తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు
సింగరేణి భవనాలు పరిశీలించిన ఆర్డీఓ మహేందర్జీ
భూపాలపల్లి :
జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు పట్టణంలోని సింగరేణి భవనాలు ఉపయోగించుకోనున్నారు. తాత్కాలికంగా కలెక్టర్ కార్యాలయ ఏర్పాటుకోసం మంజూర్నగర్లోని సింగరేణి ఇల్లందు అతిథిగృహాన్ని ములుగు ఆర్డీఓ మహేందర్జీ సోమవారం పరిశీలించారు. తాత్కాలిక కలెక్టరేట్లో జేసీ, డీఆర్వో, అడ్మినిస్ట్రేటీవ్, ఏడీఈ, డీఎస్వో, డీఎం సీఎస్ తదితర కార్యాలయాలు ఏయే గదుల్లో ఏర్పాటు చేయాలనే విషయంపై స్థానిక రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. తమ సూచన మేరకు ఆయా శాఖల గదుల ఏర్పాటుకు ప్రనాళిక సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయనున్న స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుకనున్న దేవాదుల డేటా బేస్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం ఆర్డీవో విలేకరులతో మాట్లాడారు. జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం సింగరేణి భవనాలను గతంలోనే పరిశీలించి కలెక్టర్కు నివేదిక పంపామన్నారు. ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్న శాఖలకు గదుల ఏర్పాటు నిమిత్తం మరోసారి భవనాలు పరిశీలించామని తెలిపారు. శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదిక పంపామని, కార్యాలయాల ఏర్పాటు ఎక్కడా అనేది ఇంకా నిర్ణయించలేదని ఆర్డీవో వెల్లడించారు. ఆయనతో స్థానిక తహసీల్దార్ ఎన్.సత్యనారాయణ, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.