Shambara Polamamba
-
రాష్ట్ర పండుగగా పోలమాంబ జాతర
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించినట్టు రాజమహేంద్రవరం ఆర్జేసీ ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా శంబర గ్రామంలోని పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఏయే పనులు అవసరమో, ఎంత నిధులు అవసరమో ప్రణాళికలు తయారు చేసి అందించాలని ఈవో వి.రాధాకృష్ణను ఆదేశించారు. ఫలించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర కృషి శంబరపోలమాంబ అమ్మవారు (గిరిజనుల దేవత) జాతర రాష్ట్రంలో అతిపెద్ద జాతరని, అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గిరిజన సంక్షేమ శాఖమంత్రి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని సమ్మక్క, సారక్క జాతరకు ఉన్నంత విశిష్టత ఆంధ్ర రాష్ట్రంలో శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు ఉందని వివరిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శంబర పోలమాంబ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా గుర్తింపునివ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మ పండగ.. గుండె నిండుగా
ఎవరికైనా జనవరిలో ఒకటే పండగ వస్తుంది.. అదే సంక్రాంతి. శంబర గ్రామస్తులకు మాత్రం ప్రత్యేకం. రెండు పండగలు వస్తాయి. సంక్రాంతి పండగ అయ్యాక పది రోజులకు వచ్చే శంబర జాతర. జనవరి 27, 28, 29 తేదీల్లో జరగనున్న శంబర పోలమాంబ జాతరకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామస్తుల ఇళ్లల్లో అమ్మ పండగ పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. మక్కువ: ఏటా శంబర పండగ, సంక్రాంతి పండగలను ఒకే నెలలో నిర్వహిస్తుంటారు. సాధారణంగా సంక్రాంతి పండగంటే పిండి వంటల తయారీ, నూతన వస్త్రాల కొనుగోలు, ఆడపిల్లలు, అల్లుళ్లు, ఆడపడుచులను పిలవడం, నూతన వస్త్రాలు, కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, అయిదేళ్లకోసారి గ్రామదేవత పండగలను మార్చి, మే నెలల్లో జరుపుకొంటారు. శంబర గ్రామంలో మాత్రం ఏటా జనవరిలో రెండు పండగలు నిర్వహిస్తుంటారు. సంక్రాంతి పండగ జరిగిన 10 రోజుల తరువాత శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఏటా నిర్వహిస్తుంటారు. జాతర కోసం గ్రామస్తులు ఎదురు చూస్తారు. ఏటా జాతర వల్ల మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వవని వారి నమ్మకం.. విశ్వాసం. కూలోనాలో చేసి జాతర సమయానికి కొంతసొమ్మును కూడబెట్టుకుంటారు. మిగిలిన వారితో సమానంగా పిల్లలకు బట్టలు, పెద్దఅమ్మవారికి, రథంమానుకు చీరలు చూపించి, కోళ్లు మొక్కుబడులు చెల్లించుకుంటారు. చుట్టాలు, బంధువులను పండగకు ఆహ్వానిస్తారు. జనవరి 27 తొలేళ్లు, 28న సిరిమాను, 29న అనుపోత్సవం నిర్వహణకు గ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుట్టింటి వారికిఆహ్వానం సంక్రాంతికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చు చేస్తారు. శంబర పండగకు మాత్రం సుమారు రూ.30 వేల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఖర్చవుతుంది. సంక్రాంతి పండగ మధ్యాహ్నం శంబర గ్రామస్తులు కన్నవారింటికి వెళ్లి, శంబర పండగకు కన్నవారిని ఆహ్వానిస్తారు. గ్రామానికి చెందిన యాదవులు అయిదేళ్లకోసారి గాబు సంబరాలు ఘనంగా జరుపుకొంటారు. మూడు, నాలుగు కుటుంబాలు కలిసి సుమారు రూ.లక్ష వరకు ఖర్చుచేసి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. పొదుపు చేస్తాం ఏడాది మొత్తం కష్టపడి శంబర పండగకు కొంతసొమ్మును దాచుకుంటాం. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగను హాయిగా జరుపుతాం. పూర్వం నుంచి వచ్చిన సంప్రదాయాలను ఆచరిస్తున్నందుకు గర్వంగా ఉంది. – నైదాన పైడితల్లి, మహిళ, శంబర ఏటా జరుపుతాం ఏటా గ్రామంలో లక్షలాదిమంది భక్తుల మధ్య జాతర జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. జాతరకు చుట్టాలు, బంధువులతో గ్రామం, ఇళ్లు కళకళలాడతాయి. సంక్రాంతి పండగకంటే.. శంబర పండగకే ఇళ్లకు రంగులు వేయించుకుంటాం. శంబర పండగంటే మాకు అంత ఇష్టం. – మడ్డు మంగ, శంబర తల్లి పండగంటే ఎంతో ప్రీతి తల్లి పండగ వస్తుందంటే ఎంతో సంబరంగా ఉంటుంది. ఇంట్లో ఇబ్బందులున్నా, తల్లిని మొక్కుకుంటే అప్పులు పుడతాయి. ఏడాది మొత్తం ఖాళీ లేకుండా పనులు దొరకడంతో అప్పులు తీర్చుకునేందుకు అవకాశముంటుంది. బంధువుల్ని పిలిచి పండగను ఆనందంగా చేసుకుంటాం.– బెవర పోలమ్మ, మహిళ, శంబర జాతర ఏర్పాట్లు ముమ్మరం మక్కువ: ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు దేవాదాయ శాఖాధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చదురుగుడి వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వనంగుడి వద్ద, చదురుగుడి వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వనంగుడి వద్ద భక్తులు తాగునీటి కుళాయిలు నిర్మిస్తున్నారు. గోముఖినది ఒడ్డున రహదారికి ఇరువైపులా తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు మాత్రమే తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయాలని, మరోవైపు ఏర్పాటుచేసి భక్తులు నడకకు ఇబ్బంది పెట్టరాదని సాలూరు సీఐ సింహాద్రినాయుడు హెచ్చరించారు. చదురుగుడి క్యూలైన్ల వద్ద భక్తుల తలనీలాలకు టెంట్లు ఏర్పాటు చేశారు. వినోద కార్యక్రమాలకు ఇతర జిల్లాల నుంచి వివిధ సర్కస్ కంపెనీలు గ్రామానికి చేరుకున్నాయి. సిరిమానోత్సవం రోజు పూజారి సిరిమాను అధిరోహించేందుకు అవసరమైన పక్కా భవనాన్ని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. పక్కా ప్రణాళికతోజాతర మక్కువ: భక్తులు ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో శంబర జాతర నిర్వహించాలని బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలీ ఆదేశించారు. శంబర గ్రామంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ముందుగా ప్రధానాలయం ముందు రహదారిని పరిశీలించి, ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు? భక్తులను ఏయే మార్గంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలిస్తున్నారు అన్న అంశాలను సీఐ సింహాద్రినాయుడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం చదురుగుడి వెనుకన ఉన్న క్యూలైన్లను ఆమె పరిశీలించారు. క్యూలైన్లు ఇరుగ్గా ఉన్నందున వాటి సంఖ్య పెంచాలని దేవదాయశాఖ సిబ్బందిని ఆదేశించారు. క్యూలైన్ సమీపంలో కాలువ వద్ద పలకలు లేకపోవడంతో భక్తులు ప్రమాదాల బారిన పడే అవకాశమున్నందున తక్షణమే కాలువ వద్ద చదును చేసి రెండు మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. తలనీలాలు, గోముఖి నదికి వెళ్లే మార్గం, క్యూలైన్‌కు వెళ్లే మార్గం రెండుగా విభజించాలన్నారు. క్యూలైను సమీపంలో కొబ్బరికాయలు కొట్టిన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానాలయం ముందు వీవీఐపీలు, వీఐపీల సదుపాయం కోసం టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వనంగుడి వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించి, భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సీఐ సింహాద్రినాయుడు, ఎస్ఐ రాజేశ్‌లను ఆదేశించారు. -
అంబర మంటిన శంబరం
భక్తజనంతో శంబర గ్రామం పోటెత్తింది. పోలమాంబ దర్శనానికి వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవారితో గ్రామం కిటకిటలాడింది. ఉదయం నుంచి ఏ వీధిలో చూసినా జనమే కనిపించారు.తెల్లవారుఝామునుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం ప్రారంభమైన సిరిమానోత్సవం అంబరాన్ని తాకింది. సరిగ్గా మూడున్నర గంటలకు మొదలైన సిరిమానోత్సవం సాయంత్రం వరకు సాగింది. చల్లంగ చూడుతల్లీ...పోలమాంబ... పాహిమాం... పోలమాంబ అంటూ భక్తుల నినాదాలతో గ్రామం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులుఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం, మక్కువ(సాలూరు): శంబర పోలమాంబ సిరిమానోత్సవం భక్తజన సంద్రం నడుమ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి కూడా భక్తులు బస్సులు, ప్రత్యేక వాహనాల ద్వారా తరలివచ్చా రు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువఝామునుంచే క్యూలైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 3.25గంటలకు పూజారి జన్ని పేకాపు జగది అలియాస్ భాస్కరరావు సిరిమానును అధిరోహించారు. గతేడాది కంటే ఈ ఏడాది 20నిమిషాలు ఆలస్యంగా సిరిమానోత్సవం మొదలైంది. అంత కుముందు జన్నివారి ఇంటినుంచి ఘటాలను సిరి మాను ఉండే ప్రదేశానికి తీసుకువచ్చారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీరలు పరచి వాటిపై చిన్నారులను పడుకోబెట్టగా వారిపై అమ్మవారి ఘటాలు దాటుతూ వెళ్లడంతో భక్తులు పులకించిపోయారు. జన్నివారి ఇంటినుంచి ఘటాలను గిరడ వారింటికి, ఆ తరువాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకువెళ్లి పూజ లు జరిపించారు. ఆ వెనుక సిరిమాను ఆనవాయి తీ ప్రకారం గిరడ వారింటికి, ఆ తరువాత మునసబు, కరణం ఇళ్లకు వెళ్లి మొక్కులు అందుకున్నా రు. అక్కడి నుంచి పణుకువీధి, గొల్లవీధి, జన్నివీధుల మీదుగా సిరిమాను ఊరేగించి, సాయంత్రం 5.35 గంటలకు ప్రధాన రహదారి వద్దకు చేరుకుంది. పోటెత్తిన భక్తజనం ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, రాష్ట్రాల నుంచి కూ డా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉద యం 10గంటల తరువాత భక్తులు అధిక సంఖ్య లో తరలిరావడంతో గ్రామం కిటకిటలాడింది. గ్రామంలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. గతేడాది కంటే ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చినట్టు అధికారులు గుర్తించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అధికారులు సమన్వయంతో పనిచేసి క్యూలైన్ల ఏర్పాటు, బస్సుల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి చర్యలు పక్కాగా అమలు చేయడంతో భక్తులకు ఎలాటి ఇబ్బందులు కలగలేదు. పక్కాగా ఏర్పాట్లు క్యూలైన్లలో ఉండే భక్తులకు దేవాదాయశాఖ సిబ్బంది, సత్యసాయి సేవా సమితి కమిటీ, పోలీస్‌శాఖ వాటర్ ప్యాకెట్లు సరఫరా చేయడంతో ఉపశమనం కలిగింది. పార్వతీపురం సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్, ఐటీడీఏ పీఓ లక్ష్మీశ, ఓఎస్డీ రామమోహనరావు, ఏఎస్పీ సుమిత్గార్గ్ ఎప్పటికప్పుడు జాతరపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగు సూచనలు చేయడం మంచి ఫలితాలనిచ్చింది. ఈ ఏడాది పెద్ద పెద్ద పెండాల్స్తోపాటు పక్కాగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సమీపంలోనే తలనీలాలు సమర్పించే శిబిరం, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బంది పడలేదు. ప్రత్యేక దర్శనం క్యూలైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు, గంటకో మారు వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ప్రత్యేకదర్శనం క్యూలైన్ ద్వారా పంపించారు. పోలీసుల సేవలు భేష్ అమ్మవారి జాతరలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకూడదని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓఎస్డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్ పర్యవేక్షణలో 600 మంది పోలీసులను నియమించారు. రోప్ పార్టీ, స్పెషల్ పార్టీ, క్రైంపార్టీలు సక్రమంగా విధులు నిర్వర్తించాయి. దొంగతనాల వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రెండు డ్రోన్ కెమెరాలు, 25 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిరిమాను వద్ద రోప్‌పార్టీ భక్తులను నెట్టడంతో, సిరిమానును, పూజారిని తాకలేకపోయామని భక్తులు వాపోతున్నారు. సంతృప్తినిచ్చిన ఆర్టీసీ సేవలు భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది ఆర్టీసీ సంతృప్తికరమైన సేవలు అందించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏడు డిపోల నుంచి మంగళవారం 130 బస్సులను జాతర కోసం వేశారు. బొబ్బిలి, పార్వతీపురం నుంచి వచ్చిన ప్రైవేటు వాహనాలను చెముడు గ్రామం మీదుగా మళ్లించడం వల్ల కొంత ట్రాఫిక్‌ను నియంత్రించారు. సాలూరు నుంచి మామిడిపల్లి మీదుగా కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే విడిచిపెట్టి, ఇతర వాహనాలను కందులపథం మీదుగా పంపించడంతో ట్రాఫిక్ సమస్య తగ్గింది. గ్రామానికి కలెక్టర్ వరాలు కలెక్టర్ హరిజవహర్‌లాల్, సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్, ఐటీడీఏ పీఓ, ఓఎస్డీ రామమోహణరావు, ఏఎస్పీ సుమిత్గార్గ్, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వి.ఎస్.ఎన్.మూర్తి జాతరలో పర్యటించారు. అన్ని కంట్రోల్‌రూమ్‌లను పరిశీలించి, భక్తులకు అందిస్తున్న సేవలు, సదుపాయాలపై ఆరాతీశారు. కలెక్టర్ హరిజవహర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యపనులు ఎప్పటికప్పు డు సక్రమంగా జరిపిస్తున్నారని ప్రశంసించారు. అన్నిశాఖల అధికారులతో మాట్లాడి, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా చర్యలు చేపడుతున్న ట్లు తెలిపారు. అమ్మవారి గురించి డాక్యుమెంటరీ చేస్తున్నట్లు వెల్లడించారు. సిరిమాను తిరిగే వీధుల్లో రహదారి విస్తరణతోపాటు కాలువల ఏర్పాటు కు రూ. 35లక్షలు ఐటీడీఏ నుంచి అందిస్తామని ప్రకటించారు. ఎలక్షన్కోడ్ రాకముందే పనులు జరిపించాలని మాజీ సర్పంచ్ బడ్రాజు త్రినాథకు తెలిపారు. మామిడిపల్లి గ్రామం వద్ద మిగిలిన రెండు కిలోమీటర్ల రహదారి పనులకోసం 80లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వైద్యశిబిరాల ను డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.విజయలక్ష్మి పరిశీలించారు. ప్రముఖుల తాకిడి గ్రామానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ దంపతులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. పులివేషధారులు వారి ముందు కాసేపు ఆటలాడారు. పోలమాంబ అమ్మవారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. దేవాదాయశాఖాధికారులు అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపిం చారు. జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి కుటంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. అధికారుల సేవలు అద్భుతం సాలూరు రూరల్: శంబర పోలమాంబ జాతరలో అధికారులు ప్రశంసనీయమైన సేవలు అందించారు. ఉపవాసంతో వచ్చి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా డీఎమ్హెచ్ఓ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎమ్హెచ్ఒ రవికుమార్‌రెడ్డి సూచనల మేరకు 84 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. జాతరలో 5 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. సుమారు 550 మంది భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 600మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసినట్టు పార్వతీపురం ఏఎస్సీ సుమిత్ గార్గ్ తెలిపారు. శంబర నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో 5 ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
దండ ‘కారుణ్య దేవత’
పుణ్య తీర్థం శంబర పోలమాంబ దండకారుణ్యంలో గిరిజనుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల ఆరాధ్యదైవంగా ప్రఖ్యాతిగాంచింది. విజయనగరం జిల్లా, ‘మక్కువ’ మండలం, ‘మక్కువ’ గ్రామంలో కొన్ని శతాబ్దాల క్రితమే కొలువైన అమ్మ ఉత్తరాంధ్ర ప్రజల పూజలందుకుంటోంది. ఏటా అమ్మవారికి అంగరంగ వైభవంగా జరిగే జాతరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి, పోలమాంబను దర్శించుకుంటారు. మక్కువ గ్రామంలో వెలిసిన అమ్మవారిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది... నాలుగు శతాబ్దాల కిందట శంబర గ్రామం దండకారణ్యంలో ఉండేది. ఈ అటవీ ప్రాంతంలో శంబరాసురుడనే రాక్షసరాజు ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. ప్రజల వేడుకోలు విన్న అమ్మవారు పోలమాంబ రూపంలో శంబరాసురుని సంహరించిందని స్థానికులు చెబుతుంటారు. పోలమాంబ శంబరాసురుడిని వధించడంతో ఆ గ్రామానికి శంబరగా పేరు స్థిరపడిందని పల్లెవాసులు చెబుతున్నారు. శంబరాసురుని వధించిన తరువాత కూడా పోలమాంబ ఇక్కడే సామాన్యురాలిలా బతికి తనువుచాలించింది. ఆ తరువాత పూజలందుకుంటోంది. ఏటా జనవరినెలలో చినపోలమాంబ జాతర చేస్తారు. ఆ జాతరకు ముందు పెదపోలమాంబను గ్రామంలోకి తీసుకు వస్తారు. ఆమెను వారంరోజుల పాటు గ్రామంలో ఉంచి పూజలు చేస్తారు. అనంతరం అనుపుకోత్సవం నిర్వహించి, అదేరోజు చినపోలమాంబను గ్రామంలోకి తీసుకువచ్చేందుకు చాటింపు వేస్తారు. శంబర పోలమాంబ గ్రామానికి చేరుకుని 10 వారాల పాటు గ్రామంలో కొలువై భక్తుల పూజలందుకుంటారు. ఇద్దరు పోలమాంబలు వరుసకు మేనత్త– మేనకోడళ్లు అవుతారు. పోలమాంబ అమ్మవారి జాతర లో సిరిమానోత్సవం పోలమాంబ అమ్మవారి జాతరను వైభవంగా పండుగ చేసుకుంటారు. శంబర గ్రామస్తులలో పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లిన వాళ్లు, ఇతర చోట్ల నివసించే వారు కూడా శంబర జాతర సమయానికి సొంతూరుకి చేరుకుంటారు. అమ్మవారు శక్తిస్వరూపిణి. మంగళవారం రోజు పూజారి సిరిమాను రథంపై గ్రామంలోని అన్ని పురవీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అందువలన సిరిమాను అధిరోహించే పూజారికి అరటిపళ్లు, కొబ్బరికాయలు, చీరలు చూపించి భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారు. మక్కువ, సాలూరు మండలాలకు సమీపంలో ఉన్న అడవుల్లో లభ్యమయ్యే సుమారు 36 నుండి 42 అడుగుల సిరిమాను కర్ర (తాడిమాను)ను గ్రామపెద్దలు, ట్రస్టు కమిటీ సభ్యులు సిరిమానోత్సవానికి రెండురోజులు ముందుగా గుర్తిస్తారు. గ్రామం నుండి పశువులేర్లను తీసుకువెళ్లి వారితో సిరిమాను కర్రను ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాయితీ. గ్రామానికి చెందిన జన్నిపేకాపు వారి కుటుంబీకులు సిరిమానును అధిరోహిస్తారు. శంబర పోలమాంబ అమ్మవారి మహిమలను భక్తులు పలు కథలుగా చెప్పుకుంటారు. వాటిలో ఒకటి పోతికోడె రాళ్లమహిమ. అమ్మవారి ఆనవాళ్లే ఈ పోతికోడెరాళ్లని భక్తుల విశ్వాసం. ఆ రాళ్లకు మొక్కి కోరికలు కోరుకుంటే తప్పక కరుణిస్తుందని నమ్మకం. ఏటా గ్రామానికి చెందిన రైతులు తొలకరి పంటను సాగుచేసే ముందు పోతికోడెరాళ్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అమ్మవారి ప్రతిరూపం వేపచెట్టు గ్రామ ఆవలి ఒడ్డున ఉన్న వనంగుడి వెనుక ఉన్న వేపచెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తుంటారు. పోలమాంబ అమ్మవారు ఈ వేపచెట్టు వద్ద భూమిలో అంతర్థానం కావడం వలన జాతరకు వచ్చిన భక్తులు వనం గుడి వెనుకనున్న వేపచెట్టుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, చీరలు, జాకెట్లు పెట్టి, మొక్కుబడి తీర్చుకుంటారు. పది వారాల జాతర గతంలో అమ్మవారి జాతరను మూడువారాలపాటు నిర్వహించేవారు. అమ్మవారిపై భక్తులుకు నమ్మకం ఏర్పడటంతో ఇప్పుడు పది వారాలకు పెంచారు. అంతేకాకుండా సంవత్సరం పొడవునా ప్రతి మంగళ, ఆదివారాలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. నదుల గలగలలు... కొండకోనల పచ్చదనాలు శంబర గ్రామానికి కిలోమీటరు దూరంలో వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఎల్తైన కొండలు, జలజలపారే గోముఖీ, సువర్ణముఖీనదుల కలయిక ఎంతో ఆనందాన్నిస్తుంది. శంబర గ్రామం నుండి 8 కిలోమీటర్ల దూరంలో నంద గిరిజన గ్రామం ఉంది. చుట్టూ పెద్దపెద్ద కొండలు కనువిందు చేస్తాయి. అమ్మను దర్శించుకునేందుకు ఇలా రావాలి చత్తీస్ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు విజయనగరం వరకు ట్రైన్లో చేరుకోవాలి. అక్కడ నుండి సాలూరు వరకు ఆర్టీసీబస్సులలో చేరుకోవాలి. సాలూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబర గ్రామానికి లోకల్ సర్వీస్ ఆర్టీసీబస్సులుంటాయి. శంబరకు ప్రైవేటు వాహనాల్లో మామిడిపల్లి మీదుగా చేరుకోవచ్చు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం