shamsha bad
-
మూర్తీ’భవించిన రామానుజ స్ఫూర్తి
శంషాబాద్ రూరల్: నేటి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలను రూపుమాపడానికి, రామానుజుల స్ఫూర్తిని అందించడానికి సమతామూర్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చెప్పారు. బుధవారం నుంచి జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం వచ్చిన పోలీసులకు ఆయన ప్రవచనం చేశారు. రామానుజుల విశిష్టతను తెలియజేశారు. కూలీలు మొదలుకొని రైతుల, చిరు ఉద్యోగులు ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చారన్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం చాలా ఉందన్నారు. సమారోహ ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలని సిబ్బంది, అధికారులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఘట్టానికి సుమారు 7 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిమగ్నం కానున్నారు. ప్రధాన యాగశాల ఏర్పాట్లు పూర్తి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలకు ప్రధాన యాగశాలను సిద్ధం చేశారు. మరోవైపు సినీ చిత్ర కళాకారుడు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో ప్రవచన మండపంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. రెండు వేల మంది సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ మండపం నుంచే ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు వారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇవ్వనున్నారు. యాగశాల సమీపంలో ప్రభుత్వ వైద్యశాఖతో పాటు యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సేవల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం రేపిన వ్యక్తికి రిమాండ్
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరుతున్న విమానాల్లో బాంబులున్నాయంటూ తప్పుడు సమాచారం అందించి కలకలం సృష్టించిన కేవీ విశ్వనాథన్‌ను ఆదివారం ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. చెన్నైకి చెందిన విశ్వనాథన్ ప్రేమ విఫలం కావడంతో మద్యానికి బానిసై మానసికస్థితి సరిగా లేకపోవడంతో శనివారం ఉదయం చెన్నై వెళ్లే విమానాల్లో బాంబులున్నాయంటూ అధికారులకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. విమానాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు చెన్నై వెళ్లడానికి అక్కడే వేచి ఉన్న కేవీ విశ్వనాథన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అంతా ఉత్తిదేనని తేలింది. మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో పాటు సంచలనం సృష్టించాలనే ఆలోచనతో అతడు తప్పుడు సమాచారం అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. భద్రతకు భగ్నం కలిగించే ప్రయత్నంతో పాటు ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసినందుకు అతడిపై పౌర విమానయాన చట్టం ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆర్జీఐఏ సీఐ రామకష్ణ తెలిపారు. -
కారులో కణతపై కాల్చుకొని...
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై కాల్పుల కలకలం చెలరేగింది. ఓఆర్ఆర్పై గురువారం ఓ యువ వ్యాపారి కణతపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కొనఊపిరితో కొట్టు మిట్టాడుతుండగా పోలీసులు ‘108’అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి చేరుకున్నాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఉన్న తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట ప్రెస్‌రోడ్‌కు చెందిన ఫైజన్ అహ్మద్ కొన్నేళ్ల క్రితం జ్యోతిషిని ప్రేమవివాహం చేసుకున్నాడు. తర్వాత తన మకాంను లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జలవాయు విహార్ అపార్ట్మెంట్లోకి మార్చాడు. అందులోని మొదటిబ్లాక్‌లో సఫిల్‌గూడకు చెందిన పీవీ సుబ్రమణియంకు చెందిన ఫ్లాట్ నంబర్ 206ను 2013 అక్టోబర్‌లో అద్దెకు తీసుకున్నాడు. భార్యతో కలసి అక్కడే ఉంటున్నాడు. ఫైజన్ కుటుంబం చుట్టుపక్కలవారికి దూరంగా ఉండేది. విదేశాలకు వెళ్లేవారికి వీసా ప్రాసెసింగ్ చేసేందుకు పంజగుట్టలో ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అందులో తీవ్ర నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఆరు నెలలుగా ఫ్లాట్ అద్దె, మూడు నెలలుగా అపార్ట్మెంట్ నిర్వహణ రుసుములు కూడా చెల్లించట్లేదు. ఈయన గత ఏడాది అక్టోబర్‌లో డ్రివెన్ బై యు మొబిలిటీ సంస్థ నుంచి బెంజ్ కారు(టీఎస్ 09 యూబీ 6040) అద్దెకు తీసుకున్నారు. పదిహేను రోజులకోసారి అద్దె చెల్లించేలా సంస్థ నిర్వాహకుడు ఎస్ఎం జైన్‌తో ఒప్పందం చేసుకున్నారు. జలవాయు విహార్ అపార్ట్మెంట్ అసోసియేషన్‌కు ఫైజన్ ఇచ్చిన పత్రాల్లో తమకు బైక్‌తోపాటు కారు ఉన్నట్లు పేర్కొన్నారు. అయినా అద్దె వాహనంలో ఎందుకు తిరుగుతున్నారో తేలాల్సి ఉంది. అద్దెకు తీసుకున్న బెంజ్ కారులో వెళ్లి... అద్దెకు తీసుకున్న బెంజ్ కారులో గురువారం శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు ఓఆర్ఆర్ మీదుగా ఫైజన్ బయలుదేరారు. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని మంచిరేవుల సమీపంలో ఓఆర్ఆర్ పక్కనే కారును ఆపి అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న నాటు పిస్టల్‌తో కుడి కణతపై కాల్చుకున్నారు. తలలోకి దూసుకుపోయిన తూటా బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది. ఓఆర్ఆర్పై విధులు నిర్వహిస్తున్న గచ్చిబౌలి ట్రాఫిక్ కానిస్టేబుల్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ వాహనాన్ని గమనించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆగి ఉన్న కారు వద్దకు వెళ్లి పరిశీలించారు. స్టీరింగ్ సీట్లో కూర్చొని ఉన్న ఫైజన్ రక్తపు ముద్దకావడం, చేతిలో తుపాకీ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు, ‘108’కు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ఫైజన్‌ను అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న సెల్‌ఫోన్‌తోపాటు నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ప్రాంతంలోని ఓఆర్ఆర్ వద్ద ఉన్న సీసీ పుటేజీని నార్సింగి పోలీసులు పరిశీలించారు. వాహనంలో ఫైజన్ ఒక్కడే ఉన్నట్లు, ఆ సమయంలో సిగరెట్ తాగుతూ డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆర్థిక సమస్యలు చెప్పేవాడు నా ఫ్లాట్‌ను 2013లో నెలకు రూ.12 వేల చొప్పున ఫైజన్‌కు అద్దెకు ఇచ్చాను. ఏనాడూ సకాలంలో అద్దె చెల్లించేవాడు కాదు. 9 నెలలకు, ఆరు నెలలకు, అతడి వద్ద డబ్బులు ఉన్నప్పుడు చెల్లించేవాడు. ఉద్యోగ రీత్యా మేము కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 6 నెలల అద్దె బకాయి ఉంది. ఎప్పుడు అడిగినా ఆర్థిక సమస్యలు చెబుతుండేవాడు. – సుబ్రమణియమ్, ఫ్లాట్ యజమాని అక్రమ ఆయుధంగా నిర్ధారణ... ఆత్మహత్యకు ఫైజన్ వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు అక్రమ ఆయుధంగా నిర్ధారించారు. దీంతో ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. ఫైజన్ కోలుకున్న తర్వాత అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫైజన్ అద్దెకు ఉంటున్న జలవాయు టవర్స్ సున్నిత ప్రాంతం కిందికి వస్తుంది. ఇందులో అనేకమంది మాజీ, ప్రస్తుత త్రివిధ దళాలకు చెందిన అధికారులు, డిఫెన్స్ సంస్థ ఉన్నతోద్యోగులు నివసిస్తుంటారు. అలాంటి నివాస సముదాయంలోకి ఫైజన్ ఓ నాటుతుపాకీతో వెళ్లి వచ్చాడనే అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది అపార్ట్‌మెంట్‌తోపాటు అందులో నివసిస్తున్నవారికీ ముప్పని, తీవ్రమైన భద్రతా లోపమని వ్యాఖ్యానిస్తున్నారు. -
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
ఉందానగర్ రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతుండగా ఢీకొన్న రైలు శంషాబాద్, న్యూస్‌లైన్: ఏడడుగులు తనతో కలిసి నడిచిన భర్త కళ్లెదుటే రెప్పపాటు క్షణంలో దుర్మరణం పాలవడంతో ఆ భార్య గుండెలవిసేలా రోదించింది. పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో తల, మొండెం వేరై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సోమవారం శంషాబాద్ (ఉందానగర్) రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి భార్య కథనం ప్రకారం.. మండల పరిధిలోని పెద్దషాపూర్ తండాకు చెందిన సబావత్ సేవియా(45), లక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం వారు శంషాబాద్‌కు వచ్చారు. ఇంటికి సంబంధించిన సామగ్రి కొనుగోలు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో భార్యాభర్తలు శంషాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అటువైపు వెళ్లేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉండగా వారు పట్టాలు మీదుగా వెళ్తున్నారు. అప్పటికే లక్ష్మి పట్టాలు దాటి ఫ్లాట్ఫాంపైకి చేరుకుంది. పట్టాల మీది నుంచి ఫ్లాట్‌ఫాం ఎక్కేందుకు యత్నిస్తున్న సేవియాను కాచిగూడ నుంచి వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. దీంతో ఆయన తల, మొండెం వేరుకావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. రెప్పపాటు సమయంలో తన కళ్లేదుటే భర్త దుర్మరణం చెందడంతో లక్ష్మి గుండెలు బాదుకుంది. ఆమె రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. సేవియా మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, తండావాసులు పెద్దసంఖ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాచిగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.