దండ ‘కారుణ్య దేవత’ | Shambara polamamba special story | Sakshi
Sakshi News home page

దండ ‘కారుణ్య దేవత’

Published Wed, Sep 13 2017 12:13 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

దండ ‘కారుణ్య దేవత’

దండ ‘కారుణ్య దేవత’

పుణ్య తీర్థం

శంబర పోలమాంబ దండకారుణ్యంలో గిరిజనుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల ఆరాధ్యదైవంగా ప్రఖ్యాతిగాంచింది.   విజయనగరం జిల్లా, ‘మక్కువ’ మండలం, ‘మక్కువ’ గ్రామంలో కొన్ని శతాబ్దాల క్రితమే కొలువైన అమ్మ ఉత్తరాంధ్ర ప్రజల పూజలందుకుంటోంది. ఏటా అమ్మవారికి అంగరంగ వైభవంగా జరిగే జాతరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి, పోలమాంబను దర్శించుకుంటారు.

మక్కువ గ్రామంలో వెలిసిన అమ్మవారిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది... నాలుగు శతాబ్దాల కిందట శంబర గ్రామం దండకారణ్యంలో ఉండేది. ఈ అటవీ ప్రాంతంలో శంబరాసురుడనే రాక్షసరాజు ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. ప్రజల వేడుకోలు విన్న అమ్మవారు పోలమాంబ రూపంలో శంబరాసురుని సంహరించిందని స్థానికులు చెబుతుంటారు. పోలమాంబ శంబరాసురుడిని వధించడంతో ఆ గ్రామానికి శంబరగా పేరు స్థిరపడిందని పల్లెవాసులు చెబుతున్నారు. శంబరాసురుని వధించిన తరువాత కూడా పోలమాంబ ఇక్కడే సామాన్యురాలిలా బతికి తనువుచాలించింది.

ఆ తరువాత పూజలందుకుంటోంది.   ఏటా జనవరినెలలో చినపోలమాంబ జాతర చేస్తారు. ఆ జాతరకు ముందు పెదపోలమాంబను గ్రామంలోకి తీసుకు వస్తారు. ఆమెను వారంరోజుల పాటు గ్రామంలో ఉంచి పూజలు చేస్తారు. అనంతరం అనుపుకోత్సవం నిర్వహించి, అదేరోజు చినపోలమాంబను గ్రామంలోకి తీసుకువచ్చేందుకు చాటింపు వేస్తారు. శంబర పోలమాంబ గ్రామానికి చేరుకుని 10 వారాల పాటు గ్రామంలో కొలువై భక్తుల పూజలందుకుంటారు. ఇద్దరు పోలమాంబలు వరుసకు మేనత్త– మేనకోడళ్లు అవుతారు.

పోలమాంబ అమ్మవారి జాతర లో సిరిమానోత్సవం
పోలమాంబ అమ్మవారి జాతరను వైభవంగా పండుగ చేసుకుంటారు. శంబర గ్రామస్తులలో పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లిన వాళ్లు, ఇతర చోట్ల నివసించే వారు కూడా శంబర జాతర సమయానికి సొంతూరుకి చేరుకుంటారు. అమ్మవారు శక్తిస్వరూపిణి. మంగళవారం రోజు పూజారి సిరిమాను రథంపై గ్రామంలోని అన్ని పురవీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అందువలన సిరిమాను అధిరోహించే పూజారికి అరటిపళ్లు, కొబ్బరికాయలు, చీరలు చూపించి భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటారు. మక్కువ, సాలూరు మండలాలకు సమీపంలో ఉన్న అడవుల్లో లభ్యమయ్యే సుమారు 36 నుండి 42 అడుగుల సిరిమాను కర్ర (తాడిమాను)ను గ్రామపెద్దలు, ట్రస్టు కమిటీ సభ్యులు సిరిమానోత్సవానికి రెండురోజులు ముందుగా గుర్తిస్తారు.

గ్రామం నుండి పశువులేర్లను తీసుకువెళ్లి వారితో సిరిమాను కర్రను ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాయితీ. గ్రామానికి చెందిన జన్నిపేకాపు వారి కుటుంబీకులు సిరిమానును అధిరోహిస్తారు.  శంబర పోలమాంబ అమ్మవారి మహిమలను భక్తులు పలు కథలుగా చెప్పుకుంటారు. వాటిలో ఒకటి పోతికోడె రాళ్లమహిమ. అమ్మవారి ఆనవాళ్లే ఈ పోతికోడెరాళ్లని భక్తుల విశ్వాసం. ఆ రాళ్లకు మొక్కి కోరికలు కోరుకుంటే తప్పక కరుణిస్తుందని నమ్మకం. ఏటా గ్రామానికి చెందిన రైతులు తొలకరి పంటను సాగుచేసే ముందు పోతికోడెరాళ్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ.

అమ్మవారి ప్రతిరూపం వేపచెట్టు
గ్రామ ఆవలి ఒడ్డున ఉన్న వనంగుడి వెనుక ఉన్న వేపచెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తుంటారు. పోలమాంబ అమ్మవారు ఈ వేపచెట్టు వద్ద భూమిలో అంతర్థానం కావడం వలన జాతరకు వచ్చిన భక్తులు వనం గుడి వెనుకనున్న వేపచెట్టుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, చీరలు, జాకెట్లు పెట్టి, మొక్కుబడి తీర్చుకుంటారు.

పది వారాల జాతర
గతంలో అమ్మవారి జాతరను మూడువారాలపాటు నిర్వహించేవారు. అమ్మవారిపై భక్తులుకు నమ్మకం ఏర్పడటంతో ఇప్పుడు పది వారాలకు పెంచారు. అంతేకాకుండా సంవత్సరం పొడవునా ప్రతి మంగళ, ఆదివారాలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.

నదుల గలగలలు... కొండకోనల పచ్చదనాలు
శంబర గ్రామానికి కిలోమీటరు దూరంలో వెంగళరాయసాగర్‌ ప్రాజెక్ట్‌ ఉంది. అక్కడ ఎల్తైన కొండలు, జలజలపారే గోముఖీ, సువర్ణముఖీనదుల కలయిక ఎంతో ఆనందాన్నిస్తుంది. శంబర గ్రామం నుండి 8 కిలోమీటర్ల దూరంలో నంద గిరిజన గ్రామం ఉంది. చుట్టూ పెద్దపెద్ద కొండలు కనువిందు చేస్తాయి.

అమ్మను దర్శించుకునేందుకు ఇలా రావాలి
చత్తీస్‌ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు విజయనగరం వరకు ట్రైన్‌లో చేరుకోవాలి. అక్కడ నుండి సాలూరు వరకు ఆర్టీసీబస్సులలో చేరుకోవాలి. సాలూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబర గ్రామానికి లోకల్‌ సర్వీస్‌ ఆర్టీసీబస్సులుంటాయి. శంబరకు ప్రైవేటు వాహనాల్లో మామిడిపల్లి మీదుగా చేరుకోవచ్చు.
– బోణం గణేష్, సాక్షి, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement