ఈ ఏడాదికి ‘ఏడు’ ప్రాజెక్టులు!
వందకోట్లు వెచ్చిస్తే చాలు.. సాగులోకి లక్ష ఎకరాలు
తెలంగాణ సర్కార్ తక్షణ {పాధాన్యమిదే
హైదరాబాద్: ఏడాది కాలంలో ఏడు ప్రాజెక్టులను పూర్తిచేసేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఒక భారీ, ఆరు మధ్యతరహా ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తిచేసి సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వీటికి మరో వందకోట్ల నిధులు వెచ్చిస్తే చాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతున్నట్లు తక్షణ ఆయకట్టు అభివృద్ధిలోకి వచ్చే ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యమిచ్చేలా నివేదికలు తయారుచేసింది. దీని ప్రకారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టుతో పాటు గొల్లవాగు, నీల్వాయి, పెద్దవాగు-జగన్నాథ్‌పూర్, రాళ్లవాగు, మత్తడివాగు, చౌట్పల్లి హన్మంతురెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం చివరిదశలో ఉంది. నిజానికి ఇందులో చాలా ప్రాజెక్టులు 2010-11, 2011-12 నాటికే పూర్తి చేయాలని గత ప్రభుత్వాలు నిర్దేశించుకున్నప్పటికీ భూసేకరణ సమస్య, కాంట్రాక్టర్ల ఆలస్యం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో పనులు పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2014-15లో పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం రూ.915 కోట్లు అవసరమని తేల్చిన ప్రభుత్వం ఇప్పటికే రూ.820 కోట్ల మేర ఖర్చు చేసింది. మరో రూ.100 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి.
మరో 16 ప్రాజెక్టులు రెండో దశలో..
పనులు పాక్షికంగా పూర్తిచేసుకున్న మరో 16 ప్రాజెక్టులను రెండోదశలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఉదయ సముద్రం, ఎస్సారెస్సీ స్టేజ్-2, కిన్నెరసాని, దేవాదుల, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2 వేల కోట్ల మేర కేటాయింపులు జరుపవచ్చని అంచనా వేస్తున్నా, 2015-16 నాటికి ఈ ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి వీటిద్వారా మరో 2 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరందించాలని చూస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లోనే నాగార్జునసాగర్, నిజాంసాగర్ల ఆధునికీకరణ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వరద కట్టల అభివృద్ధికి నిధులను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక భారీ ప్రాజెక్టులైన ప్రాణహిత-చేవెళ్ల, కాంతానపల్లి ప్రాజెక్టుల ప్రాధాన్యతను ప్రభుత్వం పూర్తిగా వెనక్కు నెట్టిన విషయం తెలిసిందే.