కాల్సెంటర్ స్కాం సూత్రధారి తెలుగువాడేనా?
పుణె కేంద్రంగా సాగిన కాల్సెంటర్ స్కాం మొత్తానికి సూత్రధారులు కొందరు అమెరికాలో ఉన్నారని నిన్నమొన్నటి వరకు చెప్పారు. ఇప్పుడు ఆ సూత్రధారుల్లో ఒకరైన భోగవల్లి నరసింహ (50)ని అమెరికా పోలీసులు అరెస్టుచేశారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారులుగా నటిస్తూ కొంతమంది అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి.. పన్ను ఎగవేతలకు పాల్పడినందుకు మీపై వారంట్లు పెండింగులో ఉన్నాయని, వెంటనే తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బెదిరించి.. ఏడాది కాలంలోనే దాదాపు రూ. 500 కోట్ల వరకు వెనకేసుకున్నారు. ఇందుకోసం పుణెలో ఏకంగా ఏడంతస్థుల భవనాన్ని తీసుకుని, అందులో రోజుకు మూడు షిఫ్టులలో 24 గంటలు నడిచే కాల్ సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. దీనంతటికీ భారతదేశంలో పనిచేసిన వ్యక్తి షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ కాగా, అతడికి అమెరికాలో సహకరించినవాళ్లలో ప్రధానమైన వ్యక్తులలో ఒకరిగా భోగవల్లి నరసింహను గుర్తించారు. హైదరాబాద్కు చెందినట్లుగా చెబుతున్న నరసింహ మొదట్లో ఐబీఎంలో పనిచేసి, తర్వాత సొంతంగా టెక్డైనమిక్స్ అనే సంస్థను స్థాపించారు.
నరసింహను అమెరికాలో అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అమెరికా మేజిస్ట్రేట్ జడ్జి పాల్ డి స్టిక్నీ ఎదుట ప్రవేశపెట్టగా, తదుపరి విచారణ జరిగేవరకు పోలీసుల అదుపులో ఉంచాలని ఆదేశించారు. ఐఆర్ఎస్ ఏజెంట్లుగా తమను తాము చెప్పుకొన్న కొందరు.. అమెరికా పౌరులకు ఫోన్లు చేసేవారు. పన్నులు ఎగవేశారని, డబ్బు చెల్లించని పక్షంలో జైలుకు వెళ్లక తప్పదని.. మరి కొంత సేపట్లోనే సోదాలు జరగబోతున్నాయంటూ వాళ్లను భయపెట్టి.. వెంటనే ఖాతాల్లోకి డబ్బు వేయించుకునేవారు. భోగవల్లి నరసింహ తన పేరుమీద ఉన్న టెక్డైనమిక్స్ సంస్థ అకౌంటుతో పాటు టచ్స్టోన్ కమోడిటీస్ సంస్థ ఖాతాను కూడా ఉపయోగించారు. ఈ స్కాంలో మరికొన్ని ఖాతాలను కూడా ఉపయోగించారని, వాటిలో ఒకటి సిటీబ్యాంక్ అకౌంట్ అని పోలీసులు తెలిపారు. (కాల్సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!)
2014 నవంబర్ 5 నుంచి 2015 ఫిబ్రవరి 2వ తేదీ వరకు మొత్తం 242 సార్లు డబ్బులు డిపాజిట్ అయ్యాయని, వాటి మొత్తం విలువ సుమారు రూ. 11 కోట్లని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అకౌంటులో మరో రూ. 10 కోట్లు జమ చేయించుకున్నారు. ఇలా.. రకరకాల బ్యాంకు ఖాతాలతో ఇటు భారతదేశంలోను, అటు అమెరికాలోను కూడా వసూళ్లు సాగించారు. అమెరికాలో వసూలు చేసిన మొత్తాలను కూడా భారతదేశంలోని ఖాతాలకు మళ్లించేవారు. (23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు!)
నరసింహ ఏం చేసేవారు?
ఇర్వింగ్లో ఉన్న టచ్స్టోన్ కమోడిటీస్లో భోగవల్లి నరసింహ డైరెక్టర్గా లిస్ట్ అయినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆ సంస్థ పేరున అకౌంటు తెరిచేటప్పుడు.. తమది ఎగుమతులు - దిగుమతుల సంస్థ అని ఆయన పేర్కొన్నారు. కంపెనీ వెబ్సైట్లో మాత్రం తమ కంపెనీ ఇనుప ఖనిజం, స్టీలు, చెక్ చిప్స్ లాంటి ఖరీదైన ఉత్పత్తులను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. సంస్థ సైట్లో మాత్రం భోగవల్లిని సంస్థ చైర్మన్గా పేర్కొన్నారు. టెక్డైనమిక్స్ ప్రెసిడెంటుగా కూడా భోగవల్లి నరసింహ లిస్ట్ అయినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఈ సంస్థ టెక్నాలజీ, ఔట్సోర్సింగ్, కన్సల్టింగ్ అవసరాలు తీరుస్తుందని పేర్కొన్నారు.