కరువు ఛాయలు
వరసగా రెండో సంవత్సరం నైరుతి రుతుపవనాలు దగా చేసేలా కనబడుతున్నాయి. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలు వింటుంటే గుండెలవిసిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదని, దీర్ఘకాలిక సగటులో అది 88 శాతంగా ఉండొచ్చునని ఐఎండీ అంటున్నది. అయితే, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లెక్కలు వేరేలా ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే దక్షిణ, ఈశాన్య, మధ్య భారత్‌లలో ‘దరిదాపుగా’ సాధారణ వర్షపాతం ఉంటుందనీ, లోటు ఉండొచ్చని ఐఎండీ చెబుతున్న వాయువ్య ప్రాంతంలోని పంజాబ్, హర్యానా, యూపీల్లో నీటి పారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయిగనుక ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవన్నది ఆయన అంచనా.
ఈ వర్షాల లేమి ఆహారోత్పత్తిపై అనుకున్నంత ప్రభావం చూపకపోవచ్చునని ఆయన ఇస్తున్న భరోసా నిజమైతే అంతకన్నా కావాల్సిందేముంది? వాతావరణ పరిస్థితులను అంచనావేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ సైతం వానల విషయంలో ఆందోళనపడాల్సిందేమీ లేదని చెబుతోంది. దేశ వాయువ్య ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుందన్న వాతావరణశాఖ జోస్యాన్ని సవాలు చేస్తోంది. రుతుపవనాలు కేరళను తాకడానికి మరో 48 గంటలు పడుతుందని వాతావరణ శాఖ తాజా అంచనాల నేపథ్యంలో అంతా మంచే జరగాలని అందరూ కోరుకుంటారు. అయితే కీడెంచి మేలెంచాలని అంటారు.
మన దేశంలో ఈనాటికీ 65 శాతంపైగా వ్యవసాయం వర్షాధారమే. ఆ వాననీటినైనా సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు మనదగ్గర లేవు. ఒక అంచనా ప్రకారం వానలద్వారా సమకూరే నీటిలో దాదాపు 90 శాతం సముద్రంలో కలిసిపోవడం లేదా ఆవిరైపోవడంవల్ల వృథా అవుతున్నది. తగినన్ని జలాశయాలు లేకపోవడం, ఉన్న జలాశయాల్లో పూడిక తీయకపోవడం...కొద్దో గొప్పో నిధుల్ని సమకూరిస్తే పూర్తయ్యే ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంవల్ల వాననీటిని ఒడిసిపట్టడంలో దారుణంగా విఫలమవుతున్నాం. వాన నీరు సముద్రాల్లో కలుస్తుంటే నిస్సహాయంగా ఉండిపోతున్నాం.
ఆహార నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఎవరూ ఆందోళనపడాల్సింది లేదని అరుణ్‌జైట్లీతోపాటు కేంద్ర ఆహారమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కూడా హామీ ఇస్తున్నారు. దేశ ఆర్థికవ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు. మన ఆర్థిక వ్యవస్థ బాగోగులు మౌలికంగా వ్యవసాయంతో ముడిపడి ఉంటాయి. వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడితే వాటి ప్రభావం ఆర్థికవ్యవస్థపై గణనీయంగా ఉంటుంది. అందువల్లనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాలను రిజర్వ్ బ్యాంకు 7.8 శాతంనుంచి 7.6 శాతానికి తగ్గించింది. అంతేకాదు...అధిక ధరల ప్రమాదం ఏర్పడకుండా అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్రానికి సూచించింది.
ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే నిలకడైన ఆర్థికవృద్ధి సాధ్యపడదని గుర్తుచేసింది. అనావృష్టి ప్రభావం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై మాత్రమే కాదు...ఇతరేతర రంగాలపై కూడా పడుతుంది. ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటి మంచినీటి సమస్య ఏర్పడుతుంది. పశుగ్రాసం దొరక్క పాడిపరిశ్రమ దెబ్బతింటుంది. వ్యవసాయంలో వచ్చే సంక్షోభం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను క్షీణింపజేస్తుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి నశిస్తుంది. కూరగాయలు, తిండిగింజల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇన్నిరకాలైన సమస్యలు వస్తాయి గనుక అందుకు దీటైన బహుముఖ వ్యూహం ఉండటం తప్పనిసరి.
ఎల్‌నినో వచ్చిన ప్రతిసారీ కరువు పరిస్థితులు ఏర్పడతాయనడానికి కూడా లేదని నిపుణులు చెబుతున్న మాట నిజమే. సర్వం దెబ్బతిందనుకుంటున్న తరుణంలో పడిన వర్షాలవల్ల పంటలు నిలబడి మంచి దిగుబడి వచ్చిన సందర్భాలు గతంలో లేకపోలేదు. స్కైమెట్ చెబుతున్న ప్రకారమైతే అంతా సవ్యంగానే ఉండొచ్చు కూడా. అలాగని పూర్తి భరోసా పెట్టుకోవడం మంచిది కాదు. అంతక్రితం సంవత్సరంతోపోలిస్తే నిరుడు వరి సాగు విస్తీర్ణం 53 శాతం తగ్గింది. నూనె గింజల సాగు 85 శాతం, పత్తి సాగు 28.9 శాతం తక్కువగా ఉన్నాయి. కనుక ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఉత్తమం. వాతావరణాన్ని దారినపెట్టడం ఎటూ కుదిరేపని కాదు గనుక దాని దుష్ఫలితాలను తగ్గించడం, వీలైతే పూర్తిగా నియంత్రించడం ప్రభుత్వాలు చేయాల్సిన పని.
ఎన్డీయే సర్కారు వచ్చాక గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కుంటుబడింది. తక్షణం దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చిన్న కమతాల రైతులు కూడా ఈ పథకం కింద ఉపాధి పొందగలిగితే, దానిలో ఇస్తున్న వేతనాలను గణనీయంగా పెంచితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. ఆరుగాలం శ్రమించే రైతుకు కుడి, ఎడమల దన్నుగా నిలవాల్సిన సమయం ఇదే. వర్షాభావ పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేయాలో సలహాలివ్వడం దగ్గరనుంచి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం, వ్యవసాయ విస్తరణ సేవలు మూలమూలనా అందేలా చూడటంవరకూ ఎంతో చేయాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని అవసరమైన వ్యూహాలకు రూపకల్పన చేయడం ముఖ్యం. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చూడకపోతే పాడికి ఇబ్బందులేర్పడతాయి. పశువులను కబేళాకు పంపడం తప్ప రైతుకు గత్యంతరం ఉండదు.
ఇప్పుడు నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టు తర్వాత క్రమేపీ పెరిగి వచ్చే జనవరికి 6.14 శాతం వరకూ ఉండొచ్చునన్న రిజర్వ్‌బ్యాంక్ అంచనా నేపథ్యంలో ద్రవ్యోల్బణం అదుపునకు బియ్యం, గోధుమ నిల్వల్ని తగినంతగా విడుదలచేస్తుండటం అవసరమవుతుంది. ఆహార నిల్వల విడుదలకు సంబంధించిన ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించగలిగితే కరువు ప్రభావం పెద్దగా ఉండదు. ఇదే సమయంలో లెవీ సేకరణ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) వంటి అంశాల్లో తన వైఖరిని పునరాలోచించుకోవాల్సిన అవసరం కేంద్రానికి ఉంది. లెవీ సేకరణ మందగిస్తే ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనడం అసాధ్యమవుతుంది. మొత్తంమీద ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి అవసరమైన పథకరచన చేసి ఎన్డీయే సర్కారు తన సమర్థతను నిరూపించుకుంటుందని ఆశిద్దాం.