ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు షురూ
ఐనవోలు (వర్ధన్నపేట రూరల్), న్యూస్‌లైన్ : వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు మల్లికార్జున స్వామి (ఐలోని మల్లన్న) ఉత్సవాలు ఆదివారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన , నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ వడిచర్ల శ్రీనివాస్, ఈఓ శేషుభారతి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
నేడు స్వామివారికి నూతన వస్త్రాలంకరణ
ఐనవోలు జాతర, బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం బోగిపండుగ సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, తోరణ బంధనం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము, ధ్వజారోహణం, మహాన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడోరోజు మంగళవారం మకర సంక్రాంతిని పురస్కరిం చుకుని మహన్యాస పూర్వక ఏకాద శ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేపట్టనున్నారు. ఇదేరోజు సాయంత్రం గుడిచుట్టు ప్రభలతో కూడిన ఎడ్లబండ్లు ప్రదక్షిణలు చేయనున్నాయి.
తరలివస్తున్న భక్తులు
జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు ఐనవోలుకు తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలకు సుమారు రెండు లక్షల మంది రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
400 మంది సిబ్బందితో బందోబస్తు : డీఎస్పీ సురేష్ కుమార్
జాతర బ్రహ్మోత్సవాల్లో 400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు మామునూరు డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపా రు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ సమీపంలో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జాతర నిర్వహణకు నలుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 29 మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, 156 మంది కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా హోం గార్డులు, 140 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించనున్నట్లు చెప్పారు. జాతరలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని ప్రజలకు సూచించారు.
ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ఐన వోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ హన్మకొండ డిపో మేనేజర్ అబ్రహం తెలిపారు. సోమవారం నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుపనున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు వరంగల్ జిల్లా బస్‌స్టేషన్ నుంచి ఐనవోలుకు నడుస్తాయని, చార్జీలు పెద్దలకు రూ.23, పిల్లలకు రూ.12గా నిర్ణయించినట్లు వివరించారు. అదే విధంగా ఐనవోలు నుంచి యాదగిరిగుట్ట, కొమురవెల్లి పోవాలనుకునే వారికి అక్కడి నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.