Shailendra Kumar Joshi
-
ఇక ఆస్తి పన్నుల మోత!
* మున్సిపాలిటీల్లో పన్నుల పెంపునకు రంగం సిద్ధం * ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు ప్రతిపాదనలు * 5 కార్పొరేషన్లు 36 మున్సిపాలిటీల్లో అక్టోబర్ 1 నుంచి * కొత్తగా ఏర్పడిన 26 పురపాలక సంస్థల్లో ఏప్రిల్ 1 నుంచి.. * నివాస భవనాలపై 12 ఏళ్ల తర్వాత పెరగనున్న పన్నులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ స్థాయిలో ఆస్తి పన్నుల వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు పుష్కర కాలం తర్వాత పురపాలక, నగర పాలక సంస్థల్లో ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆస్తి పన్నులు పెరగనున్నాయి. ఈ మేరకు ఆస్తి పన్నుల పెంపునకు అనుమతి కోరుతూ పురపాలక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు కూడా. ఇక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదం లభించాల్సి ఉంది. సీఎం అనుమతి రాగానే ఆస్తి పన్నుల సవరణకు పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించనుంది. మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తి పన్నులను సవరించాల్సి ఉంది. కానీ చివరిసారిగా నివాస భవనాలపై 12 ఏళ్ల కింద, నివాసేతర (నాన్ రెసిడెన్షియల్) భవనాలపై ఏడేళ్ల కిందట ఆస్తి పన్నులను పెంచారు. ఆ తర్వాత మళ్లీ సవరణ జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో అన్ని రకాల వ్యయం కూడా ఎన్నో రెట్లు పెరిగిపోవడంతో... ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి పురపాలక, నగరపాలక సంస్థలు విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి తక్షణమే ఆస్తి పన్నులను పెంచాల్సి ఉందని పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పుష్కర కాలం తర్వాత.. శాస్త్రీయంగా ఆస్తి పన్నుల గణన విధానాన్ని ప్రవేశపెడుతూ... 1990లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన ఆస్తి పన్నుల తొలి సవరణ 1993 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు రెండో సవరణ 2002 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి గత 12 ఏళ్లుగా నివాసగృహాలపై ఆస్తి పన్నులను సవరించలేదు. అయితే 2007 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడో సవరణను నివాసేతర భవనాలపై మాత్రమే అమలు చేస్తున్నారు. ఈ మధ్య ఒక సారి ఆస్తి పన్నుల పెంపు ప్రయత్నాలు జరిగినా.. మున్సిపల్, సాధారణ ఎన్నికల కారణంగా గత పాలకులు వెనుకడుగు వేశారు. కొత్తవాటికి ఇంకా ముందే! రాష్ట్రంలోని మొత్తం 68 పురపాలక సంస్థల్లో... ఆరు నగర పాలక సంస్థలు కాగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి 62 ఉన్నాయి. ఇందులో 23 నగర పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు కలిపి 26 పురపాలక సంస్థలు ఇటీవల కొత్తగా ఏర్పడినవే. ఈ 26 చోట్ల మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా ఆస్తి పన్నుల పెంపునకు మూడు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కసరత్తు దాదాపు పూర్తికాగా.. ఏప్రిల్ 1 నుంచి పెంపును అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మినహా.. మిగతా ఐదు కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లో అక్టోబర్ 1 నుంచి ఆస్తిపన్ను పెరగనుంది. -
మునిసిపల్ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో మునిసిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గత మూడు రోజుల్లో నలుగురు మునిసిపల్ కమిషనర్లు బదిలీ కాగా..గురువారం ఒక్క రోజే 10 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తి పన్నుల వసూళ్లు, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పన్నుల్లో పురోగతితోపాటు వ్యక్తిగత వ్యవహార ైశె లిని పరిగణలోకి తీసుకుని ఈ బదిలీలను చేపట్టనట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజుల్లో 14 మంది బదిలీ కాగా, వారిలో ఐదుగురు కమిషనర్లకు తదుపరి పోస్టింగ్ కేటాయించకుండా పురపాలకశాఖ డెరైక్టరేట్‌కు సరెండర్ చేయడం గమనార్హం. గతంలో హుస్నాబాద్ నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసిన పి.ప్రభాకర్‌ను అందోల్-జోగిపేట కమిషనర్‌గా బదిలీ చేస్తూ పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. మునిసిపల్ కమిషనర్ల బదిలీలు ఇలా ఉన్నాయి. -
ఇళ్ల నిర్మాణ ఎత్తుపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇళ్ల నిర్మాణ ఎత్తుపై మళ్లీ ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక వసతులు లేకపోయినా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అపార్ట్మెంట్ల సంస్కృతికి కళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ సొసైటీల్లో వ్యక్తిగత ఇంటికోసమం టూ మూడునాలుగు అంతస్తుల భవనాలకు అనుమతి తీసుకుని ఆ తరువాత అపార్ట్మెంట్లుగా మారుస్తున్నారని, దీంతో ఆ కాలనీలో మౌలిక వసతులు సరిపోవడంలేదని పలు హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయన్నారు. అదీగాక సొసైటీ నిబంధనలను సైతం ఉల్లంఘిస్తున్నారని అందువల్ల భవన నిర్మాణం ఎత్తుపై ఆంక్షలు విధించాలని కోరినందున ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భవన నిర్మాణ ఎత్తుపై ఆంక్షలు ప్రధానంగా మౌలిక వసతుల లేమి ఉన్నచోట, పర్యావరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం, వారసత్వ సంపద పరిరక్షణ, రాతి సముదాయం ఉన్న ప్రాంతాలు, చరిత్రాత్మక, పురావస్తు ప్రాధాన్యత ఉన్న కట్టడాలకు అడ్డంగా నిర్మాణాలు జరిగే చోట, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలున్న ప్రాంతాల్లోనూ విధిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు ప్రభుత్వం సుమోటోగా తీసుకోవడం లేదా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, నగర పంచాయతీ, మునిసిపాలిటీల కమిషనర్లు, హౌసింగ్ సొసైటీలు విజ్ఞప్తి చేసిన పక్షంలో.. ఆయా ప్రాంతాలనూ నోటిఫై చేసి ఎత్తుపై ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. ఏఏ ప్రాంతాల్లో ఎత్తు నిర్మాణంపై ఆంక్షలు విధించాలన్నది ఆయా ప్రాంతాల స్వభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నోటిఫై చేస్తామన్నారు. వంద అడుగుల రోడ్డును ఆనుకుని ఉండే పెద్ద విస్తీర్ణం ప్లాట్లలో ఎంత ఎత్తు వరకైనా నిర్మాణం చేసుకోవడానికి ప్రస్తుతం అనుమతినిస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనే ఉత్తర్వులు ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో రహదారి, మౌలిక వసతుల గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా 400 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల భవనాలు రావడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నందున ఈ నిర్ణయానికి వచ్చినట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం ఎత్తుపై ఆంక్షలు విధించడానికి అవకాశం లేనందున ఈ ఉత్తర్వులతో ఆంక్షలు విధించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందని చెప్పారు. -
డీటీసీపీలుగా పదోన్నతులకు నిబంధనల సడలింపు: శైలేంద్ర కుమార్ జోషి
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖలో పట్టణ ప్రణాళిక విభాగ అదనపు సంచాలకులుగా ఉన్న ముగ్గురు అధికారులకు పట్టణ ప్రణాళిక సంచాలకులుగా పదోన్నతి కల్పించడానికి నిబంధనల్లో సడలింపునిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సంచాలకులు వి.నరేందర్, ఎస్. దేవేందర్‌రెడ్డి, ఎస్. బాలకృష్ణ పేర్లను కూడా డెరైక్టర్ పదవి కోసం తాత్కాలిక పద్దతిలో పదోన్నతులు కల్పించడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో కోరారు. జీహెచ్ఎంసీలో హౌస్ నంబరింగ్ సెల్, పురపాలక శాఖలో డెరైక్టర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో డెరైక్టర్ ప్లానింగ్ పోస్టుల కోసం వీరి పేర్లు పరిశీలించాలని పేర్కొన్నారు.