొప్పున పనులు గుర్తిస్తూ ప్రణాళికలు తయారు చేసారు. దీంతో ప్రణాళిక కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ రెండో పనిని ఆమోదించడం లేదు. అదేవిధంగా హాబిటేషన్ స్థాయిలో మూడు పనులు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. కొన్ని మండలాల్లో పంచాయతీ స్థాయిలో మూడు పనులు చొప్పున గుర్తిస్తూ ప్రణాళికలు తయారు చేశారు. దాదాపు 17 మండలాల్లో రెండేసి పనులు గుర్తించినట్లు సమాచారం. ఫలితంగా ప్రణాళికలపై తీవ్ర గంద రగోళం నెలకొంది.
హడావుడిగా ‘సవరణ’లు..
గ్రామ, మండల స్థాయిలో రూపొందించిన ప్రణాళికల్ని సర్కారు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చే యాల్సి ఉంది. ఈనెల 8వతేదీతో సాఫ్ట్‌వేర్ మూతపడనుంది. ఆ తర్వాత జిల్లాల వారీగా సీఎం పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రణాళికపై ఆయన స్పందించనున్నారు. దీంతో గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ఎన్.శ్రీధర్ సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పలు మండలాలోని ప్రణాళికలు అసంపూర్తిగా ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాట్లను ప్రస్తావిస్తూ సాయంత్రానికల్లా సరిదిద్దాలని స్పష్టం చేశారు. దీంతో ఎంపీడీఓలు ప్రణాళికల్లో సవరణకు దిగారు. రాత్రి పొద్దుపోయేవరకు జిల్లా పరిషత్‌లోనే ఈ ప్రక్రియ కొనసాగింది.
తారుమారు..
ప్రణాళికల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో వాటిని సవరించేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. మొత్తంగా సోమవారం రాత్రికల్లా జిల్లా పరిషత్‌లో ఆయా ప్రణాళికలు సమర్పించారు. అయితే ఇందుకు సంబంధించి అంచనాలు కొలిక్కి రాలేదు. మండల, గ్రామ స్థాయికి సంబంధించిన ప్రణాళికల్లో పొరపాట్లను సరిదిద్దడంతో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. ప్రజాప్రతినిధులు, పాలకవర్గాల ఆమోదంతో ప్రణాళికల్లో చేర్చిన పలు పనులు తారుమారయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో మరింత గందరగోళం జరిగే అవకాశం ఉంది. ఎంపీడీఓల నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో పొరపాట్లను సరిదిద్ది ప్రణాళికలను వెబ్‌సైట్లో నిక్షిప్తం చేయనున్నట్లు జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
‘మన ఊరు-మన ప్రణాళిక’ ఉల్టా పల్టా...
Published Tue, Aug 5 2014 12:06 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement