అమ్మ అస్థిపంజరంతో ఆరునెలలు...
షాగంజ్: ఉత్తర ప్రదేశ్లో తల్లి అస్థిపంజరంతో ఆరు నెలలుగా ఉంటున్న ఓ మహిళను షాగంజ్ పోలీసులు గుర్తించారు. అర్జున్ నగర్లో బీనా అనే మహిళ తన తల్లి శవంతో ఆరునెలలుగా ఇంట్లో ఉంటోంది. రెండు రోజలుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి అస్థిపంజరాన్ని పోస్ట్మార్టంకు పంపించారు. బీనా (45) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, ఆమె తల్లి ప్రభుత్వ రిటైర్డు నర్సు. బీనా తల్లికి వచ్చే పింఛనుతోనే కుటుంబం నడిచేదని స్థానికులు తెలిపారు. బీనా మానసిక పరిస్థితి బాగాలేదని సమాచారం. పోస్ట్మార్టం రిపోర్టు వచ్చాక బీనా తల్లి మరణానికి కారణాలు తెలుస్తాయని ఫోరెన్సిక్ నిపుణుడు అజయ్ అగర్వాల్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.